top of page

అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ వైకాపా ఫెయిల్‌

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Nov 29, 2024
  • 3 min read
  • సరిగ్గా పాలించకే 11 సీట్లు

  • ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఫీట్లు

  • ఐదేళ్లూ కనబడని ప్రెస్‌

  • ఇప్పుడు అదే వేదికగా స్టేట్‌మెంట్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సినిమా ఆర్టిస్టులు, క్రికెటర్లు లోక్‌సభకో, రాజ్యసభకో ఎన్నికై, మొత్తం పని రోజుల్లో పదో వంతు కూడా వెళ్లలేదని తెలిసినప్పుడు ‘వీళ్లకు ఈ పదవులు అవసరమా? రాజకీయాలు అవసరమా?’ అని ఘాటైన విమర్శలు వినబడుతూంటాయి. అలాటిది ఫక్తు రాజకీయ నాయకులు. ప్రజల్లో తిరిగేవారు, రేప్పొద్దున ఓట్ల కోసం దేబిరించవలసినవారు అస్సలు అసెంబ్లీకి వెళ్లం అంటే జనం ఒప్పుకుంటారా? 39 శాతం మంది ఓటర్లు మీరేదో ఉద్ధరిస్తారనుకుని ఓట్లేశారే! అధికారం ఉన్నా లేకపోయినా, వాళ్ల కోసం అసెంబ్లీలో గళం విప్పుతారని ఆశపడ్డారే. వాళ్ల సంగతేమిటి? అబ్బే, అసెంబ్లీలో కాకపోయినా, ఊళ్లో రచ్చబండ దగ్గర గావుకేకలు పెడతాంలే అంటే, ‘అయితే అక్కడే ఉండాల్సింది. అసెంబ్లీకి వెళ్లేవాడికే ఓటు వేద్దుం’ అనరూ?

జాతీయ స్థాయిలో బీజేపీ (పూర్వరూపం జనసంఫ్‌ు) 1984లో 2 సీట్లే తెచ్చుకుంది. అయినా 1980 నుంచి అది ప్రతిపక్షంలోనే ఉంది. కానీ వైకాపా ఐదేళ్ల పాలన తర్వాత గతంలో ఉన్న సీట్లలో 7 శాతం తెచ్చుకుంది. ఇప్పుడు అసెంబ్లీ బహిష్కరిస్తామని చెప్పి ప్రతిపక్షంగా కూడా తాము విఫలమయ్యాయని వైకాపా చాటుకుంటోంది. సాధారణంగా అధికారపక్షం అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలను ఎగ్గొడదామని, కనీసం కుదిద్దామని, నడిచే రోజుల్లో కూడా ఏదో ఒకటి గలాభా చేసి, సభను వాయిదా వేయిద్దామని చూస్తుంది, ప్రతిపక్షం తమను ఎండగడుతుందనే భయంతో. కానీ ఇక్కడ ఏకంగా అసెంబ్లీకే రామని అధికార పక్షానికి ఊపిరి పోస్తుంది జగన్‌ పార్టీ. బయట మీడియాతో మాట్లాడి, మా ముచ్చట తీర్చుకుని తృప్తిపడతాం అంటోంది. అసెంబ్లీకి వెళ్లనపుడు ఎన్నికలలో పోరాడడం దేనికి? చచ్చీచెడి గెలవడం దేనికి? కమ్యూనిస్టుల్లా బయట ఉద్యమాలు చేసుకుంటూ గడిపేయవచ్చుగా!

ఎన్నికలకు ముందు ‘సిద్ధం’ అంటూ వైకాపా చాలా హడావిడి చేసింది. అంటే మూడు పక్షాల కూటమితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని జనాలు అనుకున్నారు. అధికారం అనుభవించడానికి సిద్ధం, అసెంబ్లీలో నోరు విప్పడానికి మాత్రం సిద్ధం కాదు అనే అభిప్రాయం మనసులో ఉంటే ఆ ముక్క పైకి చెప్పాల్సింది.

