ఎందరు టార్చర్ పెట్టినా.. నేను టార్చ్‌బేరర్‌నే!
- DV RAMANA
- Apr 16
- 9 min read
కొందరివాడిని కాదు.. అందరివాడు స్క్వేర్
పలువురు ఇబ్బంది పెట్టి నన్ను ముంచాలని చూశారు
పార్టీ, ప్రజలే నా జెండా.. అజెండా
తొమ్మిది నెలల్లోనే ఎన్నో సమస్యలను గాడిలో పెట్టా
రథసప్తమికి రాష్ట్ర పండుగ గుర్తింపు తేగలగడం ఒక చరిత్ర
స్థానికుల సహకారంతోనే అరసవల్లి, పెదపాడు ఆక్రమణల తొలగింపు
‘సత్యం’ ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

కొన్ని నెలల క్రితం వరకు ఆయన ఒక సామాన్య నాయకుడే. ఒక పంచాయతీకి సర్పంచ్ మాత్రమే. కానీ జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యే అవ్వాలని కలగన్నారు. అహోరాత్రులు కృషిచేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అన్నింటికీ ఎదురొడ్డి ప్రజలు, కార్యకర్తల మద్దతుతో రికార్డు స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. పదవిలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను గుర్తించారు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ అవాంతరాలను, అడ్డంకులను తొలగించుకుని పనులు ముందుకు సాగేలా మార్గం సుగమం చేశారు. ఈ క్రమంలో కొందరివాడిగా మిగిలిపోతున్నారన్న విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు. అయితే తాను కొందరివాడిని కాదని అందరివాడి కంటే ఎక్కువేనంటూ ఆయన సమర్థించుకున్న తీరు కూడా సమర్థనీయమే. ఎవరూ ఊహించని విధంగా పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసుకుని ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘సత్యం’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
సత్యం: మీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది. కొత్త ఎమ్మెల్యేగా ఈ తొమ్మిది నెలల్లో ఏం సాధించారు అంటే.. ఏం చెబుతారు?
ఎమ్మెల్యే శంకర్: ఈ తొమ్మిది నెలల్లో నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అనేక సమస్యల పరిష్కారానికి ఉన్న అడ్డంకులను తొలగించి వాటిని గాడిలో పెట్టగలిగాను. రథసప్తమి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెప్పించగలగాను. మూడు రోజులపాటు ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గర్తింపు తెచ్చాం. ఈసారి ఉత్సవాల్లో 1.30 లక్షల మంది భక్తులు ఒకేరోజు పాల్గొనడం విశేషం. ఆ తర్వాత చెప్పుకోదగ్గది శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణ. దీని దుస్థితిపై పలు సందర్భాల్లో నేను, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దీపం`2 పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఈ సమస్యను ఆయన దృష్టిలో పెట్టగా ఆయన స్పందించి రూ.16 కోట్లు మంజూరు చేశారు. అలాగే పనులు ప్రారంభించడానికి బిటుమిన్ కావాలంటే నేనే స్వయంగా 205.8 మెట్రిక్ టన్నుల బిటుమిన్ ఇప్పించి పనులు స్టార్ట్ చేయించాను. మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పనులు చాలావరకు చేశాం కూడా. ఇప్పుడు రోడ్డు నిర్మాణం చాలావరకు పూర్తి అయ్యింది. వాస్తవానికి ఈ పనులకు పరిపాలన అనుమతులు రాలేదు. అవి లేకుండా యుటిలిటీ షిఫ్టింగ్ చేయడానికి లేదు. పనులు ప్రారంభించడానికి లేదు. అయినా చేయగలిగాం. మిగిలిన డే అండ్ నైట్ నుంచి కొత్తరోడ్డు వరకు విస్తరణలో రోడ్డుకు మాస్టర్ ప్లాన్ మేరకు 60 నుంచి 80 అడుగులు విస్తరిస్తే తప్ప టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి లేదు. కానీ కార్పొరేషన్‌లో కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందలేదు. అయినా నిధులు తెచ్చి ప్రజలను ఒప్పించి రోడ్డు వెడల్పును చేపడుతున్నాం. రాగోలులో కూడా ఇవన్నీ వివరించి, ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు జరిగేలా చేశాను.
