అదే భూమి.. అదే రెడ్డి.. ఈసారి తెలుగుతమ్ముడుతో..
- BAGADI NARAYANARAO
- Apr 12
- 3 min read

2.06 ఎకరాల స్వాధీనానికి మరోసారి కుట్రలు
ఇప్పటికే సాదాబైనామా ఆధారంగా ఎకరాకు మ్యుటేషన్
గతంలో ‘సత్యం’ కథనాలతో ఈ దందా తెరమరుగు
మళ్లీ ఇప్పుడు భూమిని చేజిక్కించుకునేందుకు యత్నాలు
ఈసారి రంగంలోకి తెలుగు తమ్ముళ్లు
జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
భూమి గుండ్రంగా ఉందని క్రీ.పూ. 390లో అరిస్టాటిల్ చెబితే.. ఎంతమంది నమ్మారో తెలీదు గానీ, ఫాజుల్‌బాగ్‌పేటలో ఉన్న భూ వివాదం చూస్తే గుండ్రంగా ఉందని రుజువులు లేకుండా నమ్మొచ్చు. మాయ చేసో, మోసం చేసో రాజాంకు చెందిన రెడ్డి సురేష్ గతంలో తెలుగుదేశం హయాంలో ఈ భూమి మీదకు వచ్చారు. వైకాపా హయాంలో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం హయాంలో ఆ భూమిని పూర్తిగా ఆక్రమించుకోడానికి సిద్ధపడుతున్నారు. పార్టీలేవైనా చుట్టూ తిరిగి అదే భూమి దగ్గరకు రావడమే భూమ్యాకర్షణ సిద్ధాంతమో, లేదా భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ప్రధాన రుజువులు. వివరాల్లోకి వెళితే..
వివాదంలో ఉన్న ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూ సర్వే నెం. 120లోని 2.06 ఎకరాలకు చెందిన ఫైల్‌ను క్లియర్ చేయిస్తానని సంతకవిటి మండలం పొనుగుటివలసకు చెందిన రెడ్డి సురేష్‌కుమార్ అనే వ్యక్తికి ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన తెలుగు తమ్ముడు అభయం ఇచ్చినట్టు తెలిసింది. సాగుదారులకు, భూమిపై హక్కులు కలిగివున్న హబీబుల్లాఖాన్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తున్న ఈ భూమిలో ఒక ఎకరాను రెడ్డి సురేష్‌కుమార్ 2012 జూలై 21న రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి అనుభవిస్తున్న గేదెల భాస్కరరెడ్డిని బెదిరించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సహకారంతో ఆ ప్రక్రియ కానిచ్చేశారు. దీనిపై హక్కులు కలిగివున్న హబీబుల్లాఖాన్ వారసుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు సర్వే నెంబర్‌ను ఫ్రీజ్ చేసి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. అయితే సర్వే నెంబర్ 120లో 2.06 ఎకరాలకు సంబంధించి కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు నడుస్తుండగానే రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని 2020 సెప్టెంబర్ 23న ఎకరా భూమికి మ్యుటేషన్ చేసేశారు. ఈ వ్యవహారంపై ‘సత్యం’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఇన్నాళ్లు మౌనం వహించిన రెడ్డి సురేష్‌కుమార్ రెవెన్యూ అధికారులను మ్యానేజ్ చేసి రిజిస్ట్రేషన్ లేకుండానే సాదాబైనామా ఆధారంగా ఎకరా భూమిని మ్యుటేషన్ చేయించుకున్నారు. దానికి పట్టాదారు పాస్‌పుస్తకం కూడా జారీ చేసేశారు. అదే సర్వే నెంబర్‌లో మిగిలిన 1.06 ఎకరాలను కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోసం పని చేశానని, తానెంత చెబితే అంతేనంటూ చెప్పుకు తిరుగుతున్న ఒక వ్యక్తి ద్వారా రెడ్డి సురేష్ స్థానిక వీఆర్‌వో ప్రసాద్‌ను సంప్రదించి ఆ భూమిని కూడా సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
న్యాయస్థానంలో వివాదం
వక్ఫ్ బోర్డుకు చెందిన ఈ 2.06 భూమిపై కె.సప్తరాజులు, భాస్కరరెడ్డి కుటుంబానికి అనుభవ హక్కులు సంక్రమించాయని చెబుతున్నా ఎస్‌ఎల్‌ఆర్‌లో మాత్రం హబీబుల్లాఖాన్ పేరు నమోదై ఉందని ఆయన వారసులు చెబుతున్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిగా చూపించి దీన్ని దక్కించుకోవడానికి నగరానికి చెందిన ముస్లిం పెద్దలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అనుభవంలో ఉన్నవారికి అనుకూలంగా 2009లో తీర్పు ఇచ్చింది. వాస్తవానికి 1990లో ఈ భూమిని అనుభవిస్తున్న రైతులకు ముస్లిం పెద్దలు ఎన్‌ఓసీలు ఇవ్వగా, పాస్‌పుస్తకాలు కూడా పొందారు. కాగా హబీబుల్లాఖాన్ వారసులు మొదట భాస్కరరావు అనే ఒక డాక్యుమెంట్ రైటర్ కుటుంబ సభ్యుల పేరుతో 2.06 ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే కాలపరిమితి దాటిపోవడంతో అగ్రిమెంట్ రద్దయింది. ఆ సమయంలోనే డాక్యుమెంట్ రైటర్ భాస్కరరావు సప్తరాజులు, భాస్కరరెడ్డిల పేరుతో పాస్‌పుస్తకాలు తయారు చేయించారని బాధితులు ఆరోపించారు. ఆనాటి పాస్‌పుస్తకాల ఆధారంగానే భాస్కరరెడ్డితో బలవంతంగా సంతకాలు చేయించి రెడ్డి సురేష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే ఆ పాస్‌పుస్తకాలన్నీ నకిలీవని ఆరోపిస్తూ హబీబుల్లాఖాన్ వారసులు కోర్టుకు వెళ్లగా, ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. కాగా సర్వే నెంబర్ 120లో భూ హక్కులు కలిగిన హబీబుల్లాఖాన్ వారసులు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడం తదితర కారణాలతో ఇన్నాళ్లు భూ బదలాయింపు నిలిచిపోయింది.
