క్యాన్సర్‌పై యుద్ధం!
- DV RAMANA
- Aug 14, 2024
- 3 min read
గురువారం నుంచి రాష్ట్రంలో ఇంటింటా స్క్రీనింగ్
లక్షణాలు ఉన్న, ప్రాథమిక దశలో ఉన్నవారికి ఉన్నత వైద్యం
ప్రజల్లో అవగాహన కల్పించడం, చికిత్సకు సిద్ధం చేయడమే లక్ష్యం
కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్న పీఎంపీ అసోసియేషన్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సదస్సులు, ర్యాలీలు
క్యాన్సర్.. ఈ పేరు వినగానే దాదాపు అందరూ అమ్మో.. అని భయపడిపోతారు. ఇక దానికి గురైనవారైతే.. తమ జీవితం రోజుల్లోకి వచ్చేసిందని బెంగ పెట్టుకుంటారు. ఈ అపోహలు, భయాలే క్యాన్సర్ పేషెంట్లను మరణానికి మరింత చేరువ చేస్తున్నాయి. దీనికితోడు అవగాహన లేకపోవడం, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించకపోవడం వల్లే పరిస్థితి విషమించి క్యాన్సర్ మరణాలకు కారణమవుతోంది. గతానికి ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చినా.. ఇంకా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు క్యాన్సర్ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి సర్వేలు నిర్వహిస్తే క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రజలను చాలావరకు రక్షించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మహాక్రతువులో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎంపీ అసోసియేషన్) కీలక భాగస్వామ్యం వహిస్తోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్‌పై పోరాటానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం(ఆగస్టు 15) నుంచి ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే వేలాదిమంది పారామెడికల్ సిబ్బందిని సిద్ధం చేసింది. వీరందరికీ స్క్రీనింగ్ నిర్వహణలో ఇప్పటికే నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పలు ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. రాష్ట్ర పారామెడిక్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటోంది. ఈ సంఘం గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిపుణులతో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో కూడా ఈ కార్యక్రమం భారీగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ నిర్వహించడం వల్ల క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నవారికి, ప్రాథమిక దశలో ఉన్న వారికి తక్షణమే చికిత్స అందించి రక్షించే అవకాశం ఉంటుందని శ్రీకాకుళం పీఎంపీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వందన సిమ్మన్న, ఎన్.లక్ష్మీనారాయణ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బి.టి.రాజు చెప్పారు. మన రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 70వేల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా వారిలో 50వేలమంది వరకు చనిపోతున్నారని అంచనా. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఈ అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, అసలు క్యాన్సర్ లక్షణాలు తెలియకుండానే కన్నుమూస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. లేకపోతే మరికొన్నేళ్లలో బీపీ, షుగర్ పేషెంట్స్ మాదిరిగా ప్రతి ఇంటిలోనూ క్యాన్సర్ రోగులు ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాదు.
2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!
ఢల్లీిలోని ఎయిమ్స్ అంచనా ప్రకారం 2026 నాటికి మన దేశంలో ఏటా 20 లక్షల మంది క్యాన్సర్‌తో మరణిస్తారని ఫిబ్రవరిలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2020లో దేశంలో 13.92 లక్షల మంది క్యాన్సర్ బారిన పడగా, ఆ సంఖ్య 2021 నాటికి 14.26 లక్షలకు, 2022 నాటికి 14.61 లక్షలకు పెరిగింది. ఇక క్యాన్సర్ మరణాల సంఖ్య 2018లో 7.33 లక్షలు ఉండగా 2022 నాటికి 8.08 లక్షలకు పెరిగింది.
మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి?
ఆమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించని అధ్యయనం ప్రకారం 2016 నాటికి రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 93.3 మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. అదే సమయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఐదు శాతం మాత్రమే ఉందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 132 శాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం 2021`22లో క్యాన్సర్ రోగుల సంఖ్య 1,31,345. ఇందులో అత్యధికంగా 33,530 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. సెర్విక్స్ కాన్యర్ 18,956 మందికి, ఓరల్ కేవిటీ క్యాన్సర్ 2492 మందికి, ఎముకల క్యాన్సర్ బాధితులు 481 మంది, కార్డియోథొరాసిక్ కేసులు 64, సీఎన్‌ఎస్ 1992, కొలోరెక్టల్ 10352, గ్యాస్ట్రిక్ 4875, జెనిటోరినరీ 2324, జీఐటీ 4006, గైనిక్ 7022, తల మెడకు సంబంధించి 1183, హెమటో అంకాలజీ 22,393, ఊపిరితిత్తులు 5110, మస్కులోస్కెలిటర్ 518, మల్టిపుల్ మైలోమా 7338, చిన్నపిల్లల కేసులు 2274, ప్రోస్టేట్ 529, యూరాలజీ 794 కేసులు ఉన్నాయి. 2022 లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలైన తూర్పు గోదావరిలో అత్యధికంగా 18,433 కేసులు ఉన్నాయి. అతిస్వల్పంగా కడప జిల్లాలో 5738 ఉన్నాయి. అనంతపురంలో 8121, చిత్తూరులో 7133, గుంటూరులో 18110, క్రిష్టాలో 12247, కర్నూలులో 9275, నెల్లూరులో 7197, ప్రకాశంలో 10142, శ్రీకాకుళంలో 6292, విశాఖపట్నంలో 10124, విజయనగరంలో 6273, పశ్చిమ గోదావరిలో 12260 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
వ్యాధి వ్యాప్తికి కారణాలు
మానవ శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా ఎక్కువగా పెరిగిపోతే క్యాన్సర్‌కు దారితీస్తుందని క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ, చనిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహార అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు పరీక్షలకు సిద్ధమయ్యేలా చేయడమే ప్రస్తుతం చేపడుతున్న సామూహిక స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాల లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.
Comments