top of page

అమ్మ‘దొంగ’ పోలీసులూ..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 3
  • 2 min read
  • డీఎస్పీ కార్యాలయం పేరు చెప్పి రూ.30 లక్షలు నొక్కేసిన కానిస్టేబుళ్లు

  • దొంగనోట్ల చెలామణీ సొమ్మే పంచుకున్నారని ఆరోపణలు

  • సంబంధం లేని పోలీసులు రాయిపాడు ఎందుకు వెళ్లినట్టు?

  • డీఎస్పీ కార్యాలయం పేరు వాడకంపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పేరుకే వారు పోలీసులు.. కానీ దొంగలు చేసే పనులన్నీ చేస్తుంటారు. అందుకే ఏ విభాగంలో ఉన్నా జిల్లా మొత్తం యూనిఫాంతో తిరుగుతుంటారు. డబ్బు సంపాదనలో రకరకాల మార్గాలుంటాయి. కొంతమంది ఉద్యోగాలు చేసి, మరికొంతమంది వ్యాపారాలు చేసి సంపాదిస్తారు. కానీ వీరిద్దరు ఉద్యోగంతో పాటు వేరే దందాలు చేసి కూడా సంపాదిస్తున్నారు. దొంగలు దోపిడీ చేసి, రాజకీయ నాయకులు అవినీతి చేసి సంపాదిస్తారు. చెప్పుకుంటూపోతే ఇంకా చాలామార్గాలున్నాయి. ఎవరి మార్గం వారిది. అందరి లక్ష్యం ఒకటే. అయితే పోలీసు యూనిఫాం వేసుకున్నవారికి మాత్రం అవినీతిపరుల, దొంగల ఆట కట్టించడమే ధ్యేయం కావాలి. కానీ దొంగలకే దొంగలా వ్యవహరిస్తే.. ఆ పోలీసుల కోసం ఎవరికి చెప్పుకోవాలి. జిల్లాకు ఎస్పీగా మహేశ్వర్‌రెడ్డి వచ్చిన తర్వాత ఎవర్నీ క్షమించడంలేదని తెలిసి కూడా యూనిఫాం ముసుగులో దోపిడీకి తెరతీస్తే శిక్ష లేదనుకుంటున్నారో ఏమో?! వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం రూరల్‌ మండలం రాయిపాడు గ్రామానికి చెందిన బుడ్డీ ఎక్కడి నుంచో దాదాపు రూ.50 లక్షల వరకు నగదు తీసుకువచ్చారు. ఎలా తెచ్చాడు, ఎలా సంపాదించాడు? అనేది తేలకపోయినా గ్రామంలో అందరికీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాడని తెలుసుకున్న ఇద్దరు పోలీసులు తమకు అన్ని విషయాలూ తెలుసని, మర్యాదగా డబ్బులివ్వకపోతే కేసు నమోదు చేస్తామని, తాము శ్రీకాకుళం డీఎస్పీ ఆఫీసు నుంచి వచ్చామంటూ భయపెట్టి, ఆ సొమ్ములు గుంజుకున్న ఉదంతం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకటో పట్టణం స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సూరిబాబు, శ్రీకాకుళం రూరల్‌ స్టేషన్‌లో క్రైం కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గోపాల్‌ కలిసి రాయిపాడులో అముజూరి కృష్ణ ఉరఫ్‌ బుడ్డి ఎవరికైతే కొద్ది రోజులుగా విచ్చలవిడిగా డబ్బు పంచాడో వారందరి ఇళ్లకు వెళ్లి భయపెట్టి మరీ ఆ సొమ్ము గుంజుకున్నారట. ఇది జరిగి రోజులు గడిచినా ఇంతవరకు దీనిపై ఎటువంటి కేసూ నమోదు కాకపోవడంతో తమ వద్దకు వచ్చింది నకిలీ పోలీసులేమోనని రాయిపాడులో బుడ్డీ నుంచి డబ్బులు తీసుకున్నవారు భావించారు. కానీ ఆ తర్వాత కూడా బుడ్డీ దగ్గర మిగిలిన సొమ్మును, రాయిపాడులో మరికొందర్ని వెతికి పట్టుకొని మరీ మొత్తం సొమ్ము వసూలు చేసేయడంతో ఇది పోలీసుల దొంగపనేనని, నిజంగా ఈ సొమ్మును లెక్కల్లో చూపిస్తే కచ్చితంగా కేసు కట్టి తమ వద్ద వివరాలను తీసుకునేవారని, ఇంతవరకు అటువంటిది జరగకపోవడంతో తమ వద్ద సొమ్ములు కొట్టేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రాయిపాడుకు చెందిన బుడ్డీ తాను నకిలీ నోట్లు మార్చడం ద్వారా ఈ మొత్తాన్ని సంపాదించానని తాగిన మైకంలో గ్రామంలో కొందరికి చెప్పినట్టు భోగట్టా. బుడ్డీ గత చరిత్ర కూడా కొంత అనుమానాస్పదంగా ఉండటం వల్ల ఆయన నుంచి సొమ్ములు తీసుకున్నామంటే తమను కూడా లోపలేస్తారనే భయంతో ఎవరూ నోరు విప్పడంలేదు. అయితే ఈ డబ్బులు పంపిణీ చేసిన కృష్ణను స్టేషన్‌కు రావాలని వారి వెంట తీసుకువెళ్లిపోయారని, కృష్ణ డబ్బులు దుబారాగా ఖర్చుచేసి గ్రామంలో పంపిణీ చేస్తున్నట్టు స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన కూతురు, అల్లుడు రాజమండ్రి నుంచి వచ్చారని, వీరిద్దరిని పోలీసులు తీసుకువెళ్లిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. బుడ్డీ పంచిన సొమ్ము, బుడ్డీ వద్ద మిగిలిన సొమ్ము అన్నీ కూడా దఫదఫాలుగా వీరిద్దరూ పట్టుకుపోవడంపై ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో గందరగోళం జరుగుతోంది.

1 Comment


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page