top of page

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 7, 2024
  • 2 min read


నీతులు, ధర్మాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఏదైనా సరే ఇతరులకు చెప్పటానికి, బోధించటానికి ఉంటాయి. తాము ఆచరించటం ప్రారంభించగానే చాలా కష్టంగా మారతాయి. అందుకే మన సినీ కవి ఏనాడో చెప్పాడు ‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని. మనకో ఉటంకింపూ ఉంది. హరిదాసు, వారి కథా సందర్భంగా ఉల్లి తినడం వల్ల కలిగే అనర్థాలను ఏకరువు పెట్టి దానిని విసర్జిం చాలని చెప్పాడట. ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్నపుడు భార్య ఉల్లి లేకుండా చేసిన పాకాన్నీ వడ్డిస్తే, ఇదేమిటీ? అని ప్రశ్నించి, ఓసి పిచ్చిదానా! ఉల్లి గురించి ప్రేక్షకులకు చెప్పానే కానీ, నాకు వద్దన్నానా? అని తిట్టి పారేశాడని చెప్పుకుంటాం మనం. అంటే చెప్పడానికి ఎన్నయినా చెబుతాం. అవన్నీ మన కోసం కాదని అర్థం. ఇప్పుడు నాయకుల మాటలు, బాబాలు, ప్రవచనకారులు మాట్లాడుతున్న మాటలు, బోధనలు విన్నపుడు హరిదాసు గుర్తుకు రాకమానరు. మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేకపోవడం అనేది మనల్ని పట్టి పీడిస్తున్న పెద్ద జాడ్యం. విన్నవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. చెబుతున్న వాళ్లు గొప్పవాళ్లుగా కీర్తించబడతారు. కానీ అసలు ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేస్తారు. ఇదీ మన బోధకుల వరుస. ఒకసారి మహాత్మాగాంధీని వారి అనుచరులు ఇలా దీన్ని ఆచరించటం సాధ్యమవుతుందా? అని అడిగారట. అప్పుడు గాంధీ ఏమన్నారంటే, నేను పది రోజుల తర్వాత చెబుతానని చెప్పి తాను ఆ పదిరోజులు ఆచరించి సాధ్యమేనని తెలుసుకుని అడిగిన వారికి చెప్పారని ప్రతీతి. ఇప్పుడలా ఎవరున్నారు! మాటలు కోటలు దాటుతాయి. చేతలు గడపలు దాటవు అన్నట్లుగానే సాగుతున్నది. ఈ మధ్య మనం చాలా ఇష్టంగా సోషల్‌ మీడియాలో వింటున్న ప్రబోధాలు.. ముఖ్యంగా ఈష పౌండేషన్‌ అధినాయకుడు జగ్గీ వాసుదేవ్‌ ఆలోచనలూ, వివరణలు, బోధనలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన తమిళ నాడులో పెద్ద ఆశ్రమం, శిష్య బృందం, దాని నిర్వహణ చాలా పెద్ద వ్యవస్థనే ఉంటుంది. డ్యాన్సులు, పాటలు, మాటలు, క్షేత్ర పర్యటనలూ, ప్రకృతి ఆస్వాదనలు, ఇన్నీ అన్నీ కావు, పెద్ద ఫాలోయింగ్‌ ఉన్న గురువర్యులు ఆయన. అయితే ఇటీవల ఒక రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కామరాజు మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను వేసారు. అదేమంటే తన ఇద్దరు కుమార్తెలను ఈష పౌండేషన్‌ నుంచి విడిపించాలని హైకోర్టును కోరారు. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఒక పక్క తన కుమార్తెకు చక్కగా పెళ్లి చేసి, జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. తన కూతుళ్లను ఫౌండేషన్‌ మాయలో పడేసి ఆశ్రమానికి బంధీలుగా చేశారని తండ్రి ఆవేదనకు కోర్టు జగ్గీని అలా ప్రశ్నించింది. ‘ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భావిస్తున్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం పాపంగా కనపడటంలేదా?’ అని ధర్మాసనం ఆ ఇద్దరు కుమార్తెలనూ ప్రశ్నించింది. ఇదీ మన ‘సద్గురు’ ఆచరణ! విచారణ చేస్తున్నా చివరికి కోర్టు ఏం చేస్తుంది అనేది. ఆయన ప్రభావ పలుకుబడిల మీద ఎలా పరిణమిస్తుందనేది వేరే విషయం. ఇక్కడే ఇంకో ప్రస్థావన చూడవచ్చు. ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్‌లో సనాతన ధర్మాచరణ కోసం బయలుదేరిన పవన్‌కళ్యాణ్‌ మాటలే ఎలా మారాయో గమనించ వచ్చు. ‘నేను బలమైన సనాతన ధర్మాన్ని ఆచరించే వాడిని, దాన్ని కాపాడటానికి కృషి చేస్తాను’ అని ప్రకటించాడు. అంతకు ముందు ఓ ఇంటర్వూలో ఇదే పవన్‌ ‘గోమాంసం గురించి ఇపుడు ఇంత గొడవ జరుగుతోంది. నాకు ఆకలి వేసి, వేరే దారి లేకపోతే, బీఫ్‌ తినాల్సి వస్తే తిని ముందుకు పోతాను’ అని కుండబద్దలు కొట్టారు. మన చాగంటివారు చేసిన ఒక బోధనలో ఏమన్నారంటే, ‘భార్యకు విడాకులు ఇవ్వటం, దంపతులు విడిపోవటం అనే మాట సనాతన ధర్మంలో లేనేలేదని చెప్పారు. ఒకవేళ పొరపాట్లు ఏమైనా చేసినా ఉద్దరించి మళ్లీ తన పక్కకు తెచ్చుకోవడమే చేయాలి గౌతమునిలా’ అని ప్రవచించారు. ఇది ఆయనకు వర్తిస్తుందా? అని మాత్రం ప్రశ్నించకండి. నిజంగా ధర్మాన్ని ఆచరించాలని వీరికి ఉందా? సనాతన ధర్మం అనే ఒక భావాన్ని పట్టుకుని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం తప్ప. సమధర్మ పాటింపే నేటి కాల ధర్మము. అందరినీ సమంగా చూడాలనేదే అందరూ పాటించాల్సిన ధర్మం. శాశ్వతమైన నీతులు, ధర్మాలు, ఆచరణలు ఉండవు. కాలాన్ని బట్టి ఆచారాలు, నీతులు మార తాయి. అట్లాంటిది, తిరిగి వెనక్కి వెళతామని ఎవరు చెప్పినా అది వాస్తవం కాదని అర్థం చేసుకావాలి. ఎదుటి వాళ్లకు చెప్పటానికే అన్ని విషయాలూ ఉన్నాయని సద్గురులు నిరూపించారు. ఆ అపర సనాతన ధర్మాలూ నిరూపిస్తున్నాయి. వినేవాళ్లంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలి మరి!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page