top of page

అధికారి రాజకీయ కాంక్ష.. గాడి తప్పిన సమగ్ర శిక్ష!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Apr 22
  • 4 min read
  • కేజీబీవీ హాస్టల్లో విద్యార్థినుల మద్యపానం

  • విచారణ ఊసు పట్టని జిల్లా అధికారి

  • కాసుల కోసం బాధ్యులను వెనకేసుకొస్తున్న ఏపీసీ

  • విషయం తెలిసి విజయవాడకు పిలిపించిన ఉన్నతాధికారి

ree
  • ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉన్నప్పుడు చివరిగా ఏర్పాటైన మండలమది. రెండు మండలాల నుంచి రెండు ముక్కలు తెచ్చి కొత్త మండలంగా ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధిలో వెనుకబడిపోయిందని భావించి కేజీబీవీ పాఠశాల కూడా మంజూరు చేశారు. మండలం వెనుకబడిరదా.. లేదా అన్నది పక్కన పెడితే ఈ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థినులు కొద్ది రోజుల క్రితం బీరు, బిర్యానీలతో హాస్టల్లోనే పార్టీ చేసుకున్నారు. ఈ విషయం సమగ్రశిక్ష ఏపీసీకి, సంబంధిత జీసీడీవోకు, చివరకు సమగ్రశిక్ష సెక్రటరీ దేవానంద్‌కు తెలుసు. కానీ ఇంతవరకు కేజీబీవీ బాధ్యులపై ఎటువంటి చర్యలూ లేవు.

  • సమగ్రశిక్ష నిర్వహిస్తున్న కేజీబీవీల్లో విద్యార్థులకు కూరలు వండాలంటే కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్ట్‌ ఇవ్వాలి. కిలో రూపాయికే కూరగాయలందించే వెండర్‌కు దీన్ని కట్టబెట్టారు. సాధారణంగా టెండరు ఎవరు తక్కువకు వేస్తే వారికే ఇవ్వడం ఆనవాయితీ. ఇక్కడ కూడా అలాగే ఇచ్చుంటారు. ఇందులో వ్యవస్థ తప్పు తప్ప, అధికారులు చేయడానికేమీ లేదు. అయితే కిలో కూరగాయలు రూపాయికి ఇస్తున్నారంటే వాటి నాణ్యత ఎలా ఉంటుందో సంబంధిత ఏపీసీ కనీసం ఆలోచించకపోవడమే ఇక్కడ బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేస్తుంది. నాలుగు రోజుల క్రితం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ర్యాండమ్‌గా నాలుగు కేజీబీవీలు చెక్‌ చేస్తే కుళ్లిపోయిన కూరగాయలు, అది కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపోని క్వాంటిటీ బయటపడిరది. ఇదేంటని ప్రశ్నిస్తే.. అబ్బే.. వెండర్‌ మంచోడే గానీ వాళ్లమ్మకు బాలేకపోవడం వల్ల ఈరోజు సరిగ్గా కూరగాయలు అందించలేకపోయాడంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య ఎలాంటి అండర్‌స్టాండిరగ్‌ ఉందో తనకు తెలుసంటూ జేసీ వ్యాఖ్యానించారు.

  • కట్‌ చేస్తే.. కేజీబీవీలకు కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్ట్‌ను రద్దుచేసి టెండర్లలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి దీన్ని కట్టబెట్టాలని జేసీ సూచించారు. విచిత్రంగా ఈ రెండో టెండరుదారు కూడా మొదటి టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి భార్యేనని జేసీ పరిశీలనలో బయటపడిరది. దీంతో మూడో వ్యక్తికి ఈ టెండరును జేసీ అప్పగించారు. అంటే.. టెండర్లు వేయించేది, ఏ రేటు కోట్‌ చేయాలో నిర్ణయించేది, ఎవరికి రావాలని తాపత్రయపడేది మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఐఏఎస్‌ చదివిన అధికారికి మనం చెప్పక్కర్లేదు.

  • సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఎస్‌పీడీ) రెండు రోజుల క్రితం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో శ్రీకాకుళం ఏపీసీ శశిభూషణ్‌ కూడా పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న తతంగాలపై పెద్దఎత్తునే ఆయనకు క్లాస్‌ తీసుకున్నారు. ఎస్‌పీడీది కూడా ఇదే జిల్లా కావడంతో రెండు రోజుల క్రితం ఆయన ఇక్కడకు వచ్చారు. ఆయన్ను కలిసి చల్లబరిచే పనికి ఏపీసీ శశిభూషణ్‌ ఎందుకు ప్రయత్నించారు? జూమ్‌ మీటింగ్‌లో శశిభూషణ్‌ను ఉన్న ఫళంగా విజయవాడ రమ్మని ఎందుకు ఆదేశించారు? వీటన్నింటి సమగ్ర సమాచారం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

డిగ్రీ కళాశాలలో పాఠాలు చెప్పడానికే అలిసిపోయి.. గూగుల్‌, అంతకు క్రితమే వివిధ ప్రచురణకర్తలు రాసిన పేరాలకు పేరాలు కాపీకొట్టి ఒక గైడ్‌ తయారుచేసి, దాన్ని తన సాంతమని చెబుతూ మార్కెట్‌లో పెట్టి, తాను చెప్పే పాఠాలు వినడం కంటే దాన్ని చదివితే పాస్‌ గ్యారెంటీ అని భరోసా ఇచ్చి ఎక్కువ శాతం రాజకీయాలకే పరిమితమైపోయిన ఒక అధ్యాపకుడు జిల్లా మొత్తం సమగ్రశిక్ష లాంటి వ్యవస్థను నడపాలంటే ముందు వ్యాపార ధోరణిని విడనాడాలి. ప్రతిచోటా ‘అయితే నాకేంటి?’ అన్న నినాదం వదులుకుంటేనే రాణించగలుగుతారు. ఎల్‌.ఎన్‌.పేట కేజీబీవీలో ఇంకా హైస్కూల్‌ దాటని విద్యార్థినులు బీరు, బిర్యానీ తెచ్చుకొని హాస్టల్‌లో పార్టీ చేసుకున్న విషయాన్ని మొదట ఆ గ్రామస్తులే గుర్తించి పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఎస్‌వో (ప్రిన్సిపాల్‌)కు ఈ విషయం తెలిపారు. ఎప్పుడైతే గ్రామస్తులకు ఈ వ్యవహారం తెలిసిపోయిందో, ఇక బయటపెట్టక తప్పదని భావించిన ఆమె సమగ్రశిక్ష కార్యాలయంలోని జీసీడీవో నీరజ దృష్టిలో పెట్టారు. ఆమె ఏపీసీకి ఓ మాట చెప్పి, దీనికి వివరణ అడిగారు. అంతే.. అక్కడితో ఈ కథ ముగిసిపోయింది. స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ లాంటివారి దృష్టికి తీసుకువెళ్లలేదు.

