top of page

అటకెక్కిన అభ్యంతరాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 19
  • 2 min read

ఎలెన్‌మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఆధారిత స్టార్‌ లింక్‌కు దేశంలో ఇంటర్నెట్‌ సేవలందించే అవకాశం కల్పిస్తే పౌరుల, దేశ డేటా మొత్తం అమెరికాకు వెళ్లిపోతుందని ఇన్నాళ్లూ గగ్గోలుపెట్టిన ఇండియన్‌ టెలీకం చక్రవర్తులు ఇప్పుడు అదే ఎలెన్‌మస్క్‌తో కలిసి వ్యాపారం చేయడానికి ఇండియాలో స్టార్‌ ఎక్స్‌ను ఎంచుకోవడం వెనుక మతలబేమిటి? ఇవి రోదసిపై గుత్తాధిపత్యానికి దారితీయనున్నాయా? అదే జరిగితే జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారాల మాటేమిటి? స్టార్‌లింక్‌తో జియో, ఎయిర్‌టెల్‌ల ఒప్పందాలు లేవనెత్తుతున్న ప్రశ్నలివి. ఇది ట్రంప్‌, ఆయన భారతీయ చెలికాడు మోదీ తెరవెనుక నడిపిన మంత్రాంగమనీ, ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు స్టార్‌ లింక్‌ యజమాని ఎలన్‌మస్క్‌ ద్వారా ప్రధాని మోదీయే స్వయంగా ఈ భాగస్వామ్యాలను ఏర్పాటు చేశారని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్టార్‌లింక్‌ అనేది అమెరికన్‌ ఏరోస్పేస్‌ కంపెనీ ‘స్పేస్‌ఎక్స్‌’ అభివద్ధి చేసిన ఇంటర్నెట్‌ సేవలను అందించే ఉపగ్రహ ఆధారిత అంతర్జాల వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్‌మస్క్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో తన ఇంటర్నెట్‌ సేవలను విస్తరించడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా భారత కుబేరులైన ముఖేశ్‌ అంబానీకి చెందిన జియో, సునీల్‌ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్‌ కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అలాంటిది ఇవి అకస్మాత్తుగా తమ అభ్యంతరాలన్నింటినీ అటకెక్కించి స్టార్‌లింక్‌తో అంటకాగడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకోవడం ఈ అనుమాలకు తావిస్తోంది. ఈ ఒప్పందాలు స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, జాతీయ భద్రతాంశాలపై కూడా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దేశంలో క్లిష్టమైన పరిస్థితేదైనా ఎదురైనపుడు కనెక్టివిటీని ఎవరు నియంత్రిస్తారు? అమెరికాకు చెందిన స్టార్‌లింకా, లేక భారతీయ భాగస్వామ్యులైన ఎయిర్‌టెల్‌, జియో సంస్థలా? సాంకేతిక అభివృద్ధి అత్యున్నత దశలో కొనసాతున్న ఈ కాలంలో ఒక దేశ రక్షణకు ఈ శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ (ఉపగ్రహ తరంగ వ్యవస్థ) అనేది చాలా కీలకంగా మారింది. అన్ని దేశాలకూ ఒక అపూర్వమైన వనరుగా అందుబాటులోకి వచ్చింది. నేటి ఆధునిక ప్రపంచంలో ఇది అందించే ప్రయోజనాలు ఏ దేశానికైనా అనివార్యమైన అవసరం. బ్రాడ్‌కాస్టింగ్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటి సమాచార సేవలతో పాటు నావిగేషన్‌ సిస్టమ్స్‌, వాతావరణ పరిశోధన, దేశ రక్షణ, సురక్షితమైన మిలటరీ కమ్యూనికేషన్‌కు ఇది అందించే సేవలు అసాధారణమైనవి. అందుకే ఇది ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని, దీన్ని ప్రైవేటు సంస్థలకు కేవలం పారదర్శకమైన, బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో స్పష్టం చేసింది. ఇందుకు భిన్నంగా ప్రయివేటు ఒప్పందాల ద్వారా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరగడం చట్టవిరుద్ధం. మరి అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఈ ఒప్పందాలు జరిగినట్టు? జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? జాతీయ భద్రతను కూడా తాకట్టు పెట్టేంతగా సర్కారు సాగిలపడాల్సిన అవసరమేమిటి? ఈ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలి. లేదంటే ‘ఇది ట్రంపు దయకోసం మోదీ పాకులాట’ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అంగీకరించినట్టే అవుతుంది. ఇది భారతదేశ కక్ష్యా స్థలాల (ఆర్బిటల్‌ స్లాట్స్‌)పై కూడా తీవ్ర ప్రభావం చూపించే అంశం. ఈ ఒప్పందం మూలంగా సదరు విదేశీ కంపెనీ తన శాటిలైట్‌లను మన సహజ వనరుల మ్యాపింగ్‌, వాణిజ్యపరంగా విలువైన డేటా సేకరణ, ముఖ్యంగా మన వ్యూహాత్మక మిలిటరీ, రక్షణ డేటాను సేకరించడానికి వినియోగిస్తే, అది మన జాతీయ భద్రతకే పెను ప్రమాదం. ఒక విదేశీ కంపెనీని మన శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ను, ఆర్బిటల్‌ స్లాట్‌లను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించటమంటే అది రోదసీపై గుత్తాధిపత్యానికి అవకాశమివ్వడమే అవుతుంది. మన సార్వభౌమాధికారంపై, జాతీయ భద్రతపై రాజీపడడమే అవుతుంది. ఇటీవల రష్యాతో చర్చలు జరిపేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, ఉక్రెయిన్‌ ఖనిజ వనరులను తమకు అప్పగించాలన్న డిమాండ్లను అంగీకరింపజేసేందుకు ఉక్రెయిన్‌ మిలటరీకి స్టార్‌లింక్‌ సేవలను నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించడం, ఆ బెదిరింపులకు ఉక్రెయిన్‌ లొంగిపోవడం ఇందుకో ఉదాహరణ. భూకక్ష్యలో తిరుగాడే భారీ ఉపగ్రహ సముదాయం (మెగా కాన్‌స్ట్టలేషన్‌) అనేది ఓ అద్భుత ఆవిష్కరణ అనడంలో సందేహంలేదు. అయితే దీనివల్ల లెక్కకు మించిన ప్రయోజనాలున్నాయన్నది ఎంత నిజమో.. దాని వినియోగంపై నియంత్రణ కొరవడితే అంతకు మించిన ప్రమాదాలున్నాయనేది కూడా అంతే నిజం. టెక్నాలజీ అందించిన అద్భుత ఫలితాలు సమాజ ప్రయోజనాలకే తప్ప సంపన్నుల స్వార్ధానికి ఉపయోగపడరాదు.

コメント


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page