అక్రమాలకే సర్టిఫికేషన్.. డోలవారికి ప్రమోషన్!
- BAGADI NARAYANARAO
- 5 days ago
- 4 min read

జలవనరుల శాఖలో రెండు దశాబ్దాలుగా తిరుమలేశుని హవా
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయనదే పెత్తనం
అదనపు బాధ్యతలతోనే ఇన్నాళ్లూ అధికార జులుం
తోటి అధికారులను బలి చేసే ఉన్నత స్థానానాకి
ఇటీవల ఎస్‌ఈగా పదోన్నతి.. త్వరలో సీఈ అవుతారని ప్రచారం
ఆయన జలవనరుల శాఖ ఎస్‌ఈగా ఇటీవలే ప్రమోషన్ అందుకున్నారు. ఈ మాట విని ఉత్తరాంధ్రలో చాలామంది విస్తుపోతున్నారు. ఎందుకంటే.. రెగ్యులర్ ఎస్‌ఈ కాకముందే ఆ హోదా వెలగబెడుతూ ఉత్తరాంధ్ర స్థాయిలో కొన్నేళ్లుగా ఆయన వెలిగిపోతున్నారు. 2005 నుంచి 2024 జూలై వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర పరిధిలో జలవనరుల శాఖపై పెత్తనం చెలాయిస్తూ తన మాట వినని అధికారులను, సిబ్బందిని వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దల ప్రాపకంతో తన హోదాను కాపాడుకుంటూ అనేక అక్రమాలకు పాల్పడిన అధికారిగా ముద్ర పడిన డోల తిరుమలరావుకు రెగ్యులర్ ఎస్‌ఈగా ప్రమోషన్ ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పదోన్నతికి ఆయన అర్హుడు కాదా.. అంటే కాదు. అర్హుడే. కాకపోతే తనపై కేసులు లేకుండా రాజకీయ ప్రాపకంతో తప్పించుకొని తన కిందివారిని బలిచేసి, ఇప్పుడు రెగ్యులర్ ఎస్‌ఈ కావడమే కాకుండా త్వరలోనే నార్త్ కోస్టల్ జోన్ సీఈగా కూడా పదోన్నతి పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వ పాలనలో లోకేష్ రెడ్‌బుక్‌లో ఉన్నవారిని మాత్రమే పక్కన పెడుతున్నారు తప్ప.. మిగిలిందంతా సేమ్ టు సేమ్. జూన్‌లో పదవీ విరమణ చేయనున్న నార్త్ కోస్టల్ జోన్ సీఈ రామ్‌గోపాల్ ఇప్పుడు ధవళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈగా ఉన్న డోల తిరుమలరావు చెప్పినట్టే బదిలీలు, పదోన్నతులు ఇస్తున్నారట. సుదీర్ఘ కాలం టీడీపీయేతర పార్టీతో సత్సంబంధాలు కలిగిన డోల తిరుమలరావును 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పరిధిలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తప్పించి మంత్రి అచ్చెన్నాయుడు నూజివీడు క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ పరిధిలోకి మార్చారు. అయినా కూడా విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాలు తిరుమలరావు చేతిలో ఉండటంతో నార్త్‌కోస్టల్ సీఈని ఆయన గ్రిప్‌లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో నీటి పారుదల పథకాలపై సమీక్షిస్తున్న నేపథ్యంలో డోల తిరుమలరావు అంశం మరోసారి తెర పైకి వచ్చింది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రెగ్యులర్ ఎస్‌ఈగా పదోన్నతి పొందడానికి డోల తిరుమలరావు ఎందుకు అర్హుడు కాదో చెప్పుకోవాలంటే ముందు పొందూరు మండలంలోని రెల్లిగెడ్డ ఆనకట్ట గురించి మాట్లాడుకోవాలి. అక్కడ రూ.10 కోట్లతో రెండు చోట్ల నిర్మించిన ఆనకట్టలు వరదలకు కొట్టుకుపోయాయి. వాటి నామరూపాలు కూడా మిగల్లేదు. ఎస్‌ఈ పి.రంగారావు, డీఈ రవీంద్ర హయాంలో జరిగిన ఈ నిర్మాణాలను క్వాలిటీ కంట్రోల్ ఈఈగా తిరుమలరావే ధ్రువీకరించారు. భేష్.. అని సర్టిఫికెట్ ఇచ్చారు. కట్ చేస్తే.. గెడ్డలోకి నీరు రాగానే ఆనకట్టలు తట్టుకోలేక కొట్టుకుపోయాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపి దోషులుగా ముగ్గురిని గుర్తించినా, అందులో తిరుమలరావు తన పేరును తప్పించారు. గత వైకాపా ప్రభుత్వం డీఈ, ఏఈలను దోషులుగా గుర్తించి సస్పెండ్ చేసింది. కానీ క్వాలిటీ కంట్రోల్ ఈఈగా ఉంటూ నిర్మాణాలను ఆమోదిస్తూ సంతకం చేసిన డోల తిరుమలరావు జోలికి మాత్రం విజిలెన్స్ వెళ్లలేదు. అంటే.. రాజకీయ ప్రాబల్యం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ ఈఈగా ఉన్న తిరుమలరావు పేరును ఈ కేసులో చేర్చి ఉంటే ఇప్పుడు రెగ్యులర్ ఎస్‌ఈగా పదోన్నతి వచ్చేది కాదని ఆ శాఖలోనే చెప్పుకుంటున్నారు.