సత్యం: మీ నియోజకవర్గం పరిధిలో పెట్రోల్ బంక్ నుంచి కొత్తరోడ్డు వరకు కల్వర్టులు ఉన్న చోట్ల విస్తరణ పనులు జరగలేదు కదా?
ఎమ్మెల్యే శంకర్:
రాగోలు, వాకలవలస ప్రాంతాలు కూడా నా నియోజకవర్గంలోకే వస్తాయి. రాగోలు అంతా పూర్తి అయ్యింది. అయితే శ్రీకాకుళం నగర పరిధిలో కోర్టు భవనాలు ఉన్నాయి. వీటిని తొలగించి విస్తరణ చేపట్టాలంటే హైకోర్టు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకు లేఖలు పెట్టించాం. యుటిలిటీ షిఫ్టింగ్‌కు అనుమతి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాకుండా కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు సంబంధించి పాత కాంట్రాక్టర్‌ను నిలిపివేసి కొత్తగా టెండర్లు పిలిచారు. ఇందులో పాత కాంట్రాక్టర్‌కే మళ్లీ టెండర్ ఖరారైంది. గతంలో పనులు పూర్తిచేయలేదు కాబట్టి, ఆయన సమర్ధత మీద అనుమానంతో ఈ టెండర్‌ను పెండిరగులో పడేశారు. నేను ఆ సమస్యను క్లియర్ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా అతనితోనే మళ్లీ పనులు చేయిస్తున్నాం. లేకపోతే ఆ పనులు ఐదేళ్లయినా అలాగే పెండిరగులో ఉండిపోయేవి. రెండు ఫ్లోర్లు ఇప్పటికే వేశారు. గతంలో గ్యాలరీ లేకుండా చేస్తే ఇప్పుడు గ్యాలరీ ఏర్పాటు చేయిస్తున్నాం.
నర్సింగ్ కళాశాల విషయానికొస్తే.. గత ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను టెర్మినేట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. కోవిడ్ సమయంలో మానవతా దృక్పథంతో పనులు చేపట్టమని ప్రభుత్వం కోరగా, మళ్లీ పనులు ప్రారంభించారు. అయినా బిల్లు ఇవ్వకపోవడంతో పనులు నిలిపివేయడంతో టెర్మినేట్ చేశారు. పనుల అంచనా విలువలను రూ.18 కోట్లకు సవరించి మళ్లీ టెండర్లు పిలవడానికి ప్రయత్నించగా పాత కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని పాత కాంట్రాక్టర్‌తో మాట్లాడితే పాత రేట్లకే పనులు చేయడానికి అంగీకరించారు. ఆ విషయాన్ని సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అంగీకరింపజేశాను. కాంట్రాక్టర్ కూడా కోర్టులో కేసును విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. దీని వల్ల పనుల ప్రారంభానికి మార్గం సుగమం కావడంతోపాటు పాత రేట్లకే పనులు చేయడం వల్ల నిధుల ఆదా అయ్యేలా చేయగలిగాను.
కళింగపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం దాదాపు పూర్తి అయ్యి విద్యుద్దీకరణకు అవసరమైన పరికరాలు వచ్చినా గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పనులు జరగలేదు. చేసిన పనులకు రూ.20 లక్షల బిల్లులు పెండిరగులో ఉండిపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఇది కాకుండా మరో రూ.89 లక్షల పనులు జరగాల్సి ఉన్నా గత ప్రభుత్వంలో జరగలేదు. ఈ దశలో కాంట్రాక్టర్‌ను టెర్మినేట్ చేయాలని ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్ణయించింది. అదే జరిగితే మళ్లీ కొత్త కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి, వాళ్లు పనులు చేపట్టడానికి చాలా టైమ్ పడుతుంది. దీన్ని నివారించేందుకు నేను ఆ సంస్థ ఎండీని కలిసి మాట్లాడి ఒప్పించాను. దాంతో పనుల ప్రారంభానికి లైన్‌క్లియర్ అయింది. రెండు నెలల్లో పని పూర్తి అవుతుంది. 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నగరంలో వాంబే కాలనీ వద్ద ఎస్టీబీ ప్లాంట్ పనులు నిలిచిపోతే కలెక్టర్‌తో మాట్లాడి పునురుద్ధరించేలా చేశాను. మిర్తిబట్టి పనులను కూడా మళ్లీ లైనులో పెట్టించాను. స్టేట్ హైవే నెం`1 కళింగపట్నం`శ్రీకాకుళం`పాలకొండ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పెట్టాం. ప్రధానమంత్రి కార్యాలయంలో అది పెండిరగులో ఉంది. ఆమోదం లభిస్తే నిధులు అందుతాయి. బైపాస్ రోడ్డు నిర్మించకోవచ్చు.