ప్రజలు ఏయే విషయాల్లో ఆగ్రహిస్తున్నారో గమనించి, దానికి తగ్గట్టుగా ఉద్యమాలు, నిదర్శన ప్రదర్శనలు చేయడం ప్రతిపక్షం బాధ్యత. అది గుర్తించే సీపీఐ రామకృష్ణ వంటివారు కూడా బాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని పక్కనపెట్టి, ఘాటైన విమర్శలు చేస్తున్నారు. బయట ప్రదర్శనలు చేయడానికి అంగబలం, అర్థబలం వెచ్చించాలి. అసెంబ్లీలో అయితే ఆ ఖర్చు ఏమీ లేదు. లేచి నిలబడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్న ఒకటి అడిగితే చాలు. ‘మీ హయాంలో కంటె ఎక్కువేలే’ అనో, ‘వాటి గురించి కమిటీ వేశాం’ అనో ఏదో ఒకటి చెప్తుంది. అది వినగానే ప్రజలకు అర్థమౌతుంది. బయట చేస్తే కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. అయినా ఏదైనా డిబేట్‌ ఉన్నపుడే, ఖండనమండనలు ఉన్నపుడే రసవత్తరంగా ఉంటుంది. నోరు జారి నిజం చెప్పడమో, జవాబు చెప్పలేక నీళ్లు నమలడమో, దాట వేయడానికి ప్రయత్నించడమో, చర్చ ముగిసిందని స్పీకరు చేత ప్రకటింప చేయడమో.. ఓదో ఒకటి జరిగితే సమాధానం రాబట్టినట్లే. డిబేట్‌ లేకుండా ఎవరి పాటికి వాళ్లు స్టేటుమెంట్లు ఇస్తూపోతే మరి ప్రతిపక్షం ఎందుకు? రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ఈ అవకాశాన్ని కాలరాసి, బయటకు వచ్చి మాట్లాడతామంటూ ఊరడిరపులు దేనికి? అసెంబ్లీకీ వెళ్లకపోవడంతో తమ హక్కు మాత్రమే వదులుకుంటున్నామని ప్రజా ప్రతినిథులు అనుకుంటే అది పొరపాటు. తమ హక్కుతో పాటు ప్రజల హక్కును కాలరాస్తున్నారు వీరు. నిండుసభలో ప్రశ్నలు లేవనెత్తే ధైర్యం ఉందనుకుని ఓట్లేసి పంపించారు. అలాటప్పుడు ‘వెళ్తే నాకు వాళ్లు మైకివ్వరు, మాట్లాడనివ్వకపోగా నన్ను గేలి చేస్తారు’ అని సాకులు చెప్పి వెళ్లడం ఎగ్గొడితే ఎలా? ‘పరీక్షకు వెళ్లినా మాస్టారు మార్కులేయడు, అందుకని పరీక్షకే వెళ్లన’ని ఎవరైనా అంటే ఊరుకుంటారా? వెళ్లాలి, నాలుగు అనాలి, నలభై పడాలి. దానికి ఒప్పుకునే బరిలో నిలబడ్డారు. తీరా గెలిపించినదాకా ఉండి, ఇప్పుడీ వేషాలేస్తే ఎలా? 2014-19 మధ్య అసెంబ్లీలో జగన్‌ను ఏమైనా ఊరేగించారా? జగన్‌ లేచి నిలబడగానే ‘లక్ష కోట్లు’ ‘లక్ష కోట్లు’ అనే అరుపులు, రోజా నిలబడగానే ‘జబర్దస్త్‌ ఆంటీ’ అంటూ కూతలు. అయినా నాలుగేళ్లు వెళ్లారుగా. మరి ఇప్పుడేమొచ్చింది? పూలదండలతో పాటు, రాళ్లూ పడతాయని తెలిసే ఈ వృత్తిలో దిగాలి. రచయితకైనా, నటుడికైనా, పబ్లిక్‌లోకి వచ్చి నిలబడిన ఎవడికైనా ఇది తప్పదు. దాన్ని డీల్‌ చేయడం తెలియకపోతే విత్‌డ్రా అయిపోవాలంతే.

