top of page

కార్పొరేట్‌ దెబ్బ.. సిక్కోలు అబ్బా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 29
  • 3 min read
  • షాపింగ్‌ మాల్స్‌ జోరుతో సంప్రదాయ వ్యాపారం వెలవెల

  • దెబ్బతింటున్న వస్త్ర, వ్యాపార, హోటల్‌ రంగాలు

  • తగ్గిన రోజువారీ టర్నోవర్‌.. పెరిగిన అద్దెలు

  • నగరంలో వరుసగా మూతపడుతున్న షాపులు


శ్రీకాకుళం మారిపోయింది.. ఎంతలా అంటే ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఏ సమయంలోనైనా టూవీలర్‌ వేసుకొని రోడ్డు మీదకు రాలేనంతగా.

నిజంగా శ్రీకాకుళం మారిపోయింది.. ఎంతగా అంటే టాటాలు, అదానీలు, అంబానీలు షోరూమ్‌లు పెట్టేటంతగా..

అబ్బో.. శ్రీకాకుళం చాలా మారిపోయింది.. ఎంతలా అంటే.. తరతరాలుగా ఇక్కడ సంప్రదాయ వ్యాపారులుగా ఉన్నవారెవరూ వ్యాపారం చేయలేనంతగా..

ఇప్పటికీ ఎవరైనా శ్రీకాకుళం వెనుకబడిన నగరమంటే చెప్పుతీసుకు కొట్టండి. పాలకొండ రోడ్డులో ఉన్న తనిష్క్‌, ఖజానా బంగారం షాపులను చూపించండి. అదే రోడ్డులో వెలసిన బ్రాండెడ్‌ బట్టల షాపులు చూపించండి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అవును శ్రీకాకుళం మారిపోయింది.. ఎంతలా అంటే ఇక్కడ పుట్టి పెరిగినవాడు వ్యాపారం చేయలేనంతగా. ఒకప్పుడు ఉగాదికి పిసరెత్తు బంగారమైనా కొనాలని సిక్కోలు వ్యాపారి వైపు గ్రామాలన్నీ పరుగులు తీసేవి. ఇప్పుడు పిసరే కాదు.. పరుసవేది విద్య తెలిసిన మేం మాత్రమే బంగారం అమ్మగలమని పెట్టుబడిదారులు ఇస్తున్న... కాదు కాదు ఇస్తున్నామని చెబుతున్న ఆఫర్ల ముందు సిక్కోలు వ్యాపారి వెలవెలబోతున్నాడు. వెరసి ఒక దశాబ్దంగా ఇక్కడ వ్యాపారాలు జరగడంలేదు. సొమ్మంతా కార్పొరేట్లు, శ్రీకాకుళంలో ఎవరినో ముంచేసి బడాబాబులుగా చెలామణీ అవుతున్న వ్యాపారుల వద్ద మాత్రమే ఉంది. సగటు సిక్కోలు వ్యాపారికి టర్నోవర్‌ లేకపోవడంతో మనీ ఇక్కడ చెలామణీలో ఉండటంలేదు. మరోవైపు సిక్కోలు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడిరది. ఎందుకు పెరిగిందో తెలీదు గానీ ఉవ్వెత్తున ఎగసిన రియల్‌ఎస్టేట్‌ రంగం కూడా ఇప్పుడు పడుకుంది. కారణం.. సిక్కోలు వ్యాపారి దగ్గరు డబ్బులు లేవు. డబ్బులున్న కార్పొరేట్‌ బాబులు రోజువారీ వ్యాపారంలో వచ్చిన లాభాలను రాష్ట్రాలు దాటించేస్తున్నారు. దీంతో శ్రీకాకుళంలో సంప్రదాయ వ్యాపారాలన్నీ పడుకున్నాయి. చివరకు చేసేదిలేక సిక్కోలులో ఇన్నాళ్లూ వ్యాపారాలు నిర్వహించినవారు తమ షాపులను అమ్మేయడమో, ఎత్తేయడమో చేస్తున్నారు. ఎప్పుడైతే కార్పొరేట్‌ సంస్థలు నగరంలో అడుగుపెట్టాయో ఇక్కడ స్థలాలు, షాపులు ఉన్నవారు అమాంతంగా అద్దెలు పెంచేశారు. ఎంతయినా ఇవ్వడానికి కార్పొరేట్లు ముందుకు రావడంతో సగటు సిక్కోలు వ్యాపారి ఆ స్థాయిలో అద్దెలు చెల్లించలేక, కార్పొరేట్‌ పోటీని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాడు.

