4-పి కేంద్రీకరణా? వికేంద్రీకరణా!
- DV RAMANA
- Apr 3
- 2 min read

పేదరికం లేకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు ప్రకటించిన పబ్లిక్ (గవర్నమెంటు) ప్రైవేట్ (ఇన్వెస్టర్స్) పీపుల్ (ప్రజలు) పార్టిసిపేషన్ - కాన్సెప్ట్‌లో అస్పష్టత వుంది. ఈ ‘4పి’ పథకానికి ఆగస్టు 15 కల్లా తుదిరూపం ఇస్తామన్నారు. ఈ లోగానే ఈ పథకంపై ఆర్ధిక, సాంఘిక వేదికల మీద చర్చ జరగవలసిన అవసరం వుంది. వనరుల ఆధారంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఎక్కడికక్కడ ప్రోత్సహించే వికేంద్రీకరణ విధానాలు అమలైతేనే ‘4పి’ సఫలం కావచ్చు! పేదలకు సహాయం చేయడం, అవసరానికి ఆదుకోవడం మన సంఘంలోనే వుంది. రంజాన్ ప్రార్థనలకు ముందు ముస్లింలు పేదలకు ‘ఫిత్రా’ (దానధర్మాలు) చేస్తారు. క్రైస్తవులు తమ ఆదాయాల నుంచి కొంత సొమ్ము చర్చికి ఇస్తారు. హిందువులు ప్రతీ వైదిక క్రతువులో దానధర్మాలు దక్షిణలు ఇస్తారు. వ్యాపారస్తులు యాచకులకు రోజూ కొంత డబ్బు ఇస్తారు. ఇవన్నీ పేదలకు సాయపడేవే. మనుషుల అభిరుచి, శ్రమ నుంచి ఆయా రంగాలు వికసి స్తాయి. సంపదలు జమకూడుతాయి. పరస్పర ఆధారిత సమాజంలో ఆర్ధిక వనరులు పంపిణీ తీరునిబట్టే ఆర్దిక అసమానతలు తగ్గుతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. గ్రామ స్వరాజ్యమే ఇందుకు పరిష్కారమని గాంధీజీ ఎప్పుడో సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలు యూనిట్‌గా వికేంద్రీకరణ విధానాలు అమలయ్యేవి. 1972లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం విఫలమ య్యాక హైదరాబాద్‌కు వలసలు మొదలయ్యాయి. కోస్తా రాయలసీమ ప్రాంతాల క్రీమ్ అంతా రాజధాని చేరుకుంది. అక్కడే డబ్బు తిరిగింది. అక్కడే సంపదలు పోగుపడ్డాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నా లజీ విప్లవమై ప్రపంచాన్ని చుట్టేస్తున్నపుడు చంద్రబాబు హైదరాబాద్ మీదే దృష్టిపెట్టారు. ఈ కేంద్రీకృత విధానంవల్ల హైదరాబాద్‌కు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అక్కడ సంపదలు పెరిగి లక్షల మందికి ఉపాధి కేంద్రమైంది. అయితే మరో నగరం వృద్ధి కాకపోవడం వల్ల రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ నెత్తిమీద గొడుగులేని రాష్ట్రమైపోయింది. అమరావతిలో కూడా చంద్రబాబు కేంద్రీకృత ఆర్ధిక విధానాన్నే అవలంభిస్తున్నట్టు అర్ధమౌతోంది. అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ (3పి) విధానం వుంది. విదేశీ సంస్థలు లేదా అత్యంత సంపన్నమైన కంపెనీలు మాత్రమే అక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతాయి. ఇందులో సంపదల పంపిణీ పేదరికాన్ని తొల గించడానికి నేరుగా ఉపయోగపడదు. ఎక్కడికి అక్కడ ఆర్ధిక వనరుల పంపిణి జరగాలంటే వికేంద్రీ కరణ తప్ప మరో మార్గం లేదు. వైద్య ఆరోగ్యరంగాన్నే ఉదాహరణగా తీసుకుందాం.. చంద్రబాబు విధానాల వల్ల ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో 20 వరకూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి. వాటి యాజమాన్యాలన్నీ స్థానికంగా వున్నవే. వీటిలో కార్పొరేట్ యాజమాన్యాలు లేవు. ఆదాయ వ్యయాలు అక్కడక్కడే తిరుగుతూ వుంటాయి. సర్వీసులు, సప్లైల ద్వారా వందల మందికి పని డబ్బు దొరుకుతోంది. వేల వేల మంది పేషెంట్లకు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చుకే వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యం ఖర్చులకు ప్రజల ఆదాయాలకు పొంతన కుదరక జబ్బు పడినవారు మధ్యతరగతి వారైతే పేదలుగా అప్పుల్లోకి, పేదలైతే నిస్సహా యమైన దరిద్రంలోకి కూరుకుపోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల టీచింగ్ హాస్పిటల్స్‌లో పేషెంట్ల ఖర్చు 80 నుంచి 90 శాతం తగ్గిపోయింది. ఈ మిగుళ్ల ప్రయోజనం స్థానికులకే దక్కుతోందంటే అది వికేంద్రీకరణ ఫలితమే. ప్రతీ ప్రభుత్వమూ ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా హాస్పిటల్స్‌ను అప్పుల వడ్డీల భారాల్లోకి నెట్టేస్తూనే వుంది. ఇందులో జగన్‌కి, చంద్రబాబుకి ఏ మాత్రం తేడాలేదు. పేదల సంక్షేమానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి కూడా అనారోగ్యాలే ప్రజల్ని దరిద్రంలోకి నెట్టేస్తున్నాయన్న స్పృహ లేకపోవడం ఆశ్చర్యకరం. వైఎస్ ముద్ర వున్న ఆరోగ్యశ్రీకి చంద్రబాబు ఏదైనా ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నా రేమో తెలియదు. 4పి పథకం కోసం దాతల్ని వెతకడం ఒక పనిగా మారిపోకూడదు. అది ఒక సహజవిధానంగానే సాగిపోవాలి. ఇందుకు స్థానికులను భాగస్వాములు చేసే వికేంద్రీకరణ విధా నమే పరిష్కారం. చిన్న మధ్యతరహా పరిశ్రమలను, సర్వీసులను ప్రోత్సహించే విధానాలను ప్రభు త్వం అమలుచేస్తే దాతల కోసం వెతికే పని వుండదు!
コメント