కళావతి కాకపోతే కన్నతండ్రే!
- NVS PRASAD
- Jan 21
- 1 min read
పేర్లవారి సందులో బంగారు గాజుల అమ్మకం
క్రైమ్ స్పాట్‌లోనే చెవిదిద్దులు
గంజాయికి పూర్తిగా బానిసైన నిందితుడు

స్థానిక న్యూకాలనీలో శనివారం ఓ వివాహిత హత్య కేసులో నిందితుడుగా ఉన్న అండులూరి శరత్‌కుమార్ పూజారి కళావతిని హత్య చేయకపోయినా తన కన్నతండ్రిని మాత్రం హతమొందించడానికి గడిచిన కొద్ది రోజులుగా సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. కోట్ల ఆస్తి ఉన్నా ఒక్కగానొక్క కొడుకైన తనను తండ్రి బయటకు పంపించేశాడని, ఆ ఇంటిలో ఉంటున్నవారందర్నీ హత్య చేసేయాలంటూ గంజాయి, మందు కొడుతున్న ప్రతిసారీ శరత్‌కుమార్ తన బ్యాచ్ వద్ద కేకలు వేసేవాడని చెప్పుకుంటున్నారు. గంజాయి బాగా తలకెక్కేయడంతో పిచ్చి ప్రేలాపనలే తప్ప సొంత కుటుంబీకుల్ని ఏం చేస్తాడులే అని వీరు లైట్ తీసుకున్నట్టు చెబుతున్నారు. శనివారం కూడా బంగారంతో వచ్చిన కళావతిని కేవలం గంజాయి, మందు జల్సాలకు డబ్బు అవసరమయ్యే హతమొందించాడని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. మృతురాలి చేతికి ఉన్న రెండు గాజులను స్థానిక బంగారం కొట్ల సందులో ఒకరికి అమ్మేసి ఆ సొమ్ముతోనే రూ.40వేలు తన మిత్రుడికి శరత్ అప్పు తీర్చాడు. మరో రూ.2లక్షలు ఇస్తానని, హత్య కేసు నుంచి తప్పుకోడానికి తనకు సహకరించాలని ఒక మిత్రుడ్ని కోరడం, ఆయన అక్కడికక్కడే శరత్‌ను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించడం వరకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు గాజులను రికవరీ చేయగా, తనకు తీర్చిన రూ.40వేల అప్పును శరత్ మిత్రుడే పోలీసులకు తిరిగి ఇచ్చేశాడు. మృతురాలి చెవికి ఉండాల్సిన దుద్దులు ఘటన జరిగిన ఇంట్లోనే మిద్దె మీద పెట్టినట్లు ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి బంగారాన్ని అమ్మి కొంతమేరకు బకాయిలు తీర్చి మిగతాది జల్సాలకు వాడుకోవడం కోసమే వివాహితను హత్య చేశాడని తెలుస్తుంది.
Comentários