ప్రాజెక్టుల జాప్యానికి కారకుడు
క్వాలిటీ కంట్రోల్ ఈఈగా ఉన్న డోల తిరుమలరావు టీడీపీ హయాంలో మాజీ మంత్రి కళావెంకటరావు సిఫార్సుతో తోటపల్లి ఎస్‌ఈగా విధుల్లో చేరారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు ద్వారా వంశధార ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు చేపట్టారు. తోటపల్లి, వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వెనుక ఈయన వైఫల్యం ఉందని ఆశాఖ అధికారులే ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలను తప్పుదోవ పట్టించి కాలయాపన చేస్తూ వచ్చారన్న ఆరోపణలు తిరుమలరావుపై ఉన్నాయి. పలాస శివారు ఆయకట్టు భూములకు మూడేళ్లుగా నీరు అందించకుండా వివక్ష చూపుతున్నారని అప్పటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులే తిరుమలరావుపై ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్నవారు లేరు.
షట్టర్ల కుంభకోణం సూత్రధారి
ఈయన లైజనింగ్ అధికారిగా ఉన్నప్పుడే 2008లో వంశధార షట్టర్ల కుంభకోణం జరిగింది. తన శాఖలోని 33 మంది వివిధ స్థాయిల అధికారులను సీఐడీ కేసులో దోషులుగా చేసి.. తాను మాత్రం తప్పించుకున్న ఘనత తిరుమలరావుకే దక్కింది. ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న తర్వాత లష్కర్ల నియామకంలోనూ చేతివాటం చూపించినట్లు ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఉద్యోగుల పదోన్నతుల పేరుతో అమరావతిలో కూర్చొని పెద్దమొత్తం వసూలుచేసిన ఘనతా ఆయనకే దక్కిందన్న ఆరోపణలున్నాయి. 2023లో విశాఖ క్వాలిటీ కంట్రోల్ డివిజన్ పరిధిలో డీఈ, జేఈలను, జిల్లాలోని 23 మంది డీఈ, 13 మంది జేఈలను బదిలీ చేయించి, డీఈల బదిలీలకు రూ.30వేల నుంచి రూ.40వేలు, జేఈల బదిలీలకు రూ.15 వేల నుంచి రూ.20వేలు బహిరంగంగా వసూలు చేసినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కేసు ఎదుర్కొంటున్న డీఈకే విజిలెన్స్ బాధ్యత
వంశధార ప్యాకేజీ 87, 88లో జరిగిన అవకతవకల విషయంలో కన్‌స్ట్రక్షన్ డీఈగా ఉన్న సత్యనారాయణపై విజిలెన్స్ కేసు నమోదు చేశారు. సత్యనారాయణను కాపాడుకోడానికి డోల తిరుమలరావే రంగంలోకి దిగారని ఆ శాఖలో అందరికీ తెలుసు. ఆ తర్వాత సత్యనారాయణను జలవనరుల శాఖ విజిలెన్స్‌లో డీఈగా నియమించిన తిరుమలరావు ఆయనతో కలిసి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. నీరు`చెట్టు పథకానికి క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఈఈగా పనిచేసిన తిరుమలరావు వేల కోట్ల పనులకు క్లియరెన్స్ ఇచ్చారు. విచిత్రంగా వీటిపై వచ్చిన ఆరోపణలపై వైకాపా హయాంలో విచారణ అధికారిగా మళ్లీ తిరుమలరావునే నియమించారు. వంశధార రిజర్వాయర్‌లో 19.5 టీఎంసీల వరద నీటిని నిల్వ చేయడానికి పట్టిసీమ నుంచి మోటార్లు, పంప్‌లు తరలించి ఎత్తిపోతల పథకం నిర్మిస్తే మేలు జరుగుతుందని వైకాపా పెద్దలకు సలహా ఇచ్చిన ఘనత తిరుమలరావుదే. దీనివల్లే నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం నిలిచిపోయింది.
