కాపులు కనబడుటలేదు!
- NVS PRASAD
- 1 day ago
- 3 min read
నైరాశ్యంలో సీనియర్ పార్టీ నేతలు
ఎమ్మెల్యేలు వ్యతిరేకించి దూరమైన పెద్దలు
పాలవలస, కిమిడి కుటుంబాల హవాకు చెల్లు
వారసుల్ని రాజకీయాల్లోకి రావద్దని హితవు
(సత్యంన్యూస్, పాలకొండ)

జిల్లా రాజకీయ పటంలో ఈసారి కాపుల ప్రాబల్యం తగ్గిపోయిందని, కొన్ని నియోజకవర్గాల్లో జనాభాపరంగా కాపులు అధికంగా ఉన్నా రిజర్వేషన్ల రీత్యా ప్రధాన పదవుల్లో పోటీ చేయడానికి అర్హత లేకపోవడం వల్ల క్రమంగా జిల్లాలో తూర్పుకాపు ప్రాబల్యం తగ్గుతూవస్తుందన్న అభిప్రాయం ఆ సామాజికవర్గ నేతల నుంచి వ్యక్తమవుతుంది. ఒకప్పుడు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తూర్పుకాపు ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు కేవలం పాతపట్నం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో భవిష్యత్తులో కాపు నాయకులు రాజకీయాల్లోకి రావడం వ్యర్ధమనే భావనతో ఉన్నారు. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గం కమ్మ సామాజికవర్గానికి వెళ్లిపోవడంతో, పాలకొండ నియోజకవర్గం ఎప్పటికీ జనరల్ కాదని తేలడంతో మిగిలిన ప్రాంతంలో రాజకీయాలు చేసి బావుకున్నదేమిటన్న భావనతో ఉన్నారు. ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గంలో కాపులు పూర్తి నైరాశ్యంలో ఉన్నారు. ఒకప్పుడు పాలకొండ ఎస్టీ ఎమ్మెల్యేగా నిమ్మక గోపాలరావు ఉన్నా, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన సామంతుల దామోదర్ లాంటివారు ఇప్పుడు పూర్తిగా తెర వెనక్కు వెళ్లిపోయారు. ఈయనతో పాటు వారాధి సుమంతుల నాయుడు, ఖండాపు వెంకటరమణ లాంటి సీనియర్ నాయకులు ఇప్పుడు రాజకీయాల పట్ల పూర్తి విరక్తితో ఉన్నారు. విచిత్రమేమిటంటే.. నిమ్మక గోపాలరావుకు అన్నీ తానే అయి వ్యవహరించిన సామంతుల దామోదర్ ఇప్పుడు గోపాలరావు కొడుకు జయకృష్ణ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం కావడం గమనార్హం. వాస్తవానికి 60 శాతానికి పైగా ఇక్కడ తూర్పుకాపులు ఉన్నారు. కానీ ఇది ఎప్పుడూ జనరల్ కేటగిరీలో లేదు. పైడి నర్సింహ అప్పారావు శాపమో, మరొకరి శాపమో తెలీదు కానీ కొన్నాళ్లు ఎస్సీ కేటగిరీలోను, ప్రస్తుతం ఎస్టీ నియోజకవర్గంగా పాలకొండ ఉంది. నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో జనరల్ కేటగిరీలో ఉన్న ఈ ప్రాంతంలో పైడి నర్సింహ అప్పారావు చక్రం తిప్పేవారు. ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నల శిష్యుడిగా కృషీకార్ లోక్ పార్టీ తరఫున పోటీ చేశారు. తీరా ఎన్నికల దగ్గరకొచ్చేసరికి కాపులంతా ఏకమై కెంబూరు శ్రీరాములును గెలిపించడంతో ఇక్కడ కాళింగుల హవాకు చెక్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యేగా ఓడిపోయిన పైడి నర్సింహ అప్పారావును అప్పట్లో ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌ను చేసింది. అంతవరకు పైడి నర్సింహ అప్పారావు సేవలను వాడుకున్న కాపులు ఎప్పుడైతే తమ సామాజికవర్గ నేత కోసం పని చేశారో, ఆ తర్వాత నుంచి ఈ నియోజకవర్గం ఒక్కసారి కూడా జనరల్ కాలేదు. అప్పట్లో కావాలనే దీన్ని ఎస్సీ రిజర్వేషన్ కింద మార్చారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఎస్సీ నియోజకవర్గమైనా, ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గమైనా కాపు నాయకుల వెనుకే ఎమ్మెల్యేలు ఉండేవారు. కాంగ్రెస్, వైకాపా అధికారంలో ఉంటే