అన్ని జానర్లు టచ్ చేసిన ఏకైక తెలుగు దర్శకుడు..!
- Guest Writer
- Mar 25
- 3 min read

ఈమధ్య తెలుగు సినిమాలను నిర్మిస్తున్న వాళ్లలో పెడసరం పాళ్లు ఎక్కువవడం గమనిస్తున్నాను. సినిమా రంగం పవర్ పాలిటిక్స్ మధ్య ఇరుక్కుని ఉంది. పెద్ద సినిమాలు, పాన్‌ఇండియా సినిమాలు అడ్డమైన చెత్తనూ తెలుగు ప్రేక్షకులపై రుద్ది ఇదేంటి అని ప్రశ్నించిన వారిని ‘‘అహా సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలా అంటే నీతులు చెప్పాలా అంటూ అవహేళనను ఆయుధంగా తీసుకుని సెక్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిర్ణయించే మేధావి సినీ కళాకారులు ఘాటుగా జవాబు చెబుతూ తెలుగు సినీరాజ్యాన్ని ఏలుతున్నారు. ఏ రాజైనా ఏలేది కొన్నాళ్ళే కదా... చరిత్రలో ఎన్ని రాజ్యాలు కూలలేదు. ఎందరు మట్టిలో కలిసిపోలేదు. ఈ ప్రస్తుత సినీ కళాకారులకు సినిమా అంటే క్రాఫ్ట్ మాత్రమే. ది ఫర్ఫెక్ట్ క్రైం లా, పర్ఫెక్ట్ సినిమా తీయాలని ప్రయత్నిస్తూ తమ టాలెంట్‌ను రెచ్చిపోయి ప్రకటించేస్తున్నారు. ఆధిపత్య భావజాలమే తెలుగు సినీ రంగంలో హీరోలను దర్శకులను ముందుకు నడిపిస్తుంది. సినిమాల క్వాలిటీని నిర్ణయిస్తుంది.
ఈ మాఫియాకు బోల్డంత టాలెంట్ ఉంది. చార్లెస్ శోభరాజ్ లెవల్లో వారి మెదడు పని చేస్తుంది. టెక్నికల్‌గా సినిమాపై ఎంతో అవగాహన ఉంది. కాని సినిమా నిర్మాణంలో కారెక్టర్ మాత్రం అవసరం అన్నది వీరు ఒప్పుకోరు. ఈ మధ్య వచ్చిన ఓ జంతువు సినిమా బోల్డు డబ్బులు వసూలు చేసిందిగా. దాన్ని ఏ జంతువుకయినా పొరపాటున చూపిస్తే అది కూడా అవమానంతో తమ జాతి పేరు మార్చుకుంటుంది. ఆ సినిమాను కొందరు ప్రశ్నిస్తే వారిపై ఆ సదరు దర్శకుడు మాటల తూటాల వర్షం కురిపించేసాడు. బలవంతులు దుర్భల జాతిని అంటున్న శ్రీశ్రీని ప్రతి జవాబులో మరోసారి గుర్తుకు తీసుకొచ్చాడు. అంటే వారెలాంటి చెత్త తీసినా ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై బల ప్రదర్శన అన్నమాట. ఆ మాటల దాడిలో గొప్ప సైకాలజీ స్టడీ ఉంది. పైగా ప్రేక్షక మారాజులు ఆ సినిమాకు కోట్ల రూపాయల వర్షం కురిపించారు. మరి సక్సెస్ అంటే డబ్బు తోనే కదా ముడిపడి ఉంది.
ఈ ప్రపంచం దారి తప్పిన మేధావుల వల్లే నష్టపోతుంది. నాశనం అవుతుంది, దానికి సినీరంగం కూడా విక్టిమే. సినిమా నీతులు చెప్పదు. నచ్చితే చూడండి లేదంటే మానండి అనడం ఈ తరహా వారికి అలవాటు. ఇప్పటి తరం కూడా మాకు నీతులు వద్దు ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్‌స్క్రీన్ కావాలి అంటున్నారు. సినిమా అనేది వినోదం గురించి కాబట్టి మాట్లాడుకుందాం పర్వాలేదు. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేసింది. తెలుగు నేల సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాగా ఉపయోగించుకున్నంతగా మరే భాషలోనూ జరగలేదు. అది తెలియని హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ టెక్నాలజీని లిటరసీ ఇన్ ఆర్ట్ అనుకుంటూ అడ్డమైన చెత్త అందంగా తీస్తూ, పైగా ఇదేంటి అని ప్రశ్నించే వారిపై దాడి చేసి పైశాచికానందం పొందుతూ ఉంటే సినిమాను అందులోనూ తెలుగు సినిమాను ప్రేమించే వారు మౌనంగా ఊరుకోవలసి వస్తుంది. కాని ఈ మౌనం వారి విజయం ఎంత మాత్రమూ కాదు. భార్యను సభలో నగ్నంగా నిలిపిన దుర్యోధనుడని అంతం చేయడానికి కృష్ణుడంతటి వాడు తోడు ఉండగా కూడా పద్నాలుగేళ్ళు మౌనంగా ఉండిపోయిన పాండవులు చేతగాని వాళ్లా. కాదు కేవలం తమ సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారంతే. చాలామంది సినీ ప్రేమికులదీ అదే పరిస్థితి.
