top of page

అంతా మత రాజకీయమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 9
  • 2 min read

వక్ఫ్‌ బిల్లుకు కాస్త ముందుగా మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించటం.. బిల్లు గెజిట్‌ అయిన మరురోజే శ్రీరామనవమి నాడు రామే శ్వరంలో పంబన్‌ బ్రిడ్జి ప్రారంభించి దాన్ని అయోధ్యతో ముడిపెట్టడం వంటివి ఒక వ్యూహంలో భాగమే. ఔరంగజేబు సమాధికి సంబంధించిన నాగపూర్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి దగ్గర్లోనే అల్లర్లు జరగటం.. కాశీ, మధురల్లో మసీదు`మందిర వివాదాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొనవచ్చని ఆ సంస్థ కీలక నాయకుడు దత్తాత్రేయ హూసబ్లే కాషాయ జెండా ఊపడం ఒక వరుస క్రమంలో జరిగాయి. మోదీ నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ మూలస్తంభాలైన హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌ల స్మృతిచిహ్నాలను సందర్శించటం కూడా అలా నిర్ణయించుకున్నదే. గతంలో వాటిని సందర్శించిన ప్రధానమంత్రి వాజ్‌ పేయి మాత్రమే. పూర్వాశ్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ అయిన మోదీ పదవి చేపట్టాక ఈ 11 ఏళ్లలో దాని ప్రధాన కార్యాలయానికి వెళ్లిన దాఖలాల్లేవు. మరి ఇప్పుడే ఎందుకు వెళ్లారు? ఈ మొత్తం పరిణామాల్లో పెద్ద రాజకీయమే ఉంది. మోదీ వ్యవహార శైలి సంఘ పరివార్‌ పెద్దలకు నచ్చలేదంటూ వచ్చే కథనాలు పరివార్‌ పాచికలు మాత్రమే. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది సాంస్కృతిక సంస్థ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో దానికి సంబంధం లేదనే భ్రమను కొనసాగించే ఎత్తుగడ అది. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన మంత్రివర్గం మొత్తం శాఖల వారీగా ఆర్‌ఎస్‌ఎస్‌ ముందు సమీక్షకు హాజరైందని మర్చిపోకూడదు. 2024 ఎన్నికలకు ముందు దేశానికి హిందూత్వ సంకేతం ఇవ్వడం కోసం అయోధ్య లో రామమందిర సంప్రోక్షణ కార్యక్రమానికి మోదీతో పాటు ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కూడా హాజరయ్యారు. మోదీ నాగ్‌పూర్‌ పర్యటన ఆర్‌ఎస్‌ఎస్‌తో రాజీకేనన్న ప్రచారం అర్థం లేనిది. 2024 ఎన్నికల్లో మెజారిటీ రాలేదు గనక మోదీని మార్చాలని భావిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో సర్దు బాటు కోసమే ఆయన వెళ్లారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అపహాస్యం చేస్తే.. నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కుండబద్దలు కొట్టడంలో సంకేతం అదే. ఒక హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని మోదీ సర్కార్‌ ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై నిషేధాన్ని ఎత్తివేసింది. చెట్టపట్టాలు వేసుకొని తిరిగే అవకాశం తనకు తానే ఇచ్చుకుంది. కాశీ, మధుర మసీదు`మందిర్‌ వివాదాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొనవచ్చని దత్తాత్రేయ హోసబలే చేసిన ప్రకటనను చూస్తే ఆ వివాదాలను తీవ్రతరం చేయాలని సంఫ్‌ు పరివార్‌ నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయోధ్య, కాశీ, మధుర.. ఈ మూడు చోట్ల వివాదాలపై ఉద్యమించాలని తాము గతంలోనే అధికారికంగా నిర్ణయించామని హోసబలే గుర్తు చేస్తున్నారు. 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం అయోధ్య మినహా మరెక్కడా ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదు. 1947 ఆగస్టు 15 నాటికి ఆయా ప్రార్ధన స్థలాల్లో ఉన్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాల్సి ఉంటుందని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. అయినా సుప్రీం కోర్టు కూడా ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించి వివాదాలకు అవకాశం ఇచ్చింది. వక్ఫ్‌ బిల్లు కూడా వివాదాలకు అవకాశం ఇచ్చింది. వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో ఇక ప్రతిచోటా వివాదాలు మొదలు కావచ్చు. ఇదేదో ఉత్తరాది సమస్య తప్ప దక్షిణాన, అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉండబోదని ఎవరైనా చెబితే అది హాస్యాస్పదమే. ఎందుకంటే ఆలయాల వివాదాలు, మతభేదాల గురించి కీలకంగా మాట్లాడే సనాతనవాద నేతగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ముందుకు వచ్చారు. తమిళనాడు లో అన్నాడీఎంకే మళ్లీ బీజేపీతో చర్చలు ప్రారంభించడం ఒకటైతే.. పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో ఇంట ర్వ్యూలిస్తూ అక్కడ కూడా రాజకీయ మైలేజీ కోసం తాపత్రయ పడుతున్నారు. మీకన్నా మేమే సనాతన ధర్మానికి ఎక్కువగా కట్టుబడి ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. పాస్టర్‌ ప్రవీణ్‌ మరణంపై సందేహాలు, సంవాదాలను కేవలం వైకాపా`టీడీపీ తగాదాగా, ఘర్షణగా చూపించే ధోరణిలో మంత్రి లోకేష్‌ తీవ్ర హెచ్చరికే చేశారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వంటి వారు దూరంగా ఉన్నట్టు మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో మతాల మధ్య చిచ్చు రాజేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మాటలు సరేసరి. వక్ఫ్‌ నుంచి టీటీడీ వ్యవహారాల వరకూ, నాగపూర్‌ నుంచి రామేశ్వరం వరకూ ప్రతిదీ వివాదాస్పదమై మత రాజకీయాలను మన ముంగిట్లోకి తెచ్చి నిలబెడుతున్నాయన్న నిజాన్ని అంగీకరించకతప్పదు.

Комментарии


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page