శ్రీకాకుళం నగరంలో డ్రైనేజి వ్యవస్థను ఆధునికీకరించడానికి ప్రతిపాదనలు(డీపీఆర్) సిద్ధం చేశాం. రూ.22 కోట్లతో తాగునీటి పథకం పెండిరగులో ఉంది.. దాన్ని కూడా స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. వారంలో టెండర్లు పిలుస్తారు. అమృత్ పథకం కింద మంజూరైన పదివేల ఇళ్లను వెనక్కి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా, నేను చొరవ తీసుకుని వాటిని విలీన పంచాయతీలతోపాటు నగరంలోని పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం.
కాంప్రెహెన్సివ్ నాగావళి రివర్ డెపలప్‌మెంట్ ప్రాజెక్ట్(సీఎన్‌ఆర్‌డీపీ) పేరుతో నది వెనుక వైపు ట్రాక్ వేసి ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసే పనులకు సంబంధించి సర్వే జరుగుతోంది.నగరంలో ప్రధాన కాలువల్లో సిల్ట్ తీయించాం. వాంబే కాలనీల్లో సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయించాం. వైకాపా ప్రభుత్వ హయాంలో 88 పనులకు టెండర్లు ఖరారు చేసినా ఆ ప్రభుత్వంపై అపనమ్మకంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. మేం వచ్చిన తర్వాత వారందరినీ పిలిపించి మాట్లాడి పనులు చేపట్టేందుకు ఒప్పించాం. ఇప్పటికే 52 పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
రథసప్తమి సందర్భంగా నగరం సుందరీకరణలో భాగంగా పెదపాడు రోడ్డును విస్తరించాం. పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి అరసవల్లి వరకు రోడ్డును బ్యూటిఫికేషన్ చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పాలకొండ రోడ్డు పొడవునా సెంటర్ డివైడర్లు, లైటింగ్ కొత్తగా పెట్టించాం.
నగరం నడిబొడ్డులో ఉన్న మహిళా జూనియర్ కళాశాలలో 1470 మంది విద్యార్థినులు ఉండగా ఏడు క్లాస్‌రూములే ఉన్నాయి. దాంతో వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా వెళ్లి పరిశీలించాను. ఆ తర్వాత కలెక్టర్‌ను కలసి పరిస్థితి వివరిస్తే ఆయన సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి రూ.70 లక్షలు ఇవ్వడంతో ఐదు క్లాస్ రూముల నిర్మాణం జరుగుతోంది. ఇక హాస్టల్ వ్యవస్థ సరిలేదంటే దాన్ని కూడా సరిచేశాం. రోడ్లు వేయించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తున్నాం. అలాగే పబ్లిక్‌కు నాలుగు, కళాశాల విద్యార్థినులకు నాలుగు.. మొత్తం ఎనిమిది బాత్‌రూములు కట్టిస్తున్నాం.
గార, శ్రీకూర్మం పీహెచ్‌సీ భవనాల ఆధునికీకరణ పనులను చెరో రూ.50 కోట్లతో చేయిస్తున్నాం. శ్రీకూర్మంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.1.53 కోట్లతో టెండర్లు ఖరారు చేయగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. డైట్ కళాశాలలో పీఎంశ్రీ పథకం కింద రూ.2.50 కోట్లతో ఇప్పటికే ఒక భవన నిర్మాణం పూర్తి కాగా.. మరో రూ. ఏడు కోట్లు మంజూరుయ్యాయి. ఈ నిధులతో చేపట్టే పనుల శంకుస్థాపనకు మంత్రి లోకేష్‌ను ఆహ్వానించాం. ఆయన త్వరలో రానున్నారు.
