top of page

అమ్మోరు దొంగలు దొరికారు!

  • Writer: ADMIN
    ADMIN
  • Oct 1, 2024
  • 1 min read
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేటలో శ్రీ రాజరాజేశ్వరి శక్తి పీఠంలో అమ్మవారి నగలను కాజేసిన దొంగల ముఠాను పోలీసులు అతి తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు తెలిపారు. ఏప్రిల్‌ 23న కుంచాల కురమయ్యపేటలోని శక్తిపీఠం అమ్మవారి గుడి తాళాలు బద్దలుకొట్టి అమ్మవారి ఒంటిపై ఉన్న 41 తులాల బంగారం, 12 కేజీల వెండి దొంగిలించిన కేసులో 9 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 36 తులాల బంగారం, 11.5 కేజీల వెండి, రూ.3.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొత్తం 39 నేరాలకు సంబంధించి 97.38 లక్షలు విలువైన బంగారం, వెండి, నాలుగు మోటార్‌ సైకిళ్లు, ఒక వెర్నా కారు కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 2021 నుంచి నిరంతరం ఏదో ఒక దేవాలయాల్లో నేరాలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగానే డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో రణస్థలం సీఐ అవతారం ఆధ్వర్యంలో ఎనిమిది మంది పోలీస్‌ టీమ్‌ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నామన్నారు. జిల్లాలో 31 దేవాలయాల్లోను, 4 గృహాల్లోను, ఒక చర్చి, మూడు రైస్‌మిల్లుల్లో దొంగతనాలకు పాల్పడ్డారని, విశాఖపట్నం, అంబేద్కర్‌ కోనసీమ, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు నేరాలకు వీరు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో ఐదుగుర్ని మీడియా ముందు ప్రవేశపెట్టగా, మరికొందరు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసును ఛేదించిన ప్రత్యేక బృందంలో ఉన్న సీఐలు ఎం.అవతారం, జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు వి.సందీప్‌కుమార్‌, జి.లక్ష్మణరావు, బి.నిహాల్‌, ఎం.వెంకటరావులతో పాటు హెడ్‌ కానిస్టేబుళ్లు ఎస్‌.శ్యామలరావు, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్‌సింగ్‌, కె.హేమసుందర్‌, ఇ.తారకేశ్వరరావు, కానిస్టేబుళ్లు కె.భాస్కరరావు, కె.సురేష్‌, ఎం.నీలకంఠం, ఆర్‌.సూరిబాబు, కె.లక్ష్మణరావు, పి.స్రవంతిలను ఎస్పీ అభినందించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page