ఆ స్థలం వారిదేనట!? దాని చుట్టూ నాలుగు స్తంభాలాట
- BAGADI NARAYANARAO
- Apr 2
- 3 min read
పలాస పట్టణంలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం
కొన్నామంటున్న ఇద్దరు, అగ్రిమెంటు పొందామని మరో ఇద్దరు
అసలు వారసులను కాదని ఎవరెవరో తెరపైకి
మళ్లీ విక్రయానికి, పొజీషన్‌కు, నిర్మాణానికి ఎవరి స్థాయిలో వారి యత్నాలు
ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ఆయా శాఖల అధికారులు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
కాస్త విలువైన స్థలం కనిపిస్తే చాలు.. దాని చుట్టూ కాకుల్లా వాలిపోతారు అక్రమార్కులు. పలాస`కాశీబుగ్గ పట్టణంలోని జీటీ రోడ్డులో ఒక ఖరీదైన స్థలం చుట్టూ ఇదే దందా జరుగుతోంది. ఆ రోడ్డులో ఒక రేకుల షెడ్డులో బట్టలు దుకాణం నడుస్తున్న స్థలం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్లు విలువ చేసి సర్వే నెం. 219/3లోని 565.5 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంపై తనకు అగ్రిమెంట్ ఉందంటూ నాలుగో కృష్ణుడు రంగప్రవేశం చేయడం కలకలం రేపుతోంది. తమది కాని ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను ‘సత్యం’ ఇంతకుముందే వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. మొదట స్థలాన్ని అద్దెకు తీసుకున్న నెయ్యల రామారావు అది తనకు పితాృర్జితంగా సంక్రమించినట్టు చూపించి తన కుమారుడు నెయ్యల రాజు పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేశాడు. నెయ్యల రాజు దాన్ని రొక్కం సాయి అనే వ్యక్తికి విక్రయించాడు. కాగా ఆ స్థలం తమదేనంటూ వరదరాజపురానికి చెందిన యు.మన్మధరావు కౌన్సిలర్ బోర బుజ్జికి విక్రయించాడు. ‘సత్యం’లో దీన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత పట్టణానికి చెందిన నారాయణరెడ్డికి కూడా నెయ్యల రాజు అగ్రిమెంట్ రాసిన విషయం బయటపడిరది. తనకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాతే రొక్కం సాయికి నెయ్యల రాజు విక్రయించినట్టు నారాయణరెడ్డి చెబుతున్నాడు. ఆ విధంగా ఒకే స్థలం కోసం వేర్వేరు వ్యక్తులు తమదంటే తమదేనని కుస్తీలు పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో పలాస పోలీసు అధికారి జోక్యం చేసుకున్నట్టు తెలిసింది.
ఫలించని రాజీ యత్నాలు
నారాయణరెడ్డికి ఇచ్చిన అగ్రిమెంట్ చెల్లదని బుకాయించడానికి యత్నించిన నెయ్యల రాజు పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ వివాదంలో టీడీపీ నాయకుల జోక్యంతో పలాస పోలీసు అధికారి వద్దకు పంచాయితీ చేరింది. సదరు అధికారి నెయ్యల రాజును పిలిపించగా న్యాయవాదితో కలిసి వెళ్లి సివిల్ మేటర్ కనుక కోర్టులో తేల్చుకుంటామని చెప్పారట. దాంతో ఆయన అగ్రిమెంట్ కాపీ చూపించి దీని సంగతేంటని ప్రశ్నించడంతో నెయ్యల రాజు దారికి వచ్చినట్టు తెలిసింది. సదరు అధికారి సమక్షంలోనే ఒక కాగితం రాయించి రాజీ ఒప్పందం చేయించి అగ్రిమెంట్‌గా ఇచ్చిన మొత్తానికి మరికొంత కలిపి ఇవ్వడానికి నెయ్యల రాజు అంగీకరించినట్టు తెలిసింది. అయితే నెల రోజులు గడుస్తున్నా ఒప్పందం మేరకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో నారాయణరెడ్డి న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలిసింది. నెయ్యల రాజుతో పాటు రొక్కం సాయికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మరోవైపు 219/3 సర్వే నెంబరులోని 565.5 చదరపు అడుగుల స్థలానికి అసలు వారసులైన బొత్స గోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు తమ వాదనకు మద్దతుగా 1968 నాటి రెవెన్యూ రికార్డులు, ఎస్‌ఎల్‌ఆర్, లింక్ డాక్యుమెంట్లను తీసుకొని కలెక్టర్, ఆర్డీవోలను కలిసి జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది.