శ్రీకాకుళం నగరం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధుల సమస్య ఉంది. దాన్ని అధిగమించి ఈ పనులు ఎలా చేపట్టాలన్నది ఆలోచిస్తున్నాం. నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ రోడ్డును విస్తరించాలని స్థానికులు నన్ను కలిసి కోరారు. ఆ మేరకు దానికి రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఆర్డీపీ) రెడీ చేశాం. ఈ ప్రాజెక్టుకు రూ.12 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి ప్రభుత్వానికి లేఖ రాశాను. ఇలీసుపురంలోని రైతుబజారు నుంచి బొందిలీపురం మీదుగా పాత ఏసీబీ ఆఫీసు వరకు రోడ్డును 60 అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించాం. దీనికి అవసరమయ్యే రూ.7 కోట్లకు సుడా సహకరిస్తుంది.
శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో రోడ్ల నిర్మాణాలకు ఇంతకుముందు రూ.42 కోట్లు అందగా, ఇటీవల మరో రూ.20 కోట్లు అందాయి. ఈ నిధులతో ఇప్పటికే 30 కి.మీ. సీసీ రోడ్లు నిర్మించాం. మరో 30 కి.మీ. మేర రోడ్ల నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నాం. నియోజకవర్గంలో ఒక కి.మీ. నిడివి ఉన్న రోడ్లను రూ.20 కోట్ల ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లుగా మారుస్తున్నాం.
సత్యం: కిష్టప్పేట సర్పంచ్‌గా ఉన్నప్పుడు, ఎన్నికల ముందు, తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ గెడ్డంతో కనిపించేవారు. ఇప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నారు. ఇలా మారమని ఎవరైనా సలహా ఇచ్చారా?
ఎమ్మెల్యే శంకర్: సాల్ట్ అండ్ పెప్పర్ కాదు. సాల్ట్ ఎక్కువైంది. గతంలో గెడ్డానికి కలర్ వేయమని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరు గెడ్డం తీసి చూడమని సలహా ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు రెండున్నరేళ్ల క్రితం వరకు క్లీన్ షేవ్‌తో టక్, బూట్లతో తిరిగేవాడిని. అంతకుముందు విద్యార్థిగా ఉన్నప్పుడు సినీనటుడు జె.డి.చక్రవర్తి మాదిరిగా గెడ్డంతో ఉండేవాడిని. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాక తీరక లేక గెడ్డం పెంచాను. ఇప్పుడది తీసేశాను అంతే. ఇంకేంలేదు.
సత్యం: ఎన్నికై తొమ్మిది నెలలైనా మీ ఇంటి వద్ద, కార్యాలయం వద్ద జనం వెల్లువెత్తుతున్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద లేనివిధంగా మీ కార్యాలయం వద్దే ఎందుకు ఇంత టైట్ షెడ్యూల్, రద్దీ?
ఎమ్మెల్యే శంకర్: అదే అర్థం కావడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. భూముల రీసర్వే వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాస్‌బుక్కుల కోసమే ఎక్కువమంది వస్తున్నారు. ఇక పెన్షన్ దరఖాస్తులు అధిక సంఖ్యలో పెండిరగులో ఉండిపోయాయి. వాటితోపాటు ఇళ్లు కావాలని, రుణాల మంజూరు చేయించాలని కోరుతూ పెద్దసంఖ్యలో వస్తున్నారు. కిష్టప్పేట సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండటం అలవాటు. ఇప్పుడూ అదే కొనసాగిస్తున్నాను. అందువల్లే ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో రీసర్వే సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నగరంలోని కంపోస్ట్ కాలనీ, కిల్లిపాలెం తదితర ప్రాంతల్లో ఎస్సీ, బీసీలకు ఇళ్లు ఇచ్చినా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఈ సమస్యను ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాను. రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆయన కలెక్టర్‌తో మాట్లాడారు. త్వరలో వారందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడమో లేదంటే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 30లో పేర్కొన్న విధంగా 150 గజాల వరకు ఇళ్లు నిర్మించుకున్న వారిని క్రమబద్ధీకరించడమో చేస్తాం.
సత్యం: గతంలో అందరివాడుగా ఉన్న శంకర్ ఇప్పుడు కొందరివాడిగా మిగిలిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మీ పార్టీలోనే చాలామంది అంటున్నారు. మీరేమంటారు?
ఎమ్మెల్యే శంకర్: ఇప్పుడే మీరన్నారు. నా కార్యాలయం వద్ద ఎక్కడా లేని రద్దీ నిత్యం ఉంటోందని. నేను కొందరివాడిని కాదనడానికి అదే నిదర్శనం. పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరిగే వరకు 25 రోజులు పార్టీలో పలువురు నాయకులు నన్ను టార్చర్ పెట్టారు. కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతే ఇంకొందరు అంటే ముగ్గురు నలుగురు పార్టీలోనే ఉండి నష్టం చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నన్ను నమ్మారు. సహకరించి గెలిపించారు. పార్టీ జెండాయే నా అజెండా. పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ల ఆదేశానుసారం నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత, ధ్యేయం. పార్టీ, కార్యకర్తలు, ప్రజలే నా ప్రయారిటీ. దీనికి మంచి ఉదాహరణ చెబుతాను. ఇటీవల మా పార్టీ డివిజన్ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆటో డ్రైవర్ శ్రీను క్యాన్సర్ బారిన పడ్డాడని, చికిత్సకు డబ్బులు లేవని తెలిసిన వెంటనే విరాళాలు సేకరించి రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందజేశాను. నియోజకవర్గ పార్టీ చరిత్రలో ఒక కార్యకర్తకు ఇలా సహాయం చేసిన సందర్భమే లేదు. అలాగే శ్రీను మరణిస్తే స్వయంగా నేను ఆయన పాడె మోశాను. 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.45 లక్షలు ఇప్పించాను. ఇప్పటివరకు 32 చెక్కులు మంజూరు చేయించాను. నియోజకవర్గంలో రూ.42 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల పనులన్నింటినీ పార్టీ కార్యకర్తలకే అప్పగించాను. ఒకవిధంగా చెప్పాలంటే నేను కొందరివాడిని కాకపోగా.. అందరివాడి కంటే డబుల్ అందరివాడు స్క్వేర్ అని చెప్పుకోవాలి. డబుల్ కాదు పదిరెట్లు పెరిగినట్లు లెక్క. మరో విషయమేంటంటే.. గతంలో నాచుట్టూ పరిమితంగా ఉండేవారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నావద్దకు వచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగారు. అందరికీ సమయం ఇవ్వాలి. గతంలో కొద్దిమందికి కేటాయించిన సమయాన్నే ఇప్పుడు అందరికీ సర్దుబాబు చేయాల్సి వస్తోంది. దాంతో గతంలో నావద్ద ఎక్కువసేపు ఉండేవారు సహజంగానే తమకు గతం కంటే ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఎమ్మెల్యే దూరమయ్యారని బాధపడటం సహజం. గతంలో నేను కేవలం నాయకుడినే. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. ఆ హోదాలో ప్రభుత్వం, పార్టీ, కార్యకర్తలు, ప్రజలకు నా సమయాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కడి రమ్మన్నా వెళ్లాలి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. పార్టీ క్యాడర్, ప్రజలు ఈ విషయాలను గమనించి సహకరించాలి. ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయను.
సత్యం: మొదటినుంచీ ఉన్న తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని పాతవారు, కొత్తగా వచ్చిన తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కొత్తవారు అసంతృప్తితో ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది?
ఎమ్మెల్యే శంకర్: ఈ ప్రచారం, అసంతృప్తి కొంత నిజమే. కానీ అది అపోహే. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో గెలిచాను. అందర్నీ కలుపుకుపోవాలనే చూస్తున్నాను. కానీ సమయం కుదరడంలేదు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి.