తను ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌ చంద్రబాబును తన పార్టీ సభ్యులు ఈసడిస్తూ ఉంటే చిరునవ్వులు చిందిస్తూ కూర్చునేవాడు. ‘కురుసభలో దుర్యోధనుడిలా నవ్వుతున్నాడు’ అనే విమర్శలు వచ్చినా మానుకోలేదు. చాలాకాలం చంద్రబాబు సహించారుగా! చివరి సగకాలం అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా, కనీసం రెండున్నరేళ్లు అసెంబ్లీకి వెళ్లారుగా! ఇంతకీ అసెంబ్లీ గైర్హాజరీకి జగన్‌ చెప్పే కారణం ఏమిటి? తను మాట్లాడదామనుకుంటే మైకు ఇవ్వరట, అస్సలు ఇవ్వరని కాదు, ముఖ్యమంత్రితో సమానంగా ఇవ్వరట! 164 సీట్ల కూటమికి నాయకుడిగా ఉన్న వ్యక్తితో సమానంగా ఛాన్స్‌ రావాలని ఉంటే కనీసం 18 సీట్లయినా తెచ్చుకునేట్లా పాలించి ఉండాల్సింది. బొత్తిగా 11 దగ్గర ఆగిపోయి, ఈ ఆరున్నొక్క రాగాలెందుకు? ‘10 శాతం సీట్లు ఉంటేనే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వనక్కరలేదని రాజ్యాంగంలో లేదు, సంప్రదాయం మాత్రమే. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు కాబట్టి.. అని దీర్ఘాలు తీస్తున్న జగన్‌ పాత టీడీపీ హయాంలో ఆ హోదా అనుభవించినప్పుడూ ఫిర్యాదు చేసి, చివరి ఏడాది అసెంబ్లీకి వెళ్లడం మానుకున్నారుగా! మైకు ఇవ్వటం లేదని అప్పుడూ ఫిర్యాదు చేశారుగా! ఇప్పుడు హోదా ఇచ్చి కూడా మైకు కట్‌ చేయవచ్చేమో! చేయకపోవచ్చేమో! సీను ముందే ఊహించుకుని వెళ్లకపోవడమేమిటి, అర్థరహితంగా! అధికార పక్షం అప్రజాస్వామికంగా నడుస్తోందనే రుజువేదీ చూపకుండా ఆరోపణలు చేస్తే జనం ఎలా నమ్ముతారు? జగన్‌ అసెంబ్లీకి వెళ్లను అనగానే గతంలో ఎన్టీయార్‌, జయలలిత వెళ్లలేదు అంటూ కథనాలు వినిపిస్తున్నారు. వాళ్లు చెప్పనిదేమిటంటే, ఎన్టీఆర్‌ వెళ్లకపోయినా, చంద్రబాబు వెళ్లేవారు, కాంగ్రెసు దుంప తెంపేవారు. జయలలిత వెళ్లకపోయినా ఆమె పార్టీ సభ్యులు వెళ్లి దుమ్ము దులిపేవారు. ఇప్పుడు జగన్‌ ‘నేనే కాదు, మా వాళ్లనీ పంపను’ అంటున్నారు. దానికి లాజిక్‌ ఏమైనా ఉందా? వాళ్లు అధికార పార్టీలో ఉన్నపుడు కూడా అసెంబ్లీలో నోరు విప్పారో లేదో! ఏమైనా మాట్లాడారో లేదో! ఇటీవలి సంప్రదాయం ఏమిటి? అసెంబ్లీలో వాగ్వాదాలు, పేపర్లు చింపి స్పీకరు మీద పోయడాలు, మైకులు విరగ్గొట్టడాలు, మార్షల్స్‌ వచ్చి బయటకు మోసుకుపోవడాలు.. ఇవన్నీ జరిగాక బయటి మీడియా పాయింటు దగ్గర ప్రకటనలు, గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, మూతికి గుడ్డ కట్టుకుని మౌనప్రదర్శనలు.. ఈ తతంగం అంతా జరగాలి కదా. అదేమీ లేకుండా మీడియాని పిలిచి నేను చెప్దామనుకున్నది చెప్పేస్తా అంటే మజా ఏముంటుంది? అసలు ప్రెస్‌ ఇతన్ని పట్టించుకోవాలని ఏముంది? ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ నీ కంటికి మేం ఆనలేదు. ఒక్కసారి పిలవలేదు. ఇప్పుడు పిలవగానే పరిగెట్టుకుని వచ్చి కవర్‌ చేయాలా? ఎల్లెల్లవోయ్‌’ అంటే? ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లనక్కర లేదని జగన్‌ లాగే జాతీయ స్థాయి పార్టీలు అనుకుని ఉంటే అవి గత పదేళ్లగా పార్లమెంటుకే వెళ్లేవి కావు. పార్టీ తరఫున ఒక్క సభ్యుడే ఉన్నా అసెంబ్లీని, పార్లమెంటుని గడగడలాడిరచిన మహానుభావులెందరో ఉన్నారు.

1985 పార్లమెంటులో బీజేపీకి రెండే సీట్లు. అయినా వెళ్లారు, తమ తడాఖా చూపించారు. ఐదేళ్లు పోయేసరికి 85 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్‌ ఓటర్లతో చెప్పేది ఎలా ఉందంటే ` ‘నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే ఐదేళ్లూ అసెంబ్లీకి వెళతాను, ప్రతిపక్ష నాయకుణ్ని చేస్తే నాలుగేళ్లు వెళతాను. అదీ చేయకపోతే అస్సలు వెళ్లనంతే. ఎన్నికల తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని తదనుగుణంగా ఓటు వేయండి. తర్వాత నన్ను తప్పు పట్టి ప్రయోజనం లేదు.’ అని. ‘ఇంతకంటె అసెంబ్లీకి వెళ్లి మన గోడు వినిపించే మరో ప్రతిపక్షానికి ఓటేసుకుంటే బెటరు కాదూ’ అని ఆంధ్ర ఓటరు అనుకున్నాడంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page