ఎంపిక అత్యంత కీలకం!
- ADMIN
- Jun 28, 2024
- 3 min read
ఆసన్నమైన ఇంజనీరింగ్ ప్రవేశాల సమయం
విద్యార్థుల ఆసక్తికే తొలి ప్రాధాన్యం
భవిష్యత్తును తప్పక ఊహించాల్సిందే!
(దుప్పల రవికుమార్)

ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులంతా నాలుగు రోడ్ల కూడలిలో నిల్చున్నట్లుంది. ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయమే జీవితంలో అత్యంత కీలకమైనది. స్టేట్ బోర్డులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు, సీబీఎస్‌ఈలో ఉత్తీర్ణులైన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడున్నర లక్షల మంది ప్లస్ టూ విద్యార్థులు తమ కెరియర్‌లో మరో మలుపు కోసం ఎదురు చూస్తున్నారు. శాయశక్తులా తమ ప్రయత్నాలు పూర్తి చేసి సరైన దిశవైపు అడుగులు వేయడం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందులో సుమారు అరవై శాతం మ్యాథమేటిక్స్ విద్యార్థులే కాబట్టి, ఎంపీసీ విద్యార్థులకు సంబంధించిన కొన్ని సందేహాలను తీర్చే ప్రయత్నం చేద్దాం. ఎంపీసీ విద్యార్థులు తాము నడవాల్సిన దారికి చేరడానికి సంబంధించిన అనేక రకాల పోటీపరీక్షలు రాశారు. వాటి ఫలితాలు కూడా దాదాపుగా వచ్చేశాయి. మొన్న విడుదలైన ఐఏటి ఫలితాలతో, జెఇఇ అడ్వాన్స్ నుంచి ఎంసెట్ (ఇఏపి సెట్) వరకూ అన్ని పరీక్షలు ఫలితాలు ప్రకటించేసినట్టే. ఇప్పుడు తాము సాధించిన ర్యాంకుతో ఏ కాలేజీలో, ఏ బ్రాంచిలో సీటు వస్తుందనే తీవ్ర ఉత్కంఠతో విద్యార్థులంతా వేచి చూస్తున్న సమయమిది. బంధువులు, స్నేహితులు, పెద్దలు ఇచ్చే రకరకాల సలహాలతో, చేసే హెచ్చరికలతో మరింత అయోమయానికి కొందరు విద్యార్థులు గురవుతున్నారు. పెద్దల మాటలు వినండి కాని, మనసుకు ఎక్కించుకోకండి. వారు చెప్పేవి జనరల్ ప్రిన్సిపుల్స్. విశ్వజనీన సత్యాలు చెప్తారు. కాని, కోర్సుల ఎంపిక పూర్తిగా వ్యక్తిగతం. ఇందుకోసం మీరు చేయాల్సింది మీ గురించి మీరు తెలుసుకోవడం. అందుకుగాను, ముందుగా మీరు ఇంజనీరింగ్ కోర్సులో ఎందుకు చేరబోతున్నారో ఒక విజన్ స్టేట్‌మెంట్ రాసుకోవాలి. ఇది దాదాపుగా లాంగ్‌టర్మ్ గోల్ లాంటిది. రాబోయే పదేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారో అదంతా కాగితం మీద పెట్టాలి. అలిఖిత లక్ష్యాలు ఎన్నటికీ సాధించబడవని గుర్తించండి. దశాబ్దం అనంతరం మీరు సాధించాల్సిన విజయాల గురించి మీకు ఇప్పుడే పూర్తి అవగాహన ఉండాలి.
ఈ ఏడాది కూడా మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల కంటే ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తక్కువ కాబట్టి విద్యార్థులందరికీ సీట్లు రాబోతున్నాయన్నది మొదటి సానుకూల అంశం. ఇంజనీరింగ్ మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య ఏటికేడాది పెరుగుతున్న నేపథ్యంలో రమారమి పదిశాతం విద్యార్థులు ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వలస పోతున్నట్టు విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానివల్ల ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకున్న వారికి మరింత మెరుగైన కోర్సులలో అవకాశాలు దొరుకుతాయన్నది రెండవ సానుకూల అంశం. విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రమాణాలు పెంచుకుంటూ, అక్రెడిటేషన్లు తెచ్చుకుంటూ అటానమస్ సంస్థలుగా, ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా ఎదుగుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య మరిన్ని ఎక్కువ విద్యాసంస్థల్లో లభించబోవడం మూడవ సానుకూల అంశం. దాదాపుగా అన్ని విద్యాసంస్థలు విద్యార్థులను ఆకర్షించడానికి నాలుగేళ్లలో చివరి రెండేళ్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పైన, అందుకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంపైన, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి విధిగా రాయవలసిన గేట్ పరీక్షకు శిక్షణ ఇవ్వడం పైన, ఉన్నత విద్య విదేశాలలో అభ్యసించడానికి తగిన శిక్షణ, ప్రభుత్వ రంగాలలో దొరికే ఉపాధి అవకాశాలు, తదితర విషయాలపై తమ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన, శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా సెల్స్ ఏర్పాటు చేస్తుండడం నాలుగో సానుకూల అంశం.
తక్కువ నలిగిన దారే మంచిది!