సత్యం: మీ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరసవల్లి, పెదపాడు ప్రాంతాల్లో అక్రమణల జోలికి వెళ్లలేదు. గతంలో మీ పార్టీ ఎమ్మెల్యే అరసవల్లిలోనే నివాసం ఉంటే.. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో మంత్రి పెదపాడులో ఉండేవారు. కానీ వారు చేయని సాహసం మీరు చేసి ఆక్రమణలు తొలగించారు. ఓట్లు పోతాయన్న భయం లేదా?
ఎమ్మెల్యే శంకర్: ఓట్లు పోతాయన్న భయం లేదు గానీ వ్యతిరేకత వస్తుందనుకున్నాను. కానీ మంచి పని చేయాలని భావించాను. నా ప్రయత్నానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పూర్తిగా సహకరించారు. రోడ్లు విస్తరించాలంటే పలు భవనాలు తొలగించాల్సి ఉంటుందని సూచించారు. దాంతో ముందుకెళ్లగలిగాను. అరసవల్లి నిర్వాసితులకు ప్రసాద్ స్కీం కింద పునరావాసం కల్పిస్తామని హామీ ఇస్తే నమ్మి సహకరించారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానికులందరూ నా చుట్టూ గుమిగూడి ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి రథసప్తమి ఉత్సవాల్లో గతంలో కంటే రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు జరిగాయని వెల్లడిరచారు. అలాగే పెద్దపాడు ప్రజల ఆహ్వానం మేరకు గతంలో ఆ గ్రామంలో పర్యటించాను. ఆ సందర్భంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, తామంతా సహకరిస్తామని గ్రామ పెద్దలు భరోసా ఇచ్చారు. దాంతో అక్కడ పనులు చేపట్టగలిగాం. ఇదేవిధంగా శ్రీకాకుళం నగరంలో మరికొన్ని రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆలోచన ఉంది. ప్రజలు అందుకు సహకరించాలి.
సత్యం: ఎమ్మెల్యే అయిన తర్వాత శంకర్ బాడీ లాంగ్వేజ్ మారింది, మాట తీరు, యాటిట్యూడ్ మారిందంటే మీరేమంటారు?
ఎమ్మెల్యే శంకర్: వేషం కొంత మారింది గానీ మాటతీరు, బాడీ లాంగ్వేజ్, నా నడవడిక ఎప్పటికీ మారవు. డ్రెస్ కోడ్ మార్చమని, గెడ్డం తీసేయమని, వాహనం మార్చమని పలువురు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం గెడ్డం తీసేశాను. డ్రెస్ కొంత మారింది అంతే. నడవడిక విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గే ఉంటాను. 2001 నుంచి ప్రజలతోనే ఉన్నాను. ఇరవయ్యేళ్ల కష్టానికి ఫలితం ఈ ఎమ్మెల్యే పదవి. ప్రజల ఆదరణతోనే ఇది సాధ్యమైంది. అందువల్ల వారిని విస్మరించే సమస్యే లేదు. నిరంతరం ప్రజలతోనే ఉంటాను. అర్ధరాత్రి పిలిచినా వస్తాను.
సత్యం: ఫోన్ చేస్తే స్పందించరన్న విమర్శ మీపై ఉంది?
ఎమ్మెల్యే శంకర్: రకరకాల కారణాల వల్ల వెంటనే ఎత్తలేకపోవచ్చు. కానీ తర్వాత పలువురికి కాల్ బ్యాక్ చేసి మాట్లాడుతుంటాను. నేనూ మనిషినే. పైగా ఎమ్మెల్యేని కూడా. యాభయ్యో వందో ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ కావచ్చు. కానీ 300, 400 కాల్స్ వస్తే అన్నింటికీ వెంటనే సమాధానం చెప్పగలమా? పైగా అసెంబ్లీ సమావేశాల్లో, ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ ఎత్తడం సాధ్యం కాదన్నది తెలిసిందే. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాను. కాల్ డైవర్షన్ పెట్టి నాకు వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు అటెండ్ అయ్యేందుకు ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టాను. ఇప్పుడు నాకు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను ఆయన మాట్లాడుతున్నారు.
