top of page

అక్రమాల అభ్యాసన!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 10
  • 3 min read



  • పాల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటులో కాసుల వేట

  • మెటీరియల్‌ కొనుగోళ్లలో కొందరు పెద్దల చేతివాటం

  • జిల్లా కేంద్రంలోని ఓ చిన్న షాపునకు భారీ బేరం

  • నాసిరకం.. అది కూడా తక్కువ సామగ్రితో సర్దుబాటు

  • ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారాయని ఆరోపణలు


బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొందరు అధికారుల అక్రమ సంపాదన పెంచుకునేందుకు ఉపయోగపడ్డాయి. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో బోధనను మెరుగుపరచి విద్యార్థుల గ్రహణశక్తిని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో తలపెట్టిన పాల్‌(పీఏఎల్‌) ల్యాబ్‌ల ఏర్పాటు ప్రక్రియ పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన మెటీరియల్‌ కొనుగోళ్ల నిబంధనలను కాలరాసి కేంద్రీకృత కొనుగోళ్ల ద్వారా కాసులు వెనుకేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విధంగా కమీషన్లు దండుకుని నాసిరకం మెటీరియల్‌ను పాఠశాలలకు అంటగడుతున్నారంటున్నారు.


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి వీలుగా పాల్‌ ల్యాబ్‌లు.. అంటే వ్యక్తిగత అనుకూల అభ్యాసన(పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌) ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దశలవారీగా అమలు చేస్తోంది. ప్రధానంగా ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌, తెలుగు సబ్జెక్టుల్లో ప్రత్యేక ల్యాబ్‌ల ద్వారా అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచాలని నిర్ణయించింది. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో 2024`25 విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 524 పాఠశాలల్లో పాల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సత్ఫలితాలు వస్తుండటంతో మరికొన్ని పాఠశాలలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని సమగ్రశిక్ష విభాగం ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ దఫా రాష్ట్రంలో ఉన్న 700 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పాల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ పాఠశాలలను ఎంపిక చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులతోపాటు బాలికలకు మెరుగైన అభ్యాసన సౌకర్యాలు అందుబాటులో తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యం ఉన్నతమైనదే అయినా దాని అమల్లోనే అక్రమాలకు బీజాలు పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్గదర్శకాలు పక్కాగా ఉన్నా..

పాల్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు సమగ్రశిక్ష ఉన్నతాధికారులు మార్గదర్శకాలు, నిబంధనలు పక్కాగానే రూపొందించారు. ఈ ఏడాది జనవరి 10, 27 తేదీల్లో జారీ చేసిన రెండు జీవోల ద్వారా జిల్లాస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి పదో తేదీన జారీ చేసిన జీవో ప్రకారం పాల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో ఒక కమిటీని నియమించాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీకి సమగ్రశిక్ష ఏపీసీ(అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌) మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఉప విద్యాశాఖాధికారులు, జిల్లా ట్యాబ్‌ ఇన్‌ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. అలాగే సమగ్రశిక్ష అధికారులు నామినేట్‌ చేసిన ఏఎస్‌వో లేదా ఏపీవోలు సభ్యులుగా, పాల్‌ ల్యాబ్‌లకు డీఎన్‌వోలుగా వ్యవహరిస్తారని ఈ జీవోలో పేర్కొన్నారు. కమిటీలోని సభ్యుల విధులు, బాధ్యతలను కూడా ఇదే జీవోలో స్పష్టంగా నిర్వచించారు. జనవరి 27న జారీ చేసిన రెండో జీవోలో పాల్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు అవసరమైన రూముల ఏర్పాటు, వాటిలో సమకూర్చాల్సిన సౌకర్యాలు, మెటీరియల్‌ కొనుగోలు, రిపేర్లు తదితర అంశాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేకంగా మళ్లీ పాల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ల్యాబ్‌ ఏర్పాటుకు రూము సౌకర్యం లేని చోట్ల ఆరు సాకెట్స్‌ కలిగిన ఆరు స్పైక్స్‌ కొనుగోలు చేసి ట్యాబ్‌లను రీఛార్జ్‌ చేసేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ఏ మెటీరియల్‌ ఎంత రేటుకు కొనాలన్నది కూడా ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత పక్కాగా జీవోలు ఉన్నా కూడా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోవడమే విచారకరం.