పాలవలస, టీడీపీ అధికారంలో ఉంటే కిమిడి కుటుంబాల ఆధిపత్యంలోనే పాలకొండ ఉండేది. కానీ తొలిసారిగా ఈసారి ఇక్కడ కాపుల కంచె నుంచి ఎమ్మెల్యేలు బయటపడ్డారు. దీంతో కాపుల్లో తాము ఎమ్మెల్యేలు కాలేమన్న నైరాశ్యం పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉణుకూరు కేంద్రంగా పాలవలస సాయిబునాయుడు, ఆయన భార్య రుక్మిణమ్మ పాలకొండను తమ చేతిలో పెట్టుకుంటే, ఆ తర్వాత వీరి తనయుడు పాలవలస రాజశేఖరం ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడుగా పని చేసి ఉణుకూరుకు కూతవేటు దూరంలో ఉన్న పాలకొండను తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. ఎప్పుడైతే పాలవలస రాజశేఖరం చనిపోయారో, ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టి ఆడిరచే నాయకుడు వైకాపా తరఫున లేడు. ఎందుకంటే రాజశేఖరం తనయుడు విక్రాంత్ ఎమ్మెల్సీగా ఉన్నా, నియోజకవర్గాన్ని శాసించే స్థాయి ఆయనకు లేదు. ఇది గ్రహించే పాతపట్నానికి ఎప్పుడో పాలవలస రాజశేఖరం తన పెద్దరికాన్ని షిప్ట్ చేసేశారు. అందుకే ఆయన కుమార్తె రెడ్డి శాంతికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాలకొండ నియోజకవర్గం మీద పూర్తి పట్టును కోల్పోయారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత పాలవలస కుటుంబానికి పోటీగా కిమిడి కళా వెంకటరావును ప్రోత్సహిస్తూవచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రేగిడి ఆమదాలవలస కేంద్రంగా కళా వెంకట్రావు, ఆయన సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడులు అటు రాజాం, ఇటు పాలకొండ రిజర్వుడు స్థలాలపై పట్టు సాధించేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయనకు పక్క జిల్లా చీపురుపల్లి పంపించడంతో ఈ రెండు నియోజకవర్గాల పైన పూర్తిగా ఆజమాయిషీ చెలాయించే అవకాశం కోల్పోయారు. పాలకొండ సిటింగ్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు శిష్యుడే అయినా, మిగిలిన సీనియర్ టీడీపీ నాయకులు మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు గ్రూప్‌లో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే జయకృష్ణ అటు కళాకు, ఇటు అచ్చెన్నాయుడును కాదని తన సొంత రాజకీయాలు, సొంత వ్యాపారాలు నడుపుకొంటున్నారు. కళావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాలవలస కుటుంబం చేతిలో, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కళా వెంకట్రావు చేతిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ చక్రం తిప్పిన నాయకులకే స్థాన చలనం.. అంటే ఉణుకూరు నుంచి ఎచ్చెర్ల, ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లికి కళావెంకట్రావుకు బదిలీ కావడం, పాలవలస రాజశేఖరానికి బలమైన రాజకీయ వారసత్వం పాలకొండకు లేకపోవడం వల్ల కాపుల్లో ఇక ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది. ఎంత ఎగిరి దంచినా మహా అయితే ఎంపీపీ మినహా ఎమ్మెల్యే కాలేమని తేలిపోయింది. సీనియర్లంతా చతికిలపడిపోయారు. అదే సమయంలో తమ వారసులను కూడా రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నించడంలేదు. దీంతో వీరఘట్టం మండలం లఖనాపురానికి చెందిన ముదుల బాబూ పరాంకుశం నాయుడు లాంటి రైతు నాయకుడు ఒక్కటి చేసిన ఈ సామాజికవర్గం ఆనవాళ్లు రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో కనుమరుగు అవుతుందన్న బాధ కాపుల్లో ఉంది.
Comments