సత్యం: ఇంతకుముందు మీరు చెప్పిన పనులన్నీ పెండిరగులో ఉన్న విషయాన్ని గతంలోనే గుర్తించారా? ఎమ్మెల్యే అయ్యాక గుర్తించారా?
ఎమ్మెల్యే శంకర్: గతంలోనే దీర్ఘకాలిక సమస్యలను గుర్తించాను. కానీ ఎమ్మెల్యే అయ్యాక వాటి లోతుల్లోకి వెళితే తప్ప వాటి వెనుక కారణాలు, గతంలో ఉన్న నేతల నిర్లక్ష్యం తెలిసి వచ్చాయి. దాంతో ప్రతి పెండిరగు సమస్యపై వేర్వేరుగా సంబంధిత అధికారులు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి మళ్లీ ఆ పనులపై పట్టాలపైకి ఎక్కించగలిగాను. లేనిపక్షంలో ఈ పనులు ఎప్పటికీ పరిష్కారానికి నోచుకునేవి కావేమో! నర్సింగ్ కళాశాల పాత కాంట్రాక్టర్‌తో కోర్టు కేసును ఉపసంహరింపజేసి తిరిగి అతని చేతే రెండు మూడు రోజుల్లో పనులు చేపట్టేలా చేయడమే నా విజయాలకు నిదర్శనం. అలాగే శ్రీకాకుళం నగరంలో ఇంతవరకు 133 కేవీ సబ్‌స్టేషన్ లేకపోవడం విచారకరం. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
సత్యం: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలందరిలోనూ మీకే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం లభించినట్లుంది కదా?
ఎమ్మెల్యే శంకర్: అదేం లేదు. చాలామందికి మంచి అవకాశాలు లభించాయి. ఇంకా చెప్పాలంటే నాకే తక్కువ అవకాశం లభించింది. కేవలం ఒకే క్వశ్చన్ అడిగే అవకాశం వచ్చింది. అయితే దానికి సమాధానం చెప్పాల్సిన మంత్రి పవన్‌కల్యాణ్ అనారోగ్యంతో హాజరుకాకపోవడంతో ఆ క్వశ్చన్‌ను వాయిదా వేశారు. కాగా జీరో అవర్, స్వల్పకాలిక అంశాల ప్రస్తావన, బడ్జెట్‌పై చర్చ, డిమాండ్లపై చర్చ వంటి సందర్భాల్లో చొరవ తీసుకుని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాను. ఇంకా చాలా అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంది.
సత్యం: అధికారులను ఓవర్‌టేక్ చేస్తున్నారు, దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి?
ఎమ్మెల్యే శంకర్: ఇది అవాస్తవం. పనులు జరగాలన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడి ఉండవచ్చు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో గట్టిగానే వ్యవహరించాను. అయితే ప్రజలకు పనికొచ్చే పనులు, సమస్యల విషయంలోనే తప్ప వ్యక్తిగతంగా దురుసుగా ప్రవర్తించే నైజం నాది కాదు. మున్సిపల్ కమిషనర్‌తో కానీ, కలెక్టర్‌తో కానీ ఏనాడూ హార్ష్‌గా మాట్లాడలేదు. శ్రీకాకుళంలో 133 కేవీ సబ్‌స్టేషన్ గురించి తొమ్మిది నెలలుగా చెబుతున్నాను. కానీ పని జరగడంలేదు. గట్టిగా మాట్లాడితే తప్ప అధికారుల్లో చలనం రాలేదు. ఇప్పుడు దాన్ని లక్ష్మీ టాకీస్ రోడ్డులో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్నా ఏపీఎంఐడీసీ ఈఈ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇటువంటి వారితో కాస్త గట్టిగా మాట్లాడకపోతే పనులు జరగవు. మున్సిపల్ డీఈపై కేకలు వేశాననడం వాస్తవం కాదు. సరదానే మాట్లాడాను. ఆయన ఎంఈ అయ్యారు. ఆ జోష్‌లో ఉన్నారు. ఒక కాంట్రాక్టర్‌ను తొలగించాల్సి ఉంది. కానీ ఆ పని చేయడంలేదు. ఆ విషయమే నిక్కచ్చిగా మాట్లాడాను. అలాగే డ్వామా పీడీ, నేను సరదాగా మాట్లాడుకున్న అంశాలపై వ్యతిరేక ప్రచారం జరిగింది.
