కొత్తూరు టీడీపీలో గ్రూపుల గోల!
- Guest Writer
- Apr 7
- 1 min read
ఇప్పటికే ఒక కార్యాలయం ఉండగా.. మరొకటి ప్రారంభం
దీనికి స్వయంగా ఎమ్మెల్యే తనయుడే రిబ్బన్ కటింగ్
ఇదేమిటని ప్రశ్నిస్తున్న ప్రత్యర్థివర్గం

(సత్యంన్యూస్, కొత్తూరు)
జిల్లాలో పాతపట్నం నియోజకవర్గానికి ఎంత ప్రత్యేకత ఉందో.. ఆ నియోజకవర్గంలో భాగమైన కొత్తూరు మండలానికి అంతే ప్రత్యేకత ఉంది. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరున్నా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో గ్రూపుల గోల మాత్రం తప్పదంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గూటికి చేరిపోయే గ్రూపులు.. ఆధిపత్యం కోసం పోరాడుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తాజాగా మండల కేంద్రమైన కొత్తూరులో శుక్రవారం టీడీపీ కార్యాలయం ప్రారంభమైంది. విశేషమేమిటంటే ఇక్కడ ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయం ఉండగా, ఇప్పుడు రెండో కార్యాలయాన్ని.. అది కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే తనయుడు మామిడి గణేష్ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావే ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొత్తూరు పార్టీలో గ్రూపుల గోల భరించలేక ఆరోగ్య సమస్య సాకుతో ఆయన డుమ్మా కొట్టి తన తనయుడిని పంపారని అంటున్నారు. ఇప్పటికే ఒక కార్యాలయం ఉండగా, రెండో కార్యాలయం అవసరమేమిటని పార్టీలోని ప్రత్యర్థి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల మరోసారి కొత్తూరు గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చినట్లయ్యిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నుంచీ ఇదే తీరు కొనసాగుతుండగా జిల్లా నేతలకు కూడా గ్రూపులను సర్దుబాటు చేయడం తలనొప్పిగా మారిందంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదముందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లామంత్రి, ఇతర ముఖ్యనేతలు కొత్తూరు గ్రూపులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments