top of page

అడవి బిడ్డల వైద్యానికి ఆర్థిక ఆసరా

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 10
  • 2 min read

  • సీతంపేట ఏజెన్సీలో సికిల్‌సెల్‌ ఎనీమియా జోరు

  • దాని బారిన పెద్దసంఖ్యలో గిరిజనులు

  • ప్రభుత్వ పింఛన్‌కు అవకాశమున్నా అందుకోలేని దైన్యం

  • కేజీహెచ్‌ వైద్యులనే ఇక్కడికి రప్పించిన ఐటీడీఏ పీవో చొరవ

  • ఇక్కడే పరీక్షలు చేసి.. ధ్రువపత్రాల జారీ

  • త్వరలోనే పింఛన్లు అందుకోనున్న వందమందికిపైగా బాధితులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

వారు అక్షరజ్ఞానం పెద్దగా లేని గిరిజనులు. వైద్య పరిజ్ఞానం గానీ, ఆరోగ్య సమస్యలపై గానీ అవగాహన అసలే లేని అడవి పుత్రులు. శారీరక సమస్యలు వేధిస్తున్నా అంతవేగంగా ఆస్పత్రులకు వెళ్లడానికి ఇష్టపడకుండా.. అడవిలో దొరికే మూలికలతోనే కాలక్షేపం చేస్తుంటారు. ఫలితంగా గిరిజన గూడేల్లో సికిల్‌సెల్‌ ఏనీమియా చాలా ఏళ్లుగా ప్రబలుతోంది. దీనికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడంతోపాటు బాధితులకు నెలకు రూ.పదివేల పింఛన్‌ సౌకర్యం కల్పించినా దీనికి అవసరమైన ధ్రువపత్రం పొందడమే గిరిజనులకు పెద్ద ప్రహసనంలా ఉండటంతో మెజారిటీ బాధితులు వాటికి దూరంగా ఉండిపోతున్నారు. అయితే ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి చొరవతో ఎనీమియా బాధితులకు సులభంగా ధ్రువపత్రాలు అందించేందుకు మార్గం సుగమమైంది.

కేజీహెచ్‌కు వెళ్లలేక..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ పరిధిలో గిరిజనులను పీడిస్తున్న తీవ్రమైన వ్యాధుల్లో సికిల్‌సెల్‌ ఎనీమియా ముఖ్యమైనది. ఈ వ్యాధి బారిన పడినవారు రక్తహీనతతో బాధపడుతుంటారు. రోజురోజుకు శరీరంలో రక్తం తగ్గిపోవడం, నీరసించి పోవడం, తరచూ కళ్లు తిరిగి పడిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి నిర్మూలనకు సరైన చికిత్సా విధానం లేకపోవడం వల్ల చాలామంది రోగులు మరణాలకు గురవుతుంటారు. అందువల్ల వ్యాధి సోకినవారు నిరంతరం వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా డబ్బు ఖర్చవుతుంది. అయితే అడవులపై ఆధారపడే నిరుపేదలైన గిరిజనులు ఆర్థిక స్తామత లేక, పట్టణ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లలేక ఎనీమియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి దుస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైద్యఖర్చుల కోసం బాధితులకు ప్రతినెలా రూ.10వేల పింఛను అందించడం ప్రారంభించింది. అయితే ఈ పింఛను అందుకోవడానికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. సికిల్‌సెల్‌ ఎనీమియా ఉన్నట్లు వైద్యాధికారులు ఇచ్చే పాజిటివ్‌ ధ్రువపత్రం సమర్పించిన వారికే ఈ పింఛన్‌ మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ధ్రువపత్రం పొందాలంటే బాధితులు విశాఖ నగరంలోని కేజీహెచ్‌(కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి)కు వెళ్లి హెచ్‌బీఎల్‌సీ అనే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే గిరిజనులను వెనక్కి లాగుతోంది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడ రెండు, మూడురోజులు ఉండి పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం పొందడం తీవ్ర వ్యయప్రయాసలతో కూడినదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే చాలామంది రోగులు విశాఖ వెళ్లలేక మొత్తంగా ఈ సౌకర్యానికే దూరమవుతున్నారు.

ఐటీడీఏలోనే పరీక్షలు

గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను క్షేత్రస్థాయి పర్యటనలు, పరిశీలనల్లో సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి(పీవో) యశ్వంత్‌కుమార్‌రెడ్డి గుర్తించి ఆవేదన చెందారు. దీనికి ఒక పరిష్కారమార్గం చూపించాలన్న ఉద్దేశంతో విశాఖ కేజీహెచ్‌ వైద్యాధికారులతో మాట్లాడారు. తత్ఫలితంగా ఇంతవరకు కేజీహెచ్‌లో మాత్రమే నిర్వహిస్తున్న హెచ్‌బీఎల్‌సీ పరీక్షలను సీతంపేట ఐటీడీఏలోనే నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. ఆ మేరకు ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీ కేంద్రంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మూరమూల గూడేల్లో ఉండే గిరిజనులు ప్రతివారం ఐటీడీఏలో జరిగే గ్రీవెన్స్‌కు అలాగే సంతకు తరలి వస్తుంటారు. అప్పుడే ఎనీమియాతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కలగడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తొలివిడతలోనే 110 మందికి

మొదట అన్ని గిరిజన గ్రామాలు, గిరిజన ఆశ్రమ పాఠశాల్లో 0`40 ఏళ్ల మధ్య వయస్సున్న లక్షా 24 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 225 మందిలో సికిల్‌ సెల్‌ ఎనీమియా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ ఐటీడీఏ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో గత డిసెంబర్‌ మూడో తేదీన ఐటీడీఏలోని వైటీసీ కేంద్రానికి తరలించారు. కేజీహెచ్‌ నుంచి వచ్చిన వైద్యబృందం ఆధ్వర్యంలో హెచ్‌బీఎల్‌సీ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 110 మందికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఆ మేరకు వారికి వ్యాధి ఉన్నట్లు నిర్థారిస్తూ సర్టిఫికెట్లు జారీ చేశారు. వాటి ఆధారంగా ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల వైద్యాధికారులే బాధితుల తరఫున పింఛన్‌ దరఖాస్తులు నింపి సంతకాలు చేసి ఐటీడీఏకు పంపించాలని పీవో ఆదేశాలు జారీ చేశారు. ఐటీడీఏకు అందిన ఆ దరఖాస్తులను శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల డీఎంహెచ్‌వో కార్యాలయాలకు పంపి వాటిని త్వరతగతిన పరిశీలించి పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి చొరవతో ఎన్నో ఏళ్లుగా సాయం అందుకోలేకపోతున్న గిరిజన బాధితులు త్వరలోనే పింఛన్లు అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు ఎట్టకేలకు పింఛన్లు అందించగలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా తరచూ ఇటువంటి శిబిరాలు నిర్వహించి ధ్రువపత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడిరచారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page