50 రోజుల్లోనే ట్రంప్ తిరోగమనం!
- DV RAMANA
- Apr 16
- 2 min read

టారిఫ్(పన్నుల)ల బాదుడుతో ప్రపంచ దేశాలపై దాడికి దిగిన ట్రంప్ దొరకు తత్వం బోధపడి నట్లుంది. మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటన దేనికి సంకేతం? ఆయన మడమ తిప్పారనుకోవచ్చా? అయితే ప్రపంచ మార్కెట్ల పట్ల ఏ మాత్రం గౌరవం ప్రదర్శించని చైనా వస్తువులపై పన్నును మరింతగా పెంచి 125 శాతం విధిస్తున్నా మని, దీనిపై ఎలాంటి సంప్రదింపులు ఉండవని ట్రంప్ చెప్పటం మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదు. యావత్ ప్రపంచం మీద పన్నుల దాడి చేసిన ట్రంప్ నిర్వాకం కారణంగా భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు.. పన్నుల పెంపును మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే తిరిగి కోలుకున్నాయి. చిత్రం ఏమిటంటే చైనా విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకుండా.. మరింతగా పన్నులు పెంచిన తర్వాత కూడా చైనా స్టాక్‌మార్కెట్లు మిగతా వాటితో పాటు గురువారం కోలుకున్నాయి. అసలు చైనా మీద పన్నుల పెంపు ఎందుకు ప్రభావం చూపలేదు? దాని పర్యవసా నాలేమిటి? మిగిలిన దేశాలపై పన్నుల పెంపును మూడు నెలల వాయిదాకు దోహదం చేసిన అంశా లేమిటి? అన్న చర్చలు మొదలయ్యాయి. తమ మంత్రిత్వ శాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75 దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ చెప్పుకున్నాడు. అలాంటి వారి మీద సభ్య సమాజం ఉచ్చరించ టానికి సిగ్గుపడే పదజాలంతో రెచ్చిపోయాడు. రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ‘మనకు ఫోన్లు చేస్తున్న దేశాల వారు ప్లీజ్ ప్లీజ్ సర్ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను’ అని బతిమాలుతున్నారని, చివరకు తనను ముద్దు పెట్టుకుంటానన్నారని నోరు పారేసుకున్నాడు. ఇది నిజమా? అబద్ధాలు, గొప్పలు చెప్పటంలో ఆరితేరిన ట్రంప్ గురించి తెలిసిన ప్పటికీ తెరవెనుక సిగ్గు ఎగ్గూలేని అలాంటి బాపతు ఉన్నా ఆశ్చర్యం లేదు. చైనా సరేసరి తగ్గేదేలే అని చెప్పింది. మిత్రపక్షంగా ఉన్న ఐరోపా సమాఖ్య 2300 కోట్ల డాలర్ల మేరకు అమెరికా వస్తువులపై పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. కెనడా కూడా అదే బాటలో ఉంది. ఎటొచ్చీ మన దేశం మాత్రమే మౌనవ్రతం పాటిస్తోంది. ఎటూ చెప్పకుండా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తోంది. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తిరిగి వేరే దేశాలకు ఎగుమతి చేయవద్దని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఎగుమతిదార్లను హెచ్చరించారు. అలా జరుగుతోందని గతంలో ఎన్నడూ ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు మంత్రే అలా మాట్లాడారంటే జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోవచ్చు. గతంలో అలా చేసి ఉంటే.. మన దేశ ఎగుమతులు పెంచామని బీజేపీ పాలకులు కొట్టుకుంటున్న డబ్బా ప్రచారంపై అనుమానం కలగకమానదు. ఆ విషయం పక్కన పెడితే.. అమెరికా పన్నుల వాయిదా నిర్ణయానికి దారి తీసిందేమిటంటే ఏప్రిల్ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20 లక్షల మంది జనం అమెరికాలోని 1400 ప్రదేశాల్లో నిరసనలు, ప్రదర్శనలు చేశారు. పన్నుల పెంపు నుంచి వెనక్కు తగ్గకపోతే పెద్ద ఎత్తున ఉద్యమి స్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలం గా మాట్లాడిన దాఖలాల్లేవు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరుగుతుందని భావిం చిన ఎలన్‌మస్క్ సంపద ఇప్పటి వరకు 13,500 కోట్ల డాలర్లు హరించుకుపోయింది. చైనాతో సహా ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్ నవారో, మరో కీలక సలహాదారు ఎలన్‌మస్క్ రోడ్డెక్కి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ పరిణామాలతో గోడమీద పిల్లులు కూడా వ్యతిరేక శిబిరంలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపునకు పెద్ద స్పందన కనిపించటం లేదు. ఈ మూడు నెలల కాలంలో లొంగుబాటును ప్రదర్శించే దేశాలపై కొన్ని ఒప్పందాలను రుద్ది లబ్ధి పొందే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉండవచ్చు. ఒకడుగు వెనక్కు వేసిన ట్రంప్‌ను పూర్తిగా దారికి తేవాలంటే అమెరికన్లు మరింతగా వీధుల్లోకి రావాలి, బాధిత దేశాలన్నీ సమైక్యం కావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో భారీ విజయం సాధించి, అధ్యక్ష పీఠం అధిష్టించిన యాభై రోజుల్లోనే ‘పిచ్చివాడు’ అని పిలిపించుకున్న చరిత్ర, పూర్తి వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ట్రంప్‌దే!
Comments