కంకర తరలింపు.. ఆక్రమణలకు మినహాయింపు!
- BAGADI NARAYANARAO
- Apr 11
- 3 min read

పలాస సూదికొండ చుట్టూ అక్రమాల బాగోతం
గతంలో రద్దు చేసిన గ్రావెల్ క్వారీకే కలెక్టర్ అనుమతి
దాని ఆధారంగా ఇష్టారాజ్యంగా తరలిస్తున్న వైనం
కేంద్రీయ విద్యాలయానికి స్థలం పేరుతో మరో దందా
పేదల గుడిసెలు తొలగించిన అధికారులు
పెద్దల ఆక్రమణలను సేకరణ నుంచి తప్పించి రక్షణ
పలాసలో గ్రావెల్ తవ్వకాల దందా మళ్లీ ప్రారంభమైంది. అయితే ఈసారి కలెక్టర్ ఇచ్చిన జీవోనే చూపించి ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా అక్రమ తరలింపులకు పాల్పడుతున్నారు. చిత్రమేమిటంటే.. గ్రావెల్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలంటూ 2022లో పలాస`కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించిన క్వారీకే ఇప్పుడు కలెక్టర్ అనుమతించారు. ఆమేరకు ప్రజావసరాల పేరుతో బొడ్డపాడు రెవెన్యూలోని ఎంఐజీ లే`అవుట్‌లో రోడ్డు, లోతట్టు ప్రాంతం ఎత్తు చేయడానికి సూదికొండలోని గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు కూడా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై మంగళవారం మున్సిపల్ సమావేశంలో వైకాపా సభ్యులు లేవనెత్తిన ప్రశ్న అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 19వ వార్డు సూదికొండ పరిధిలో ప్రజాభిప్రాయం తీసుకోకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా ఏకపక్షంగా కలెక్టర్ ఇచ్చిన అనుమతితో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను తక్షణమే నిలపాలని కౌన్సిలర్ శిష్టు బృందావతి కౌన్సిల్ ఛైర్మన్‌ను వినతిపత్రం అందించారు. మరోవైపు ప్రముఖ వైద్యడు దువ్వాడ జీవితేశ్వరరావు ఆర్‌డీవోను కలిసి తవ్వకాలు నిలిపివేయాలని వినతిపత్రం అందించారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పలాస మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండలోని 2.50 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకాలకు 2020లో కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్‌కు ప్రభుత్వం అనుమతించగా,ం అప్పటి మంత్రి అప్పలరాజు క్వారీని ప్రారంభించారు. అయితే అంతర్గత పోరులో భాగంగా కొందరు వైకాపా నాయకులు యువతను రెచ్చగొట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయించారు. ఈ వ్యవహారం వైకాపాలో గందరగోళం సృష్టించింది. స్థానిక యువకులు క్వారీపై దాడి చేసి యంత్రాలు, ట్రాక్టర్లను అడ్డుకుని, డ్రైవర్‌పై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై దువ్వాడ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి మంత్రి అప్పలరాజు జోక్యం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత గ్రావెల్ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, జంట పట్టణాల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని, సూదికొండలో నివాసం ఉంటున్నవారికి నష్టం జరుగుతుందంటూ స్థానికులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి సీదిరి అప్పలరాజు డైరెక్షన్‌లోనే 2022లో మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించి గ్రావెల్ క్వారీ అనుమతులను రద్దు చేయించారు. అనంతర పరిణామాల్లో వైకాపాను వీడి టీడీపీలో చేరిన దువ్వాడ శ్రీకాంత్ తన పేరుతో ఉన్న క్వారీ లీజును రద్దు చేయించి ఆ భూమిని కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి వినియోగించాలని కోరుతూ ఎమ్మెల్యే గౌతు శిరీషకు లీజు రద్దు పత్రాలు అందించారు. కట్ చేస్తే.. ఇప్పుడు క్వారీని స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా, మున్సిపల్ కౌన్సిల్ ప్రమేయం లేకుండా కలెక్టర్ అనుమతి ఇచ్చేయగా.. గ్రావెల్ తవ్వకాలు ప్రారంభమైపోయాయి. గ్రావెల్ తవ్వకాలకు కలెక్టర్ స్థూలంగా అనుమతులు ఇచ్చినా.. ఎక్కడ తవ్వకాలు జరపాలన్న విషయాన్ని మైనింగ్, రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదు. ఇదే అదనుగా ఎంఐజీ కాంట్రాక్టర్ తనకు అనుకూలమైన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి గ్రావెల్ తరలించుకుపోతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుని ఆందోళన చేసిన వారంతా ఎక్కడికి పోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు సూదికొండలో డి`పట్టా భూమిని కబ్జా చేసిన వైకాపా, టీడీపీ నాయకులు పద్మనాభపురం, కాశీబుగ్గ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కొనుగోలు, వారసత్వంగా నమోదు చేయించుకున్నారు.