మూతపడుతున్న షాపులు

శ్రీకాకుళంలో ఒకప్పుడు వస్త్ర వ్యాపారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన నెహ్రూ రోడ్డులో 18 షాపులు గత కొన్నాళ్లుగా తెరవడంలేదు. మిగిలిన దుకాణాల్లో స్టాఫ్‌ను తీసేసి కేవలం షాపు యజమానితో పాటు మరో కుటుంబ సభ్యుడ్ని పెట్టుకొని నెట్టుకొస్తున్నారు. ఎందుకంటే జీటీ రోడ్డులో కార్పొరేట్‌ వస్త్రదుకాణాలు వచ్చేశాయి. వీటి మధ్య కూడా ఎంత పోటీ ఉందంటే.. వచ్చిన కొత్తలో తెగ వ్యాపారం చేసిన ఆర్‌కే స్టోర్స్‌ కూడా గత రెండు సంక్రాంతులకు ఆశించిన స్థాయిలో వ్యాపారం చేయలేక భవిష్యత్తు ఏమిటన్న ఆలోచనలో పడిరది. ప్రతి ఏటా ఏదో ఒక కార్పొరేట్‌ వస్త్ర దుకాణం జీటీ రోడ్డులో ఏర్పాటవుతోంది. ఈ సంక్రాంతికి ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ కల్యాణి పేరుతో మరో బట్టల షాపును అదే రోడ్డులో తెరిస్తే, సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ జీటీ రోడ్డుకు షిప్ట్‌ అయింది. ఒకప్పుడు సిక్కోలు ప్రజల సొంత దుకాణాల్లా ఉండే హ్యాపీ షాపింగ్‌మాల్‌, సిటీ సెంట్రల్‌లు వ్యాపారాలు లేక దిక్కులు చూస్తున్నాయి. ఇందులో హ్యాపీ షాపింగ్‌మాల్‌ను ఈ నెల 31తో ఎత్తేస్తున్నారు. ఎవరైనా అద్దెకొస్తే అదే పదివేలంటూ క్లియరెన్స్‌ స్టాక్‌ బోర్డు పెట్టారు. చందన, బొమ్మన బ్రదర్స్‌ లాంటి సంస్థలే ఇక్కడ కార్పొరేట్‌ దెబ్బను తట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన జేకే శారీమందిర్‌ది కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ శ్రీకాకుళంలో అడుగు పెట్టాలని జేకే సంస్థ చూస్తున్నా అద్దెలు తట్టుకోగలమా? అన్న ఆలోచనలో ఉన్నారంటే ఏ స్థాయి కార్పొరేట్లు నగరంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

వస్త్ర దుకాణాలో పోయి బంగారం షాపులొచ్చె!