ప్రస్తుతం ఏ కోర్సుకు క్రేజ్ నడుస్తుందో అలాంటి కోర్సులను విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. తమకు ఏ కోర్సు పట్ల ఆసక్తి ఉందో దానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కోర్సు లేదా బ్రాంచ్ పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాక, దానికి అనుబంధంగా ఉండే ఇతర బ్రాంచిలను గుర్తించాలి. ఉదాహరణకు ఇప్పుడు చాలా పాపులర్‌గా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీ తొలి ప్రాధాన్యం అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా సైన్స్ తదితరాలన్నీ దాని అనుబంధ బ్రాంచిలే. సిలబస్‌లో స్వల్ప వైవిధ్యంతో డిమాండ్ ఉన్న కోర్సుల్లో మరింత మంది విద్యార్థుల చేరికకు ఎఐసిటిఇ వివిధ పేర్లతో కొత్త బ్రాంచిలకు అవకాశమిస్తుందని విద్యార్థులు గమనించాలి. ఇప్పుడిక విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు. సాఫ్ట్‌వేర్ రంగంలో శరవేగంతో వస్తున్న మార్పుల వల్ల ఆ గాలిబుడగ ఇప్పుడు పేలబోతోంది. దాంతో మనుషులు మెకానికల్‌గా చేయాల్సిన పనులను, మనిషి కనిపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చురుగ్గా, మెరుగ్గా చేసేస్తుండడం వల్ల ఆ రంగాల్లో తీవ్రమైన నిరుద్యోగం ఏర్పడబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ రంగంలో వస్తున్న అనేకానేక మార్పులు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు వేస్తున్నాయి. వాటిపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు నిరుద్యోగ సమస్య ఉండనే ఉండదు. అందరూ వెళ్లే దారిలోనే ప్రయాణిస్తే రాబోయే రోజుల్లో గడ్డు సమస్యలు తప్పవని నా హెచ్చరిక. చాలా ఎన్‌ఐటిలలో కూడా ఈసారి కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు చాలినన్ని ప్లేస్‌మెంట్స్ చూపించలేకపోయారు. ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చెప్పే క్యాంపస్ ప్లేస్‌మెంట్ వాగ్దానాలు అసలు నమ్మకూడనివి.
తమకు నచ్చిన బ్రాంచికి విద్యార్థులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా చెప్తున్నప్పటికీ మంచి కళాశాలను ఎంపిక చేసుకోవడమూ అంతే ముఖ్యమన్న సంగతి మర్చిపోకూడదు. తమకు నచ్చిన బ్రాంచి ఎన్‌బిఏ అనుమతులు లేని కళాశాలలో చదవడం వల్ల విద్యార్థులకు ఏ మాత్రం అవకాశాల ద్వారాలు తెరవడానికి ఉపకరించదు. అందుకే కళాశాల ఎంపిక కూడా చాలా కీలకమైన విషయమే. ఉదాహరణకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించడం ద్వారా లైఫ్ సెటిలవ్వాలన్న విద్యార్థికి ఆంధ్రా యూనివర్శిటీలో జియో ఇన్ఫర్మేటిక్స్ చదవడం సరైన నిర్ణయమే కాగలదు. విదేశాలలో పిజి అభ్యసించాలనే లక్ష్యం గల విద్యార్థికి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఏ కోర్సు అయినా మంచిదే కాగలదు. మన లక్ష్యాన్ని బట్టే మనం ఎంచుకునే కళాశాల. స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే విద్యార్థులకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంజనీరింగ్ కళాశాలలను ఎంపిక చేసుకోవడం ద్వారా కొన్ని వందల చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్వయంగా చూసి, కష్టనష్టాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
కోరుకున్నది దొరకకపోతే..
మనకొచ్చే ర్యాంకును బట్టి మనం కోరుకున్న కోర్సుగాని, ఎంచుకున్న కళాశాల గాని మనకు దక్కకపోతే ఏం చేయాలని చాలామంది విద్యార్థులు తలలు పట్టుకుంటారు. అందుకే ఈరోజే రేపో ఈఏపిసెట్ కళాశాలల ఎంపిక నోటిఫికేషన్ వస్తోంది. దానికంటే ముందే విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచి, కళాశాలల వివరాలను కనీసం ఒక వందవరకూ ప్రాధాన్యతా క్రమంలో రాసుకోవాలి. అదే క్రమంలో తమ వెబ్ ప్రిఫరెన్సులు ఇచ్చుకోవాలి. మొదటి కౌన్సిలింగ్‌లో రాకపోయినా అనంతర కౌన్సిలింగులలో తమకు మెరుగైన అవకాశం దొరికే వీలుంది. కొంతమంది విద్యార్థులు రాజీ పడకుండా ఒక ఏడాది డ్రాప్ తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. నావరకైతే ఇంజనీరింగ్ కోర్సు కోసం డ్రాప్ ఆలోచన వృధా. ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఇఆర్ లాంటి కోర్సుల కోసమైతే ఒక ఏడాది పాటు ఆగిపోయి మరలా ప్రయత్నం చేయడం కాస్తయినా ఆలోచించవచ్చేమో గాని, ఏటికేడాది పోటీ తీవ్రంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కోర్సు కోసం మాత్రం ఏడాది సమయం వృథా చేయకూడదు గాక చేయకూడదు. ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. విద్యార్థులు తాము చేరాలనుకున్న లక్ష్యాలకు గమ్యాలను సిద్ధం చేసేదే ఇంజనీరింగ్ కోర్సు. అంతే గాని, ఇంజనీరింగ్ విద్య దానికదే గమ్యం ఎన్నటికీ కాజాలదు.
Comentarios