వసూళ్ల యావలో ఏపీసీ

హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలు బీరు, బిర్యానీతో పార్టీ చేసుకున్నారంటే అందులోని వారెవరో సహకరించి ఉండాలి. సోషల్‌ మీడియా ప్రభావం వల్లో.. చిన్న వయసులో తెలియనితనం వల్లో విద్యార్థినులు ఈ పని చేసుంటారు. అయితే హాస్టల్లోనో, తరగతి గదులకు సంబంధించిన వారో బయటి నుంచి వీటిని అందించకపోతే అమ్మాయిలు నేరుగా మద్యం దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ తెర వెనుక వ్యక్తి ఎవరన్న కోణంలో ఏపీసీ శశిభూషణ్‌ ఏమాత్రం ఆలోచించలేదు. దానికి కారణమేంటంటే కేజీబీవీ ఎస్‌వోల నుంచి ఎప్పటికప్పుడు మామూళ్లు వసూలవుతుంటాయి. దీనికి మధ్యవర్తిగా జీసీడీవో వ్యవహరిస్తుంటారు. సదరు జీసీడీవోను రిలీవ్‌ చేస్తూ గతంలోనే అప్పటి కలెక్టర్‌ ఆర్డర్స్‌ ఇచ్చినా.. ఏపీసీలు, ప్రభుత్వాలు మారినా ఆమెను మాత్రం ఇప్పటికీ రిలీవ్‌ చేయలేదు. అంటే ఏపీసీలకు జీసీడీవో ఏమేరకు సంధానకర్తగా వ్యవరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏపీసీ ఇచ్చిన సంజాయిషీ నోటీసుకు సంబంధిత ఎస్‌వో ఏం సమాధానమిచ్చారో పక్కనపెడితే, ఇదే విషయాన్ని సమగ్రశిక్ష సెక్రటరీ దేవానందరెడ్డి దృష్టిలో పెట్టారు. కానీ జిల్లా కలెక్టర్‌కు ఈ విషయం తెలియదు. తొమ్మిది మంది విద్యార్థినులు కాదు.. కేవలం నలుగురు మాత్రమే ఇటువంటి పనికి పూనుకున్నారనేది ఎస్‌వో వివరణ సారాంశమట. ఒకరు చేసినా, నలుగురు చేసినా అది హాస్టల్‌ గదిలో జరిగింది కనుక తప్పిదమే. దీనిపైన ఏపీసీ చర్యలు తీసుకోలేదు.

అధ్యాపకులు తప్ప అడ్మినిస్ట్రేటర్లు ఏరీ?

జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ స్థాయి అధికారి కేజీబీవీని తనిఖీ చేసినప్పుడు అవకతవకలు బయటపడితే సాధారణంగా మరొక జిల్లాస్థాయి అధికారి అయితే దీన్ని సరిచేస్తానని, భవిష్యత్తులో జరగకుండా చూస్తానని సంజాయిషీ ఇచ్చుకుంటారు. కానీ నిలువెల్లా రాజకీయం వంటబట్టించుకున్న శశిభూషణ్‌ మాత్రం రూపాయికి కుళ్లిపోయిన కూరగాయలు సప్లై చేసిన వెండర్‌ను వెనకేసుకొచ్చారు. అంటే.. ఆ రూపాయిలో కూడా పావలా ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సమగ్రశిక్ష స్టేట్‌ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చూసీచూడనట్లు ఎమికబుల్‌గా ఉంటారు. కానీ ఆయనే శశిభూషణ్‌ను ఉన్న ఫళంగా విజయవాడ వచ్చి తనతో మాట్లాడాలని చెప్పారు. తనకు సోమవారం గ్రీవెన్స్‌ ఉందని, రాలేనని చెబితే.. అక్కడికి వేరే ఆఫీసర్‌ను పంపి విజయవాడ రావాల్సిందేనని ఖరాకండీగా చెప్పారు. ఇచ్ఛాపురం నగరానికి తాను స్పెషలాఫీసర్‌నని, అక్కడికి వెళ్లాలి కాబట్టి రాలేనని మరో సాకు చెబితే.. ఏ రాత్రయినా ఫర్వాలేదు, ఇచ్ఛాపురంలో రైలు దొరికితే రైలు, బస్సు దొరికితే బస్సెక్కి రావాలని ఎస్‌పీడీ ఆదేశించారు. కట్‌ చేస్తే.. ఆయన ఆగమేఘాల మీద విజయవాడ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనేది ఇంకా తెలియదు. సమగ్రశిక్ష లాంటి అతి పెద్ద వ్యవస్థలో అధ్యాపకులు, డీఈవో లాంటి ఎడ్యుకేషన్‌కు సంబంధించినవారే ఇన్నాళ్లూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మధ్యలో ఒక పోలీసు అధికారి వచ్చినా సమగ్రశిక్షకు న్యాయం జరగలేదు. ఎప్పుడో బలివాడ మల్లేశ్వరరావు హయాంలో సర్వశిక్ష అభియాన్‌ అనే పేరు ఉన్నప్పుడు తీసుకువచ్చిన సంస్కరణలు ఆ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యాయి. ఆ తర్వాత ఇది పునరావాస కేంద్రంగానే మారింది. ఈ సంస్థ పరిధిలో విద్యాలయాలు ఉన్నమాట వాస్తవమే అయినా ఈ వ్యవస్థను నడపడానికి అధ్యాపకులే ఉండాల్సిన అవసరంలేదు. కానీ ప్రభుత్వం ఆమేరకు ఆలోచించడంలేదు. ఒక నిఖార్సయిన అడ్మినిస్ట్రేటర్‌ ఉంటేగానీ సమగ్రశిక్ష గాడిలో పడదు.

