top of page

అనర్హులకు ప్రజాప్రతినిధుల అభయహస్తం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 31, 2024
  • 3 min read
  • `సదరం అక్రమాల్లో కొత్త పరిణామాలు

  • `తప్పుడు వైకల్య పత్రాలపై ఇన్నాళ్లూ అధికారుల తాత్సారం

  • `తాజాగా రాజకీయ ఒత్తిళ్లతో చేతులెత్తేస్తున్న వైనం

  • `అవసరమైతే విద్యామంత్రికి చెబుతానని ఇచ్ఛాపురం ప్రతినిధి భరోసా

  • ` ఆ టీచరమ్మకు పరీక్షలు అవసరం లేదని రిమ్స్‌ అధికారులకు స్పష్టీకరణ

ప్రభుత్వం సదరం జారీ చేసే ధ్రువపత్రాలు అవి కలిగి ఉన్న వారిలో వైకల్యం స్థాయి, తీవ్రత మాత్రమే తెలియజేస్తాయి. వైకల్య సర్టిఫికెట్‌ కోసం వచ్చే దరఖాస్తుదారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ రాయితీలు పొందిందుకు అర్హులవుతారా? లేదా? అనేది నిర్ధారించడమే సదరం ధ్రువపత్రాల జారీ లక్ష్యం. దీన్ని విస్మరించిన అధికారులు ధ్రువపత్రాల్లో పేర్కొన్న వైకల్య శాతం కరెక్టా కాదా అన్నది పరిశీలించకుండా సదరు ధ్రువపత్రాలు అసలా? నకిలీవా? అన్నది నిర్ధారించాలని వైద్యాధికారులను కోరుతుండటం విస్మయం కలిగిస్తోంది. వైకల్యం లేకున్నా.. కొద్దిగా ఉంటే ఎక్కువగా చూపిస్తూ సదరం ధ్రువపత్రాలు పలువురికి జారీ చేసినట్టు అందిన అనేక ఫిర్యాదులను బుట్టదాఖలు చేసేందుకు అధికారులు నకిలీ అన్న అంశాన్ని తెరపైకి తెస్తూ కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు వారిని ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పని చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పలనరసమ్మ విషయంలో అదే జరుగుతున్నట్లు తెలిసింది. నిర్ణీత శాతం దృష్టిలోపం లేకుండానే సదరం ధ్రువపత్రం పొంది ఇరవై ఏళ్లుగా టీచర్‌ ఉద్యోగం చేస్తున్న ఆమెకు స్థానిక ప్రజాప్రతినిధి అభయహస్తం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నకిలీ మకిలిని వదిలించడానికి జిల్లా అధికారులు సాహసించడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని వారు చేతులెత్తేస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రంతో ఉద్యోగంలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి కాపాడతానని సాక్షాత్తు ఇచ్ఛాపురం ప్రజాప్రతినిధి భరోసా ఇవ్వడం చర్చనీయాంశమైంది. బ్రోకర్ల ద్వారా ప్రభుత్వ వైద్యులను మేనేజ్‌ చేసి సదరం ధ్రువప్రతాలు సంపాదించి ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు అనుభవిస్తున్నవారి పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ అర్ధంకాని, గుర్తించలేని, బయటకు కనిపించని వైకల్యంతో బాధపడుతున్నట్టు పేర్కొంటూ సదరం ధ్రువప్రతాలు జారీ చేయడం జిల్లాలో రివాజుగా మారిపోయింది. ఇవన్నీ నరసన్నపేట, రిమ్స్‌, పలాస, టెక్కలి, పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి జారీ అయినవే. ప్రజాప్రతినిధుల సిఫార్సులు, బ్రోకర్ల మధ్యవర్తిత్వంతో తప్పుడు సదరం పత్రాలు పొందినవారు జిల్లాలో రెండువేల మందికి పైగా ఉన్నారని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇదివరకే ఆయా మండలాల అధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే తంతు జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జలుమూరు మండలం లింగన్నాయుడుపేటలో సదరం ధ్రువపత్రాలతో 23 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారని ఆ పార్టీ నాయకులే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని స్థానిక ఎమ్మెల్యే జలుమూరు ఎంపీపీకి సూచించగా ఎండీవో ద్వారా 23 మందికి నోటీసులు జారీ చేశారు. నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నోటీసుల్లో సూచించినా వారంతా పరీక్షలకు గైర్హాజరయ్యారు. దాంతో వారందరికీ పింఛన్లు నిలిపివేస్తున్నట్లు ఎంపీడీవో నోటీసులు జారీచేసి డీఆర్‌డీఏ ద్వారా సెర్ఫ్‌కు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారికి జూన్‌ ఒకటి నుంచి పింఛన్లు నిలిపివేశారు. కానీ అన్ని చోట్లా ఇలా జరగడం లేదు.