అదీ.. ఇదీ.. ఒకటి కాదా?
మరోవైపు ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు చూపిస్తున్న బోర బుజ్జి, రొక్కం సాయిలు పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అయితే చెల్లింపుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. కొనుగోలు సమయంలో రొక్కం సాయి చెల్లించిన మొత్తానికి కొంత లాభం జోడిరచి చెల్లించడం ద్వారా ఆ స్థలాన్ని బోర బుజ్జి సొంతం చేసుకునే దిశగా చర్చలు జరిగాయి. అయితే రొక్కం సాయిని వెనుక నుంచి నడిపిస్తున్న రమణ అనే వ్యక్తి దీనికి అంగీకరించలేదని తెలిసింది. దీంతో సాయి మరో వ్యాపారికి ఆ స్థలాన్ని విక్రయించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి ముందు బోర బుజ్జికి ఆ వివాదాస్పద స్థలంతో సంబంధం ఏమిటని రమణ ఆరా తీసినట్టు తెలిసింది. బోర బుజ్జి చూపిస్తున్న డాక్యుమెంట్‌లో పేర్కొన్న సర్వే నెంబర్ 225/1లో ఉన్న స్థలాన్ని చూపించమంటూ దాన్ని విక్రయించిన యు.మన్మధరావును పట్టణానికి తీసుకువచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదురుగా జీటీ రోడ్డుకు తూర్పు దిశలో క్రిస్టియన్ శ్మశానవాటిక సమీపంలో స్థలం ఉన్నట్లు ఆయన చెప్పినా కచ్చితంగా ఎక్కడ ఉందన్న విషయాన్ని మాత్రం మన్మధరావు చూపించలేక పోయారని తెలిసింది. కాగా బోర బుజ్జి కొనుగోలు చేసిన స్థలానికి, రొక్కం సాయి కొనుగోలు చేసిన స్థలానికి హద్దులు ఒక్కటే కావడంతో ఆ రెండూ ఒక్కటేనన్న వాదనను బోర బుజ్జి వినిపిస్తున్నారు. అయితే రొక్కం సాయి మాత్రం వేరొకరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పొజీషన్ కోసం ఒకరు.. నిర్మాణ అనుమతి కోసం ఇంకొకరు
సర్వే నెంబర్ 219/3లోని 565.5 చదరపు అడుగుల స్థలాన్ని రమణ సహకారంతో సొంతం చేసుకున్న రొక్కం సాయి ఆ స్థలంలో నడుస్తున్న బట్టల దుకాణం నుంచి రూ.30వేలు అద్దె వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దుకాణంలో నెయ్యల రామారావు పేరుతో ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను రొక్కం సాయి పేరుతో మార్పించారు. దీన్ని ఆసరా చేసుకొని దుకాణం ఉన్న స్థలానికి పొజీషన్ ఇవ్వాలని పలాస తహసీల్దారుకు రొక్కం సాయి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అనంతరం స్థానిక సీనియర్ టీడీపీ నాయకుడితో తహసీల్దారుకు ఫోన్ చేయించి పొజీషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. అయితే ‘సత్యం’లో ఈ వివాదంపై కథనాలు రావడంతో జంకిన తహసీల్దార్ పొజీషన్ ఇవ్వడానికి కొంత సమయం కావాలని టీడీపీ నాయకుడిని కోరినట్లు తెలిసింది. మరోవైపు ఇదే స్థలంలో భవన నిర్మాణానికి బోర బుజ్జి ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ అప్రూవల్ ఉన్నందున భవన నిర్మాణానికి ప్లాన్ ఇవ్వాలని ఆయన పెట్టిన దరఖాస్తుపై మున్సిపల్ చైర్మన్ సంతకం చేసినా కమిషనర్ వద్ద పెండిరగ్‌లో ఉంచినట్టు తెలిసింది. ఎవరికో చెందిన స్థలాన్ని నలుగురు వ్యక్తులు తమదంటే తమదని అధికారుల చుట్టూ తిరుగుతూ మంత్రాంగాలు నెరుపుతుండటంపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది. స్థలానికి అసలు వారసులు ఉన్నా, వారిని కాదని దాన్ని సొంతం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Comments