తోటపల్లి గోడ కూలడానికి డోలే కారణం
2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తోటపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే మూడువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాల్ కుప్పకూలిపోయింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంజినీరింగ్ అధికారుల అనుమతి పొందిన డిజైన్‌ను మార్చి సొంత పైత్యంతో గోడ నిర్మించారు. దీనిపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తిరుమలరావు సొంత డిజైన్‌తో నిర్మించడం వల్లే గోడ కూలి సుమారు రూ.3.50 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీన్ని తిరుమలరావు నుంచి రికవరీ చేయించాలని విజిలెన్స్ అధికారులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో దీన్ని తొక్కిపెట్టి తప్పించుకున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వంశధార ఎస్‌ఈ గా పని చేస్తున్న తిరుమలరావును అచ్చెన్నాయుడు బదిలీ చేయించినా, కళా వెంకటరావు జోక్యంతో తోటపల్లికి ఎస్‌ఈగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు స్వీకరించారు.
అధికారంలో ఉన్న సర్కారుకే భజన
తిరుమలరావును పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కాపాడుకుంటూ వస్తున్నారు. తాను ఏ హోదాలో ఉన్నా ఉత్తరాంధ్ర స్థాయిలో అధికారుల బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులను నిర్ణయించేవారని విమర్శలున్నాయి. శాఖలో ఒక కోటరీ ఏర్పాటుచేసి రాష్ట్రస్థాయిలో తన మాట చెల్లుబాటయ్యేలా చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, పెట్రోల్ బంకుల యజమానిగా ఉన్న ఆయన ఆరు నెలల క్రితం వరకు జలవనరుల శాఖలో ఒక క్షేత్రస్థాయి అధికారే. అర్హత లేకపోయినా పదేళ్లు ఎఫ్‌ఏసీగా ఎస్‌ఈ హోదా వెలగబెట్టి జలవనరుల శాఖను భ్రష్టు పట్టించారు. తనతో పాటు ఒకే సమయంలో విధుల్లో చేరినవారంతా ఈఈలు, డీఈలుగానే మిగిలిపోగా, ఈయన మాత్రం రాజకీయ సిఫార్సులతో అర్హత లేకపోయినా ఏళ్ల తరబడి దర్జాగా ఎస్‌ఈ కుర్చీలో కూర్చొని అధికారం అనుభవించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి చెందిన నాయకులను బంధుత్వంతో, ఉన్నతాధికారులను యూనియన్ పేరుతో మేనేజ్ చేస్తూ వచ్చినట్టు విమర్శలు ఉన్నాయి. మూడు, నాలుగు జోన్లకు చెందిన వారిని పక్కన పెట్టి రాష్ట్రస్థాయిలో ఇంజినీర్ల సంఘం ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిగా తానే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎదురుతిరిగిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించిన సందర్భాలూ ఉన్నాయి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన హిరమండలం ఈఈ సుశీల్‌కుమార్ విషయంలో తిరుమలరావు వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అర్ధాంతరంగా బదిలీ చేసి సుశీల్‌కుమార్‌ను బలి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comentários