ఇతర భాషలపై దురభిప్రాయం కూడదు!
- DV RAMANA
- Mar 21
- 2 min read

‘ఎంత మదమెంత కావరమెంత పొగరు’.. అని ఏదో సినిమాకు పింగళి నాగేంద్ర రాసిన మాటలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోయేట్టున్నాయి. నోటి బలుపని కూడా వర్ణించుకోవచ్చు. వీళ్లు ఈ దేశాన్ని ఏలుతున్న మంత్రులా లేక ప్రాంతాలకు, వారి వారి సంస్థలకు నియమితులైనవాళ్లా? దేశం మొత్తానికి, ప్రజలకు బాధ్యత వహించాల్సిన మంత్రుల భాషణం(మాటతీరు) ఇంత దారుణంగా ఉండటం అత్యంత గర్హనీయం. పార్లమెంటులోనే కాదు.. ప్రజలందరూ ప్రతిస్పందించాల్సిన విషయమిది. అది తమిళ ప్రజలకు సంబంధించిందే కావచ్చు. కానీ ఎవరినైనా అనటానికి వెనుకాడనితనమే కనపడుతున్నది. పార్ల మెంట్ సాక్షిగా కేంద్రమంత్రి, అందులోనూ విద్యాశాఖ మంత్రి తమిళ ప్రజలను అనాగరికులంటూ వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయం. గతంలోనూ ఈ ‘ఉత్తర’ కుమారులు ద్రవిడులు నల్లవాళ్లని హీనం గా మాట్లాడటం విన్నాం. దేశంలోని ఒక ప్రాంత ప్రజలను అనాగరికులని అవమానించే దుస్సాహసానికి ఒక మంత్రి పూనుకోవడాన్ని ముక్తకఠంతో ఖండిరచాల్సిన విషయం. అందుకే లోక్‌సభలో డీఎంకే సభ్యు లు ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈ సంభాషణ చోటుచేసు కోవడానికి త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అమలు చేయడం లేదన్న అక్కసే కారణం. తమిళులు ఎప్పటినుంచో హిందీ భాషను తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపి 2020) ప్రకారం మూడు భాషలు నేర్చుకోవాలని నిర్దేశిస్తోంది. పరోక్షంగా హిందీని దేశమంతా రుద్దేందుకు కేంద్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తామని తమిళ నాడు వాదిస్తోంది. ఉత్తర భారతదేశంలో కూడా ద్రావిడ భాషలు అమలు కావడం లేదు. అసలు ఒక లిపిలేని భాషను ఎక్కువ మంది మాట్లాడుతున్నారని సాకుతో అధికార భాషగా చేసి, అందరూ నేర్చుకోవా లని ఆంక్షలు పెట్టడమేమిటన్నది విమర్శకుల వాదన. ఇది ఉత్తర భారత ఆధిపత్యాన్ని, కేంద్రీకృతతత్వాన్ని అమలు చేయడంలో భాగమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాషలపై ద్వేషాలు ఏమీలేవు. ఎవరైనా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, అభిమానించవచ్చు. కానీ ఆధిపత్య ధోరణితో ఒక భాషను తమ పై రుద్దడాన్ని ఎవరూ అంగీకరించరు. ద్రావిడ ప్రాంతంపై హిందీని రుద్దడమే కాదు, ఉత్తర భారతం లోని అనేక ప్రాంతీయ భాషలు హిందీ ఆధిపత్యం వల్ల కనుమరుగైపోయాయనీ విశ్లేషకులు వెల్లడిస్తు న్నారు. త్రిభాషా విధానాన్ని అమలుచేయని రాష్ట్రాల విద్యారంగానికి నిధులు నిలిపివేస్తామని కేంద్ర ప్రభు త్వం బెదిరించడం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం సరి కాదు. తమపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడుతున్న తమిళనాడు ప్రభుత్వం, తాను ప్రవేశపెట్టే బడ్జెట్ లోగోనూ మార్చేసింది. దేవనాగరి లిపిలో ఉండే రూపాయి చిహ్నం స్థానంలో తమిళ రూపాయి అక్షరాన్ని ఉంచింది. ‘ఎల్లోర్ కుమ్ ఎల్లామ్’ (అందరి కోసం అన్నీ) అని రాసి ఉన్న లోగోను విడుదల చేసింది. ‘మా భాషను, నాగరికతను పార్లమెంటులో అపహాస్యం చేస్తుంటే, మేము దానిని రక్షించుకోవాలి కదా’.. అని స్పష్టం చేసింది. అదే ఇప్పుడు భాషాభిమానం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవంగా చర్చ జరుగుతోంది. ఇదిలా కొనసాగుతుండగా కేంద్రం మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. అదే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగే విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉందని పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన ఉత్తరాదిన పార్లమెంటు సీట్లు పెంచి, దక్షిణాదికి పెర గకపోతే, పార్లమెంటుకు దక్షిణ భారతం ప్రాధాన్యత, ప్రాతినిధ్యం తగ్గిపోతాయి. ఇది సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకమని ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. కాగా రాజకీయంగా పరిశీలిస్తే బీజేపీ విస్తరణకు దక్షిణ భారతదేశం పెద్ద ఆటంకంగా ఉన్న విషయం పదేళ్లుగా కనపడు తోంది. తన కేంద్రీకృత జమిలి ఎన్నికల విధానాన్ని నెగ్గించుకోవటానికి ఆ పార్టీకి పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం సరిపోవడం లేదు. అందువల్ల ఏ విధంగానైనా డీలిమిటేషన్ ప్రక్రియలో తనకు బలమున్న ఉత్తర భారతంలో లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ వ్యూహకర్తలు ముందుకు పోతున్నారు. దీన్ని గుర్తించిన తమిళనాడు.. ఈ నెల 22న దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయ కులు, ముఖ్యమంత్రులను సమావేశం ఏర్పాటు చేస్తున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మాత్రమే స్పందించలేదు. కానీ ఎక్కువ పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని పిలుపునిస్తున్నారు. కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను ఈ రకంగా తగ్గించే చర్యలను తిప్పి కొట్టాల్సి ఉంది. అహంకారంతో దక్షిణాది ప్రజలపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిరచాలి.
Comments