రెవెన్యూ అధికారులు సహకారంతో
నగరానికి చెందిన పైడి నాగభూషణరావు అనే వ్యక్తి హబీబుల్లాఖాన్ వారసులు, అనుభవంలో ఉన్న ఇద్దరు రైతులతో 2.06 ఎకరాల భూమి విక్రయానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో రెడ్డి సురేష్‌కుమార్ ఎంటరై నాగభూషణం కంటే ఎక్కువ మొత్తం ఇస్తానని హబీబుల్లాఖాన్ వారసులు, ఇద్దరు రైతులను నమ్మించి అగ్రిమెంట్ అమలుకాకుండా చేశారు. దీంతో అగ్రిమెంట్ చేసుకున్న నాగభూషణరావు 2019 డిసెంబర్ 19న స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఈ కేసులో రాజీ చేయాలని ప్రయత్నించి మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ఇదే అదనుగా సురేష్‌కుమార్ అప్పటి వీఆర్వో, ఆర్‌ఐలను కలిసి వివాదాస్పద భూమితో సరిహద్దులు కలిగిన రైతులు, అనుభవదారుల స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్లు చూపించి నకిలీపత్రాలు, పాస్ పుస్తకాలతో 2020 సెప్టెంబర్‌లో ఒక అర్ధరాత్రి రెడ్డి సురేష్‌కుమార్ పేరుతో మ్యుటేషన్ చేయించారు. ఈ దందాపై ‘సత్యం’లో వచ్చిన కథనాలపై అప్పటి ఆర్డీవో కిషోర్ స్పందించి భూమిని సర్వేయర్, ఆర్‌ఐలతో కలిసి స్వయంగా పరిశీలించారు. రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించారు. కాగా సర్వే నెం.120లో ఎకరా భూమి మ్యుటేషన్‌కు సంబంధించి తన నుంచి ఎటువంటి సర్వే రిపోర్టు తీసుకోలేదని టౌన్ సర్వేయర్ రవికుమార్ ఆర్డీవోకు వివరణ ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా సర్వే నెం. 120, 124/1, 126/1,2,3 లలో ఉన్న సుమారు ఎనిమిది ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవంటూ వాటిపై హక్కులు కలిగి ఉన్న ముస్లిం కుటుంబాలు కోర్టుకు వెళ్లారని కూడా సర్వేయర్ తన రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో సదరు భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, మ్యుటేషన్ చేయడానికి తీసుకున్న పత్రాలు, స్టేట్‌మెంట్లు తీసుకురావాలని ఆర్డీవో ఆదేశించినా రెడ్డి సురేష్ రాజకీయ కారణాలు చూపించి వాటిని సమర్పించలేదు.
గతంలో తహసీల్దార్లు తిరస్కరించినా..
సాదాబైనామాతోనే ఆ భూమిని మ్యుటేషన్ చేయించేందుకు ఐటీ కుమార్ తహసీల్దార్‌గా ఉన్న సమయంలోనూ సురేష్‌కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాదాబైనామా ఆధారంగా అనుభవదారుల స్టేట్‌మెంట్లను తహసీల్దార్ రికార్డు చేశారు. అయితే ఆ స్టేట్‌మెంట్‌లో అప్పటి వీఆర్వో కొన్ని ఖాళీలు ఉంచి తర్వాత మ్యుటేషన్‌కు అనుకూలంగా దిద్దుబాటు చేశారు. దీన్ని గుర్తించిన తహసీల్దార్ కుమార్ మ్యుటేషన్ చేయడానికి తిరస్కరించారు. అంతకు ముందు తహసీల్దార్ సుధాసాగర్ కూడా ఈ వివాదం కోర్టులో ఉందని తెలుసుకుని మ్యుటేషన్‌కు తిరస్కరించారు. వీరి తర్వాత వచ్చిన తహసీల్దార్ ప్రసాద్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా 2012లో వీఆర్వో ఇచ్చిన పాస్‌పుస్తకాల ఆధారంగా సాదాబైనామాను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ లేకుండానే మ్యుటేషన్ చేసేశారు. సాదాబైనామా ద్వారా రెవెన్యూ రికార్డుల్లో, వెబ్‌ల్యాండ్‌లో అనుభవంలో ఉన్న వ్యక్తుల పేర్లు నమోదు కావు. సంబంధిత రైతుల స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాతే సాదాబైనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అడ్డుపెట్టకొని రెడ్డి సురేష్ ఇటీవల హబీబుల్లాఖాన్ వారసుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏడాది నుంచి ప్రయత్నించారు. హబీబుల్లా ఖాన్ వారసులతో ఒప్పంద ఖారానామా పత్రాన్ని రాయించుకున్నారు. అయితే ఒప్పందం మేరకు డబ్బులు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం రాసుకున్నా వేరొకరితో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో హబీబుల్లాఖాన్ వారసులు జేసీకి ఫిర్యాదు చేశారు.
Comments