top of page

80 కి.మీ. ... 4 సెకెన్లు.. 4 ప్రాణాలు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Nov 30, 2024
  • 1 min read
హైడ్రోప్లానింగ్‌తో ప్రమాదం
సీటుబెల్టులు ధరించకపోవడంవల్లే ప్రాణనష్టం
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం నాలుగు సెకెన్ల వ్యవధిలోనే నాలుగు ప్రాణాలను బలి తీసుకుంది. సిక్కోలుకు చెందిన నలుగురు ప్రయాణిస్తున్న ఫాచ్యూనర్‌ కారు టైరు పంక్చర్‌ అవడం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినా, వర్షపునీరు డివైడర్‌కు ఆనుకొని నిల్వ ఉండటం వల్ల వేగంగా వెళ్తున్న కారు స్కిడ్‌ అయి అవతలవైపు ఉన్న రోడ్డులోకి బోల్తా కొట్టినట్టు అర్థమవుతుంది. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడం వల్ల కూడా టైరు బరస్ట్‌ అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ యాక్సిడెంట్‌ వెనుక కారణాలను పరిశీలిస్తే మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. ఇందులో ప్రయాణిస్తున్నవారెవరూ సీటుబెల్టు ధరించలేదని మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్న దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే మరణించడానికి కారణం తలకు బలమైన గాయాలు కావడమే. వెనుక సీటులో కూర్చున్న మణిమాల శరీరమైతే పూర్తిగా మడతపడిపోయింది. కేవలం నాలుగు సెకెన్ల వ్యవధిలోనే కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీ కిందకు వెళ్లిపోయింది. వర్షం పెద్దగా లేకపోయినా రోడ్డు మీద నీరు ఎటూ పోడానికి వీళ్లేకపోవడం వల్ల డివైడర్‌ వరకు నిల్వ ఉంటుంది. దీని మీద కారు ప్రయాణించినప్పుడు హైడ్రోప్లానింగ్‌ అనే ప్రక్రియ జరుగుతుంది. నెమ్మదిగా వెళ్తే కారు స్కిడ్‌ అవుతున్నట్టు అర్థమవుతుంది. అదే వేగంగా వెళ్తే గతితప్పుతుంది. సాధారణంగా వర్షపు నీరు నిల్వ ఉన్నచోట చిన్నచిన్న కార్లయితే స్కిడ్‌ అవుతాయని, ఫార్చూనర్‌ లాంటి పెద్ద కార్లు ఎంత వేగం కొట్టినా ఏమీ కాదని భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఆ నమ్మకమే నాలుగు ప్రాణాలను తీసింది. శనివారం ఉదయం 8 గంటల 11 నిమిషాల 44 సెకెన్లకు ఫాచ్యూనర్‌ కారు లారీని ఢీకొట్టినట్లు రెండు సీసీ కెమెరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. శ్రీకాకుళం నుంచి పోలిపల్లి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లెక్కన శ్రీకాకుళంలో ఎన్నిగంటలకు బయల్దేరారో తేలాల్సి ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page