పేదల గుడిసెలు తొలగింపు
కేంద్రీయ విద్యాలయం పేరుతో సూదికొండ వద్ద పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 51లో 12.50 ఎకరాలను ఇటీవల రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆ భూముల్లో ఉన్న పేదల గుడిసెలను నేలమట్టం చేసి ఆక్రమణలు తొలగించారు. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తున్నామన్న సాకుతో ఎంఐజీ కాంట్రాక్టర్‌కు అప్పగించి గ్రావెల్‌ను తరలించుకుపోవడానికి అవకాశం కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతంలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానున్నట్లు కూటమి నాయకులు ప్రకటించగా.. మరోవైపు అందులో టీడీపీ నేత అనుభవంలో ఉన్న నాలుగు ఎకరాలను మినహాయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రీయ విద్యాలయానికి ఆక్రమణదారుల డి`పట్టా భూమి సేకరించడంపై టీడీపీ నాయకుడు అభ్యంతరం తెలిపారని తెలిసింది. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణగా చూపించి సేకరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించిన తర్వాత కేంద్రీయ విద్యాలయానికి పది ఎకరాలు సరిపోతుందని అధికారులు నిర్ణయించి టీడీపీ నేత అనుభవంలో ఉన్న భూమిని మినహాయించారని ఆరోపణలున్నాయి. కేంద్రీయ విద్యాలయం కోసం రెవెన్యూ అధికారులు సేకరించిన భూమి పురుషోత్తపురం సర్వే నెంబర్ 51లో ఉంది. ఈ సర్వే నెంబర్‌లో ఉన్న డి`పట్టా భూమిని పద్మనాభపురం సర్వే నంబర్ 395/1, 362/2, కాశీబుగ్గ రెవెన్యూ పరిధిలో 234/1లో ఉన్న జిరాయితీ భూమిగా చూపించి అందరూ కొనుగోలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌లో సర్వే నెంబర్ 51 డి`పట్టాగా చూపిస్తుంటే ఆక్రమణదారుల వద్ద మాత్రం పక్కా సర్వే నెంబర్లతో కొనుగోలు చేసినట్టు పత్రాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. కేంద్రీయ విద్యాలయం కోసం ఇటీవల సేకరించిన భూమిలో ఉన్న ఆక్రమణలన్నీ ఈ కోవకు చెందినవే.
పెద్దల ఆక్రమణలకు మినహయింపు
వైకాపా, టీడీపీ నాయకులు కొనుగోలు చేసి పేదలకు విక్రయించిన భూమిని, ఆక్రమణలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. అదే సమయంలో డి`పట్టా భూమి ఆక్రమించి వేసిన లే అవుట్ పక్కనే జిరాయితీ సర్వే నెంబర్లు వేసి వేరే వ్యక్తి కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న డి`పట్టా భూమిని మాత్రం మినహాయిస్తున్నారని పట్టణంలో చర్చించుకుంటున్నారు. కేంద్రీయ విద్యాలయం కోసమంటూ ఎన్నో ఏళ్ల నుంచి పేదలు నిర్మించుకున్న గుడిసెలను ఆక్రమణల పేరుతో తొలగించారు. అయితే మొదట మార్కింగ్ ఇచ్చి తొలగించిన స్థలంలో అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల భూమి సుమారు నాలుగు ఎకరాలను మినహాయించినట్టు ఆరోపణలున్నాయి. పెద్దల చేతిలో ఉన్న ఈ భూమిని కేంద్రీయ విద్యాలయం స్కెచ్ నుంచి మినహాయించి, దీనికి బదులుగా సూదికొండలో కొత్తగా మార్కింగ్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రయోజనాలను కాపాడటానికి పేదల గుడిసెలను తొలగించి నాలుగు ఎకరాలను మాత్రం మినహాయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Bình luận