సత్యం: ప్రజాప్రతినిధి అయిన మీపైనే ఫిర్యాదు చేస్తానని ఒక అధికారి అంటే.. దాన్ని ఎలా తీసుకోవాలి?
ఎమ్మెల్యే శంకర్: ఆ మాట ఆయన సరదాగా అన్నారు. సీరియస్‌గా అంటే నేను ఊరుకుంటానా? పనులు జరగడమే నాకు ముఖ్యం, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఆ ధ్యేయంతోనే కొన్ని సందర్భాల్లో కొందరు అధికారులతో హార్ష్‌గా మాట్లాడి ఉండవచ్చు. పనుల్లో స్పీడ్ పెంచేందుకు అన్ని శాఖల సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నాను. మరో ఆరు నెలల్లో స్పష్టమైన మార్పు చూపిస్తాను.
సత్యం: ఇన్ని పథకాల పేర్లు, నిధుల అంకెలు ఆశువుగా చెప్పేస్తున్నారు. ఇవన్నీ.. కనీసం వీటిలో పెద్ద ప్రాజెక్టులైనా ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పగలరా?
ఎమ్మెల్యే శంకర్: అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్), సీఎస్పీ రోడ్డు, సీఎన్‌ఆర్డీపీ పనులు తప్పించి మిగిలిన పనులన్నీ ఏడాదిలోపు పూర్తి అవుతాయి. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులకు ఇబ్బంది ఉన్నా శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణకు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు రూ.16 కోట్లు ఇవ్వడం రాష్ట్రంలోనే రికార్డు. నగరంలోని పురాతన డచ్ బిల్డింగ్‌ను అభివృద్ధి చేసి రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రసాద్ స్కీం కింద అరసవల్లి అభివృద్ధికి రూ.200 కోట్లతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాం. శ్రీకూర్మం దేవస్థానంలో పుష్కరిణి అభివృద్ధికి ఇండిగో సంస్థ నుంచి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు రూ. 10 కోట్లు ఇప్పించారు. త్వరలో మరో రూ.10 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు అందనున్నాయి.
రాష్ట్ర పండుగ చేయడం వల్ల అరసవల్లికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. భక్తులు పెరుగుతున్నారు. టూరిజం హబ్‌గా మారుతుంది. చరిత్రలోనే తొలిసారి ఈసారి ఉత్సవాలకు రూ.1.75 కోట్ల విరాళాలు రావడమే దీనికి నిదర్శనం. అలాగే 1.50 కేజీల బంగారం, 16 కేజీల వెండి విరాళంగా ఇస్తామంటూ కొందరు భక్తులు లేఖ రాశారు. ఇదే కాకుండా టూరిజం అభివృద్ధిలో భాగంగా 2016లో సీఎంగా ఉన్న చంద్రబాబు క్రూయిజ్ షిప్పులు నిలిచేలా పాసింజర్ జెట్టీ ఏర్పాటును ప్రతిపాదించగా, కేంద్రంగా దానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. కానీ గత వైకాపా ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదు. ఇటీవల కేంద్రం ఈ నిధులు కావాలా, వద్దా అంటూ మరో లేఖ రాసింది. ఈ విషయం తెలుసుకుని సీఎం ద్వారా మాట్లాడిరచి డీపీఆర్ ఇచ్చాం. నాగావళి, వంశధార నదీ ప్రవాహాలను డైవర్ట్ చేయడం వల్ల బీచ్ వాష్ అవుట్ అయిపోయింది. వేట చేయలేని పరిస్థితి ఏర్పడిరది. దీనిపై ఇటీవలే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ను కలసి పరిస్థితిని వివరించాను. పునరుద్ధరణ పనులు మంజూరు చేయించాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో తీరం వెంబడి ఏడు గ్రామాలు, 35వేల మంది ఉన్నారు. వీరిలో చాలామంది గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసపోతున్నారు. వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా పీజీపేటలో మినీ జెట్టీ మంజూరు చేయించాను.
Comentários