ఎక్సైజ్ బాబు మెడకు ‘బెల్ట్’ బాగోతం!
- NVS PRASAD
- Apr 9
- 2 min read
బీర్ బాటిళ్లతో పట్టుబడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
యూబీ ఫ్యాక్టరీ నుంచి తరలించే సరుకు బెల్ట్ షాపునకు
సదరు యజమానిని బెదిరించడంతో ఆత్మహత్యాయత్నం
జిల్లా ఎస్పీని ఆశ్రయించి.. గుట్టు విప్పేసిన అతని భార్య
పోలీస్ బాస్ ఆదేశాలతోనే హైవేపై తనిఖీ.. జగదీష్‌పై కేసు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలోని బేవరేజెస్ ఫ్యాక్టరీ నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎక్పైజ్ సిబ్బందే బీర్ బాటిళ్లు తరలిస్తూ దొరికిపోవడానికి బెల్ట్ దందా వికటించడమే కారణమని తెలుస్తోంది. తెగే దాకా లాగితే ముప్పు తప్పదని ఈ వ్యవహారంలో మరోసారి స్పష్టమైంది. తప్పు చేస్తున్నది చాలక ఎక్సైజ్ కానిస్టేబుళ్లమన్న బిరుసుతనంతో తమకు సహకరిస్తున్న బెల్ట్ షాపు యజమానినే బెదిరించడం చివరికి వారి పీకకే చుట్టుకుంది. రణస్థలం మండలం బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీలో శాఖాపరంగా విధులు నిర్వహిస్తూ బీరు బాటిళ్లు తరలించుకుపోతూ పోలీసులకు చిక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నేరుగా పోలీసులకు దొరకడం, కేసు నమోదు కావడంతో ప్రభుత్వోద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బీరు బాటిళ్ల తరలింపు వ్యవహారంపై ‘బీరు కొట్టేస్తున్న ఎక్సైజ్ బాబులు’ అన్న శీర్షికతో ‘సత్యం’ పత్రిక ఈ నెల ఒకటో తేదీన ప్రచురించిన కథనంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ బ్రూవరీస్‌లో విధులు నిర్వహించే ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ నుంచి బీరు బాటిళ్లు పట్టుకుపోవడం, ఆ క్రమంలో జగదీష్ దొరికిపోవడం వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు రోజు విడిచి రోజు పెద్ద సంఖ్యలో బీరు బాటిళ్లు పట్టుకుపోతున్న విషయం ఆ ఫ్యాక్టరీ వర్గాలకు తెలుసు. అయితే ఎక్సైజ్ ఉద్యోగులను తనిఖీ చేసి, బాటిళ్లు తీసుకెళ్లకుండా అడ్డుకుంటే.. ఎక్కడ తమ ఉత్పత్తులపై అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడతారేమోనన్న ఉద్దేశంతో వారిని సెక్యూరిటీ చెక్ చేయకుండానే పంపించేసేవారు. జగదీష్ బీరు బాటిళ్లు తరలిస్తూ జాతీయ రహదారిపై పోలీసులకు దొరకడానికి ఫ్యాక్టరీ ఉద్యోగులే పోలీసులకు ఉప్పందించడమే కారణమై ఉంటుందని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి భిన్నమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రెగ్యులర్‌గా ఫ్యాక్టరీ నుంచి బీర్లు తరలించే జగదీష్‌తో పాటు మరో కానిస్టేబుల్ వాటిని అక్కడికి దగ్గరలో ఉన్న ఓ బెల్ట్‌షాపునకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారట. ఈ విధంగా సంబంధిత బెల్ట్‌షాపు యజమానికి పెద్ద మొత్తంలో బీర్ బాటిళ్లు సరఫరా చేయడం, వాటి చెల్లింపులకు సంబంధించి బెల్ట్ షాపు యజమాని కానిస్టేబుళ్లకు రూ.3 లక్షలు బకాయి పడటం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చిందంటున్నారు. బకాయి సొమ్ము వెంటనే చెల్లించకపోతే బెల్టు షాపు నడుపుతున్నందుకు కేసులు నమోదు చేస్తామని భయపెట్టడంతో పాటు దొంగతనం కేసు కూడా నమోదు చేస్తామని సదరు కానిస్టేబుళ్లు హెచ్చరిస్తూ నిత్యం ఒత్తిడి తేవడంతో బెల్టుషాపు యజమాని కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఆయన భార్య జిల్లా పోలీసు బాస్‌ను కలిసి జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. అంటే ఎస్పీ స్వయంగా రణస్థలం పోలీసులతో దీనిపై నిఘా పెట్టించడంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ దొరికిపోయారని తెలిసింది. వాస్తవానికి జగదీష్ కాకుండా అక్కడ సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న రెండో కానిస్టేబుల్‌ను పట్టించాలని భావించారు. కానీ ఆ రోజు జగదీష్ దొరికిపోయాడు. ఇది జరిగిన తర్వాత నుంచి యూబీ ఫ్యాక్టరీలో ఎక్సైజ్ ఉద్యోగులను కూడా తనిఖీ చేస్తున్నారట. సెక్యూరిటీ సిబ్బందికి ఎక్సైజ్ సీఐలు ఇద్దరు సహకరిస్తున్నా.. ఒక కానిస్టేబుల్ మాత్రం తననే చెక్ చేస్తారా అంటూ వీరంగం వేస్తున్నట్టు భోగట్టా. వాస్తవానికి యూబీ ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ అధికారుల దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ బీర్లు పట్టుకుపోవడం కామన్. ఉన్నతాధికారులు ఫ్యాక్టరీ తనిఖీకి వచ్చిన ప్రతిసారీ సార్‌కు ఇవ్వాలంటూ ఎక్సైజ్ వాహనాల్లో బీరు కేసులు తరలించుకుపోవడం షరా మామూలే. అయితే ఏరోజూ ఈ విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బెల్టుషాపునకు సరుకు ఇచ్చి సమాంతరంగా ఒక వైన్‌షాపును వీరిద్దరూ నడిపారో అప్పుడే ఈ వ్యవహారం బయటకొచ్చింది.
Comments