రాజకీయ ప్రవేశమే లక్ష్యం

ప్రస్తుతం సమగ్రశిక్ష ఏపీసీగా పని చేస్తున్న శిశిభూషణరావుకు రాజకీయ కాంక్ష ఎక్కువ. దీనికి తోడు.. ఆయన మిత్రుడు వేపాడ చిరంజీవిరావు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు కోసం శశిభూషణ్‌ వర్గం పని చేసింది. ఆ తర్వాత ఆయన రిఫరెన్స్‌తోనే సమగ్రశిక్షకు ఏపీసీగా వచ్చారు. అయితే ఆయనో, జిల్లా మంత్రో సిఫార్సు చేసినంత మాత్రాన సమగ్రశిక్షకు ఏపీసీగా రావడం అంత సులువుకాదు. కచ్చితంగా లక్ష్మీకటాక్షం కురిపిస్తే గానీ ఈ పోస్టు రాదు. ఇంతకు ముందు ఏపీసీగా పని చేసిన జయప్రకాష్‌, ఇప్పుడు శశిభూషణ్‌రావు ఓ పద్ధతి ప్రకారం ఒకరు అనకాపల్లికి మరొకరు శ్రీకాకుళానికి పోస్టింగ్‌ తెచ్చుకున్నప్పుడే పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే.. జయప్రకాష్‌ వైకాపా ప్రభుత్వంలో తన సామాజికవర్గ నేతను పట్టుకొని ఈ పోస్టులో కుదురుకున్నారు. వారు చెప్పినవే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు అనకాపల్లి పోస్టింగ్‌ ఇచ్చారంటే కచ్చితంగా లక్ష్మీ కటాక్షమే పనిచేసి ఉండాలి. ఇందులో రెండు కేసులు ఒకే రిఫరెన్స్‌తో వెళ్లడం వల్ల కొంత రాయితీ కూడా వచ్చి ఉంటుంది. ప్రైవేటు సెక్టార్‌లో అధ్యాపకుడిగా పనిచేసిన వేపాడ చిరంజీవి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా లేనిది, ప్రభుత్వ రంగంలో.. అందులోనూ జిల్లాలో మెజార్టీ సామాజికవర్గానికి చెందిన తానెందుకు ఎమ్మెల్సీ కాలేనన్న భావన ఇప్పుడు శశిభూషణ్‌లో ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన రాబోయే ఎన్నికల కోసం కూడబెట్టుకుంటున్నారని, అంతేకాకుండా పోస్టింగ్‌ కోసం ఇచ్చిన సొమ్మును రాబట్టుకోవడంపైనే దృష్టి సారించారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేజీబీవీల్లో ఏం జరిగినా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఆ మధ్య ఒక కేజీబీవీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. ఇది యాదృచ్ఛికమనుకున్నా.. ఇప్పుడు వరుసగా జరుగుతున్న వ్యవహారాలు మాత్రం ఆయన నిర్లక్ష్యానికి తార్కాణం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page