స్వతహాగా అధ్యాపక వృత్తిలో ఉన్న నాలాంటి వాళ్లు ఈ సమస్య మూలంలోకి వెళ్లి ఆలోచిస్తే ప్రస్తుత తరానికి అసలు నిజమైన సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఎంత తెలుసున్న ఆలోచన వచ్చింది. ఏం తెలుసు వీరికి? పాత సినిమాలు రోత, ఎనభైలలో వచ్చినవి చాధస్తాలు, భావజాలపు సినిమాలు హెవీ లోడెడ్ డ్రామాలు, పౌరాణికాలు ముసలి వాళ్లవి, జానపదాలు పల్లెటూరి సినిమాలు, వీళ్ళకు చిరంజీవి తరం తరువాత తప్ప అంతకు ముందు సినిమా తెలియదు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ చెప్పరు. చాలా సందర్భాలలో కావాలనే గొప్ప సినిమాలను ప్రస్తావించరు. సెకెండ్ హాండర్స్ అందరూ ఆలోచించే సత్తా ఉన్నవారిని అణగదొక్కడం పైనే దృష్టి పెడతారు. అంతెందుకు, ‘‘ నువ్వు కుక్కను చంపాలనుకుంటే ముందు దానిని పిచ్చిదానిగా నిరూపించు’’ అనే సూక్తిని తెలుగు సినిమా మాఫియా ముఠాలు పక్కాగా తగ్గేదేలే అంటూ ఆచరిస్తూ పోతున్నారు. ఆలోచించే ప్రేక్షకులు ఎంత తక్కువగా ఉంటే వారిని గొర్రెలను చేసి ఆడిరచవచ్చు. అందుకే నేషనల్ అవార్డులస్థాయిలో కూడా దిగజారిన తెలుగు సినిమానే ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో అలరారుతుంది. కాబట్టి వినోదం గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు అనేవాడు ఏ ప్రాతిపదికన సినిమా తీస్తున్నాడు?, ఎంతమంది దర్శకులు అన్ని జానర్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.? తెలుగులో అలాంటి సత్తా ఉన్న దర్శకులు ఉన్నారా... అని.. విశ్వనాధ్ ఒకటైపు సినిమా తీస్తే, బాపు మరో టైపు సినిమాలు తీశారు. కమలాకర కామేశ్వరరావు, బి.విఠలాచార్య నుండి ఆదుర్తి సుబ్బారావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, మాదాల రంగారావు, టి.కృష్ణ గారి వరకు సినిమా దర్శకత్వంలో ప్రతివారికీ ప్రత్యేక శైలి ఉంది. బీ.ఎన్. రెడ్డి గారు ఆ రోజుల్లోసినిమా రంగంలో రకరకాల ప్రయోగాలను ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్‌గానే తీసారు. మాయాబజార్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా పాపం ఇప్పటి టెక్నికల్ దర్శకులకు ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మాట్లాడేటప్పుడు గుర్తుకు రాదు. వచ్చినా అదో పాత చింతకాయ పచ్చడి. భారతీయ సినీచరిత్రలో దర్శకత్వానికి ఓ స్థాయి తెచ్చిన బీ.ఎన్.రెడ్డిని ఇప్పటి దర్శకులు తలవనే తలవరు.
తెలుగు సినిమా కమర్షియల్‌గా ముందుకు సాగుతున్నప్పుడు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ని దృష్టిలో పెట్టుకుని కళాత్మక విలువలతోనూ తెలుగుతనంతోనూ చక్కని సినిమాలను సినీ ప్రపంచంలో అన్ని జానర్లలో తీసి చూపించిన ఏకైక దర్శకుడు మన తెలుగువాడు సింగీతం శ్రీనివాసరావు గారు. అసలు ఆయన ప్రతిభను తెలుగు సినిమా ఎప్పుడైనా ప్రస్తావిస్తుందా? ప్రస్తుత తరానికి సింగీతం గారి ప్రతిభను అందించే ప్రయత్నం తెలుగు సినీ ప్రపంచం ఎందుకు చేయాలనుకోవట్లేదు. మనకు జంతువులు ఎందుకు నచ్చుతున్నాయి? కేవలం ఒకే రకమైన సినిమాలకే పరిమితం అయిపోయే దర్శకులు, ఇతర సినిమాలను అవహేళన చేయడం తప్ప వాటిలోని గొప్పతనాన్ని, సామాజికతను గుర్తించడానికి వారికి అహం అడ్డు వస్తుండగా, మేం మొనార్క్‌లం..అంటూ ప్రజల మెదళ్ళను కుంచింపజేయడానికి తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి హిప్నాటైజ్ ప్రక్రియను ప్రేక్షకులపై ప్రయోగించే ఈ సూడో సినీ దిగ్గజాల నడుమ ఇప్పుడు మనం మరోసారి సింగీతం శ్రీనివాసరావుగారి సినిమాలను ఒకొక్కటిగా విశ్లేషించుకోవడం ఎంతో అవసరం.
సినిమాను ఎంతో ఇష్టపడే నేను, ప్రస్తుతం తెలుగు సినిమాలోని అహంకారపు అధిపత్యపు అధికారాన్ని గమనిస్తూ అది ఎంటర్‌టైన్‌మెంట్ అని గొంతు చించుకుని తమ పర్వర్షన్లను జస్టిఫై చేసుకునే వారిని భరించే తెలుగు ప్రేక్షకుల మధ్య సింగీతం శ్రీనివాసరావుగారి సినిమాలను ఒకొక్కటిగా పరిచయం చేయాలనుకుంటున్నాను. నా ఎప్.బీ టైంలైన్‌ను ఇలాంటి ప్రయోగాల కోసం వెతికే సినీ ప్రేమికుల కోసం సింగితం సినిమాలపై వ్యాసాలు ఒకొక్కటిగా వస్తూ ఉంటాయి.
- పి.జ్యోతి
댓글