ఒకప్పుడు నెహ్రూ రోడ్డు, జీటీ రోడ్డు వస్త్రదుకాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఇప్పుడవి బంగారం షాపులకు అడ్డాగా మారాయి. దీంతో సంప్రదాయ బంగారు వర్తకులంతా నష్టపోతున్నారని చెప్పలేం గానీ వ్యాపారాలు లేక విలవిలలాడుతున్నారు. నగరంలో ఒక్క ఖజానా జ్యూయలరీయే రోజుకు రెండు కేజీల బంగారం లేదా ఆభరణాలు అమ్ముతుంది. ఈ సొమ్మంతా శ్రీకాకుళంలో చెలామణీలో ఉండదు.. ఆ షోరూం వల్ల మన జిల్లాలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడటం తప్ప ఉపయోగం లేదు. రిలయన్స్‌, జుడియో సంస్థలు దేశంలో ఇద్దరు కుబేరులవి. వీరు సంపాదించే సొమ్ము కూడా ఇక్కడ చెలామణీలో ఉండదు. ఇక వ్యాపారాలేం చేస్తామని గతంలో షాపులు నిర్మించుకున్నవారు అద్దెలకిచ్చేసి వెళ్లిపోతున్నారు. ఇందులో భాగంగానే జీటీ రోడ్డులో ఉన్న పాత నందు`విందు (ప్రస్తుత నారాయణ`నారాయణి) హోటల్‌ను ఎత్తేశారు. ఈ స్థానంలో వస్త్రదుకాణం ఒకటి వస్తుంది. శ్రీకాకుళంలో టిఫిన్‌ హోటల్‌ ఎక్కడ? అంటే నేరుగా రిక్షావోడు వీనస్‌ హోటల్‌కు తీసుకువెళ్లిన జ్ఞాపకాలు జిల్లాలో చాలామందికి ఉన్నాయి. ఒక బొడ్డేపల్లి రాజగోపాలరావు, ఒక తిమ్మరాజు శివరావు, ఒక సర్దారు గౌతు లచ్చన్న, ఒక మజ్జి నారాయణరావుతో పాటు నేటితరం నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటివారందరూ వీనస్‌ టిఫిన్‌ తిననివారు కాదు. జీటీ రోడ్డులో ఇడ్లీలమ్మితే ఏమొస్తుంది? అదే కార్పొరేట్‌ వాడికి అద్దెకిస్తే లక్షలొస్తాయి. దీనికి తోడు వీనస్‌ హోటల్‌ యాజమాన్యంలో అన్నదమ్ములిద్దరూ ఇటీవల కొద్దిరోజుల వ్యవధిలోనే చనిపోవడంతో నడిపే నాధుడు లేక దీన్ని అమ్మేస్తున్నారు. అలాగే వీనస్‌ యాజమాన్యానికే చెందిన రామలక్ష్మణ థియేటర్‌ ఎదురుగా ఉన్న గాయత్రి హోటల్‌ బిల్డింగ్‌ను కూడా అమ్మకానికి పెట్టారు. జీటీ రోడ్డులో వైభవ్‌ జ్యూయలరీ దగ్గర్నుంచి పీఎంజే వరకు అన్ని కార్పొరేట్‌ సంస్థలూ బంగారం అమ్మడానికి వచ్చేశాయి. చివరకు జీటీ రోడ్డులో ప్లేస్‌ లేక పాలకొండ రోడ్డులో డైమండ్లు అమ్ముతామంటూ కిష్న అనే సంస్థ కూడా త్వరలో షోరూమ్‌ ప్రారంభిస్తుంది. గతంలో ఇక్కడ బొమ్మన బ్రదర్స్‌, ఆ తర్వాత సిటీ షాపింగ్‌మాల్‌ పేరుతో వస్త్రాలు అమ్మేవారు. జీటీ రోడ్డులో తేజ పార్లర్‌ ఎత్తేసిన తర్వాత ఆదిత్య రెస్టారెంట్‌ పెట్టి ఎత్తేశారు. ఇప్పుడు తాజాగా కళింగ రోడ్డులో కూడా గోదావరి రెస్టారెంట్‌ భవనంలో గజపతి టిఫిన్స్‌ అని కొన్నాళ్లు నడిపి, అద్దెలు చెల్లించలేక కొద్ది రోజుల్లో ఎత్తేస్తున్నారు. సిక్కోలు ప్రజలకు అమరావతి హోటల్‌ ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు మధుశాల, ఆ తర్వాత అమరావతి ఇప్పుడు చరిత్రలో మాత్రమే ఉంటాయి తప్ప భౌతికంగా మనకు కనపడవు. ఎందుకంటే ఈ భవనాలను కొట్టేసి ఇక్కడ జాయ్‌ అలుకాస్‌ అనే బంగారం షాపును పెడుతున్నారు. చివరకు వన్‌గ్రామ్‌ గోల్డ్‌లో కూడా ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ షాపులు నగరానికి వచ్చేశాయి. వైభవ్‌ జ్యూయలరీ కింద ఉన్న వెంకటేశ్వర పార్లర్‌ను కూడా ఎత్తేశారు.

హోటళ్లను దెబ్బతీస్తున్న స్ట్రీట్‌ఫుడ్‌

జీటీ రోడ్డు, పాలకొండ రోడ్డులో సంప్రదాయ వ్యాపారాలు నడపడానికి అవకాశం ఇచ్చే అద్దెలు లేవు. రానున్న రోజుల్లో జీటీ రోడ్డు బంగారం షాపులకు కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుంది. సూర్యమహల్‌ జంక్షన్‌ దగ్గర్నుంచి రామలక్ష్మణ వరకు కార్పొరేట్‌ వస్త్రదుకాణాలకు అవకాశం ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం వచ్చిన గుజరాతీలు, రాజస్థానీలు స్థానిక వ్యాపారులను ఎప్పుడో దెబ్బతీశారు. వీరు చేయని లాభసాటి వ్యాపారమంటూ ఏమీ లేదు. ఇప్పుడు కార్పొరేట్లు వచ్చి ఆ మాత్రం పెట్టుబడి పెట్టగల శ్రీకాకుళం వ్యాపారిని దెబ్బకొట్టేశారు. ఇక హోటల్‌ ఫీల్డ్‌కు వచ్చేసరికి బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు లక్షల్లో అద్దెలు, ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తూ హోటల్‌ నడుపుతున్నవారిని రోడ్డు మీద ఎటువంటి ఆంక్షలూ లేకుండా పార్లర్లు, టిఫిన్‌ సెంటర్లు నడుపుతున్నవారు దెబ్బకొట్టేశారు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఉగాది, సంక్రాంతి వ్యాపారాలు సిక్కోలు వ్యాపారికి ఎలా జరుగుతుంది?

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page