ఎచ్చెర్లలో మారిన సీను

ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో 11 మంది ఎటువంటి వైకల్యం లేకుండానే సదరం పత్రాలు పొంది పింఛన్లు అందుకుంటున్నారని గ్రామ ఉపసర్పంచ్‌ ప్రతినిధి గత ఏడాది అక్టోబర్‌ 16న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరపాలని డీఆర్‌డీఏ అధికారులు అక్టోబర్‌ 17న ఎండీవోను ఆదేశించినా ఆయన స్పందించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి 29న ఫిర్యాదు చేయగా మార్చి 2న నిజనిర్ధారణ పరీక్షలకు నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి హాజరు కావాలని 11 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే వారందరూ గైర్హాజరు కావడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నోట్‌ఫైల్‌ పెట్టాలని డీఆర్‌డీఏ పీడీ ఎచ్చెర్ల ఎండీవోను ఆదేశించారు. ఆ తర్వాత కూడా రెండుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి జులై ఒకటిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో జులై ఒకటిన ఆ 11 మందికి పింఛన్‌తోపాటు నోటీసులు ఇచ్చి జులై 3న సదరం పత్రాల నకలు తీసుకొని గ్రామ సచివాలయం వద్ద హాజరు కావాలన్నారు. దీనిపై ఉన్నతాధికారులు మొట్టికాయలు పెట్టడంతో ఆ నోటీసులు రద్దు చేసి జూలై పదిన పరీక్షలకు రణస్థలం ప్రభుత్వ ఆస్పత్రిలో హాజరుకావాలంటూ ఎనిమిదో తేదీన నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో ఒక్కరు మినహా మిగతా పది మంది గైర్హాజరయ్యారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పాలక కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లిన తర్వాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. దానికి అనుగుణంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి కొమ్ము కాసేలా ఎండీవో వ్యవహరించారు. నిజనిర్ధారణకు ఒక్కరు మాత్రమే హాజరయ్యారని, మిగతా వారు రాలేదని మాత్రమే పేర్కొంటూ డీఆర్‌డీఏ అధికారులకు నివేదిక ఇచ్చారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఆర్‌డీఏ అధికారులు గైర్హాజరైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దానికి ఎండీవో స్పందించకపోవడంతో బాధ్యులపై తీసుకున్న చర్యలు వివరిస్తూ నివేదిక ఇవ్వాలని మళ్లీ జూలై 19న మెయిల్‌ పంపారు. అయినా ఎండీవో స్పందించలేదు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే చెప్పారని దాన్ని తొక్కిపెట్టేశారు. దీనిపై మరోమారు జులై 22న ఇబ్రహీంబాద్‌ ఉపసర్పంచ్‌ ప్రతినిధి గ్రీవెన్స్‌లో జేసీకి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి విచారణ జరిపించాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఆ మేరకు అధికారుల ఆదేశాలతో జులై 23న 10 మంది మాత్రమే సచివాలయానికి వెళ్లి సదరం పత్రాల జిరాక్స్‌ కాపీలు ఇవ్వగా వాటిని డీఆర్‌డీఏకు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు చూపిస్తున్న సదరం పత్రాలు అసలైనవో, కావో తేల్చాలని ఎండీవో సూచించారు. డీఆర్‌డీఏ అధికారులు వాటిని జిల్లా అస్పత్రుల సమన్వయాధికారి ద్వారా రిమ్స్‌కు పంపించి వాస్తవాలు నిర్థారించాలని సూపరింటెండెంట్‌ను కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని భౌతికంగా పరీక్షించి వైకల్యాన్ని నిర్ధారించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనర్హులను కాపాడే ందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

పరీక్షలకు ప్రజాప్రతినిధి అడ్డుకట్ట

 ఇక తనకు దృష్టిలోపం ఉన్నట్టు వికలాంగ ధ్రువపత్రం సంపాదించి 2003 డీఎస్సీలో వికలాంగుల కోటాలో ఎంపికై 2005లో నియామకం పొంది, ప్రస్తుతం ఇద్దివానిపాలెంలో పనిచేస్తున్న బంగారు అప్పలనరసమ్మను కాపాడేందుకు ఇచ్ఛాపురం ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై ‘సత్యం’లో వస్తున్న వరుస కథనాలపై స్పందించిన సదరు ప్రజాప్రతినిధి జిల్లా విద్యాశాఖ, రిమ్స్‌ అధికారులకు ఫోన్‌ చేసి అప్పలనరసమ్మ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్టు తెలిసింది. అవసరమైతే విద్యాశాఖ మంత్రితో చెప్పిస్తానని అప్పలనరసమ్మకు భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. రిమ్స్‌లో మూడుసార్లు వైకల్య నిర్ధారణకు హాజరుకాని ఆమెకు విశాఖ కంటి ఆస్పత్రిలో నాలుగుసార్లు జరిపిన పరీక్షల్లో 30 శాతానికి మించి వైకల్యం లేదని ధ్రువీకరించారు. అయినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇలీవల గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదుతో స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో రిమ్స్‌లో వైద్య పరీక్షలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు అప్పలనరసమ్మకు లేఖ రాశారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ఆమెకు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని అధికారులు చేతిలెత్తేశారని తెలిసింది.

1 Comment


Trillionaires Trademark
Trillionaires Trademark
Aug 09, 2024

Wowwww

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page