జిల్లాస్థాయిలోనే అక్రమాలు

పాల్‌ ల్యాబ్‌లకు అవసరమైన ఎలక్ట్రికల్‌, ఇతర కొనుగోళ్లను తమ అవసరాలను బట్టి కొనుగోలు చేసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లను ఆదేశించాలని సమగ్రశిక్ష జనవరి 27న జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.22,500 మంజూరు చేశారు. ఇందులో రూ.19,500 మెటీరియల్‌ కొనుగోలుకు, మిగిలిన రూ.మూడు వేలు ల్యాబ్‌లు ఏర్పాటు చేసే గదుల్లో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులకు వెచ్చించాలని సూచించారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ గానీ, ఇతర జిల్లా అధికారులు గానీ వీటిని కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అదే జరిగింది. పాఠశాలలకే ఇవ్వాల్సిన కొనుగోలు బాధ్యతలను జిల్లాస్థాయిలో కొందరు లాక్కుని అక్రమాలకు తెర తీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 54 రెసిడెన్షియల్‌, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో పాల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తుండగా వీటన్నింటి తరఫున ఏకమొత్తంగా మెటీరియల్‌ కొనుగోలు చేసే పెత్తనాన్ని సమగ్రశిక్ష ఏపీసీ శశిభూషణ్‌ తీసుకున్నట్లు తెలిసింది. అది కూడా కొటేషన్లు వంటి ప్రొసీజర్లు అనుసరించకుండా శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ సమీపంలో ఉన్న ఒక చిన్న షాపు నుంచి మొత్తం మెటీరియల్‌ కొన్నారని అంటున్నారు. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారాయని అలాగే తక్కువ రేటుకు కొని ప్రభుత్వ జీవోలో సూచించిన రేట్లకు బిల్లులు సిద్ధం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నాసిరకం మెటీరియల్‌ కొన్నారన్న, తక్కువ మెటీరియల్‌ కొనుగోలు చేసి దాన్నే పాఠశాలలకు సరఫరా చేసి సర్దుకోమని చెప్పారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని రకాలుగా చిలక్కొట్టుడుకు పాల్పడిన అక్రమార్కులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెరగకుండా దెబ్బకొడుతున్నారు. ఇచ్ఛాపురంలో ఉన్న పాఠశాలకు శ్రీకాకుళంలో వైర్లు, స్విచ్‌లు కొని పంపడానికే తడిపి మోపెడవుతుంది కదా.. అటువంటప్పుడు ఇక్కడ కొనుగోలు చేసి శశిభూషణ్‌ ఏం సంపాదిస్తారన్న అనుమానం కలగొచ్చు. కానీ ఈ మెటీరియల్‌ను తరలించడానికి ఆయన సర్వశిక్ష వాహనాలనే వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. బైజూస్‌ సంస్థ నుంచి పని చేస్తున్న వ్యక్తి సహకారంతో ఈ పాల్‌ ల్యాబ్‌లలో కమీషన్ల పాలు పిండుకున్నారని ఆరోపణలైతే ఉన్నాయి. ఎందుకంటే.. శశిభూషణ్‌ది మొదట్నుంచీ కమర్షియల్‌ ఫార్ములానే డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఉన్నప్పుడు కూడా తన సబ్జెక్టుకు సంబంధించిన గైడ్‌లు తయారుచేసి వాటినే విద్యార్థులు కొనాలని సూచించి, ఆ మేరకు మంచి వ్యాపారమే చేసేవారు ఇప్పుడు సమగ్రశిక్షకు వెళ్లిన తర్వాత కూడా తన పాత బిజినెస్‌ను వదులుకోలేదు సరికదా.. కొత్త బిజినెస్‌కు తెర లేపినట్లు తెలుస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page