కంప్లైంట్ చేశారో.. ఖతం చేస్తాం!
- NVS PRASAD
- Dec 30, 2024
- 1 min read
మహిళను గాయపర్చి వార్నింగ్ ఇచ్చిన రౌడీమూక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మురపాకకు చెందిన లింగాల అప్పమ్మ (52) అనే మహిళను తీవ్రంగా కొట్టి గాయపర్చడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన రౌడీ గ్యాంగ్ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో కొన్నేళ్లుగా తాము డాన్‌లమంటూ చెలరేగిపోతూ ఎక్కడికక్కడ హింసకు పాల్పడుతున్నా ఇంతవరకు వీరి మీద రౌడీషీట్‌లు లేకపోవడంతో తాము నిజంగానే డాన్‌లమని భావిస్తున్న నగరానికి చెందిన సల్మాన్, ఎర్రయ్యలపై వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టౌన్‌హాల్ సందులో ఉన్న శ్రీ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి మురపాకకు చెందిన లింగాల అప్పమ్మ వచ్చారు. పక్క ఊరి నుంచి శ్రీ ఫంక్షన్‌హాల్‌కు రావడానికి దారి తెలియదని ఆమె సమీప బంధువు ఒకరు పేర్కొనడంతో పాత బస్టాండు వద్ద ఉన్న సూర్యలింగం ఆసుపత్రి వద్ద ఆమె వారికోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఫుల్‌గా మందుకొట్టి బండిపై వచ్చిన సల్మాన్, ఎర్రయ్యలు టూవీలర్ స్కిడ్ అవడంతో పడిపోయారు. తాము పడిపోవడానికి లింగాల అప్పమ్మ పక్కనే ఉన్న ఆమె చెల్లి కొడుకు కిరణ్(27)యే కారణమని, మద్యం మత్తులో వంశీ ముక్కును పగలగొట్టేశారు. దీంతో పక్కనే ఉన్న అప్పమ్మ వీరిని తిట్టడంతో అరచేతికి ఉన్న కడియంతో అప్పమ్మ కణత మీద, మొహం మీద తీవ్రంగా గాయపర్చారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోయారు. చుట్టుపక్కల జనసంచారం ఉన్నా ఈ రౌడీలు చెలరేగిపోవడాన్ని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అప్పటికే కిరణ్‌కు ముక్కు నుంచి రక్తం కారుతుండటం, అప్పమ్మకు మొహమంతా చీరుకుపోయివుండటంతో ఆదివారం రిమ్స్‌కు వెళితే.. ట్రీట్మెంట్ మరింత ఆలస్యమవుతుందని భావించి డే అండ్ నైట్ వద్ద ఉన్న ఓ ఆసుపత్రిలో ప్రాథమికంగా చికిత్స పొందారు. సోమవారం ఉదయం వచ్చి రిమ్స్‌లో ఎమ్మెల్సీకి అడ్మిట్ చేసుకోవాలని కోరితే, ఆదివారం జరిగిన ఘటనకు సోమవారం చేర్చుకోమంటూ వెనక్కు పంపేశారు. దీంతో బాధితురాలు అప్పమ్మ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌కు వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఈలోగా వన్‌టౌన్ నుంచి కబురు రావడంతో అక్కడకు వెళ్లారు. మరో బాధితుడు కిరణ్ విశాఖపట్నంలో ఉంటున్నాడు. జరిగిన సంఘటనను పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆయన అట్నుంచటే విశాఖపట్నం వెళ్లిపోయి ఫోన్ స్విఛాఫ్ చేసినట్టు తెలుస్తుంది.
留言