top of page

‘కస్పా’ వీరుల ‘ట్యాంపర్‌’తనం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 19, 2024
  • 4 min read
  • `వారసత్వం ద్వారా అందిన భూములు కొన్నే

  • `రికార్డు మార్చి వాటి విస్తీర్ణం పెంచేస్తున్న ఘనులు

  • `తప్పుడు డాక్యుమెంట్లతో ఇతరులకు యథేచ్ఛగా అమ్మకాలు

  • `మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్న బాధితులు

  • `నాడు వైకాపా పంచన.. నేడు టీడీపీ నీడలో భూదందాలు


అసలే ఇది శ్రీకాకుళం నగరం.. విశాఖపట్నం నడిబొడ్డున లేని భూమి ధరలు దీని సొంతం.. మిగతా జిల్లా కేంద్రాల్లో జిరాయితీ భూమి లభ్యత తక్కువ కావడం, శ్రీకాకుళం నగరంలో ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ధరలకు హద్దూపద్దూ లేదు. దీన్నే ఇప్పుడు కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సెంటు స్థలం అమ్మితే లైఫ్‌ సెటిలైపోయే శ్రీకాకుళంలో అటు 80 అడుగుల రోడ్డుకు వెనుక.. ఇటు ఏపీహెచ్‌బీ కాలనీ, దండివీధికి మధ్యలో ఉన్న భూరికార్డులు తారుమారైపోతున్నాయి. గతంలో అమ్మేసిన భూములనే మళ్లీ మళ్లీ వేరేవారికి అమ్మేస్తున్నా.. అదీ చాలదన్నట్లు పక్కవారి భూమి రికార్డులను కూడా తమవిగా మార్చేసి అమ్మేస్తున్నారు. ఇది పూర్తిగా సివిల్‌ మ్యాటర్‌ కావడంతో వివాదం తేలడానికి జీవితకాలాలు సరిపోవు. దీన్నే అలుసుగా తీసుకున్న మోసగాళ్లు సెటిల్మెంట్‌ ద్వారానైనా ఎంతో కొంత భూమిని లాక్కొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం భూ ఆక్రమణలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెబుతున్న తరుణంలో నగరంలో విలువైన భూములు మాయమైపోతున్నాయి. దానికి ఒక ఉదాహరణే ఇప్పుడు ప్రస్తావిస్తున్న భూ బాగోతం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలోని పాత శ్రీకాకుళం పరిధి జిల్లా పరిషత్‌, ఏపీహెచ్‌బీ కాలనీకి ఆనుకొని డాక్టర్‌ వండాన శేషగిరిరావు ఆస్పత్రి వరకు సర్వే నెం.248/1(టీఎస్‌ నెం.377/1)లో మొత్తం 4.55 ఎకరాలు ఉంది.

ఏపీహెచ్‌బీ కాలనీకి దక్షిణ భాగంలో సర్వే నెం. 248/2 (టీఎస్‌ నెం.377/2)లో 21.69 ఎకరాలు ఉంది.

టీపీఎంహెచ్‌ స్కూల్‌కు తూర్పు భాగంలో రెవెన్యూ సర్వే నెం.248/3 (టీఎస్‌ నెం. 377/3) 1.37 ఎకరాలు భూమి ఉంది.

ఈ భూముల్లో ఇప్పటికే కొన్ని భవనాలు, ఇళ్లు నిర్మించినా ఇంకా కొన్ని ఖాళీస్థలాలు ఉన్నాయి. ఈ మొత్తం భూమి కస్పా కుటుంబాలకు చెందినదని స్థానికులు చెబుతుంటారు. ఈ మూడు సర్వే నెంబర్లను ఇప్పటి వరకు అధికారికంగా సబ్‌ డివిజన్‌ చేయలేదు. కానీ అనధికారికంగా సబ్‌ డివిజన్‌ చేసి అమ్ముకున్నారు. కొన్ని వివాదాల్లో ఉండగా, మరికొన్ని వివాదాలను రాజీ ద్వారా సర్దుబాటు చేసుకున్నారు. కస్పా కుటుంబంలో కొందరు వ్యక్తులకు దఖలుపడిన భూమికి మించి విక్రయాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆ కుటుంబమే కారణం

ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న దండివీధికి చెందిన శివశరణ్‌ ఈ వివాదాలకు కేంద్రబిందువనే ఆరోపణలున్నాయి. మండల రెవెన్యూ అధికారులతో పాటు టౌన్‌, మండల సర్వేయర్లు, వీఆర్వోలతో కలిసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఎస్‌ఎల్‌ఆర్‌లో మార్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్లకు సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు విక్రయించారంటూ వీరిపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వద్ద కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోడానికి ఇంటి ప్లాన్‌ కోసం నగరపాలక సంస్థకు దరఖాస్తు చేస్తే తప్ప కొనుగోలు చేసిన స్థలం సక్రమమా, అక్రమమా అని తెలుసుకోలేక కొందరు మోసపోయారని తెలిసింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా 1161/1901 పంపకం దస్తావేజు ద్వారా దఖలు పడిన సర్వే నెం.248/2లో సుమారు 1.64 ఎకరాల భూమిని శివశరణ్‌ కుటుంబ సభ్యులు 15 మంది 15 డాక్యుమెంట్ల ద్వారా ఎవరెవరికో విక్రయించారు. ఆ తర్వాత ఇదే సర్వే నెంబరులో ఉన్న భూమిని పెద్ద మనుషుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తమకు పిత్రార్జితంగా దఖలు పడినట్టు చూపించి 1965 జూన్‌ 7న డాక్యుమెంట్‌ నెం. 2448/ 1965తో పంపకం దస్తావేజు రాసుకున్నారు. ఈ డాక్యుమెంట్‌ ప్రకారం శివశరణ్‌ కుటుంబానికి సర్వే నెం.248/1,2,3లో సుమారు 3.35 ఎకరాలు వాటాగా వచ్చిందని చూపించారు. దాని ఆధారంగా 1983 నుంచి 2021 వరకు 45 మందికి 45 డాక్యుమెంట్ల ద్వారా 3.41 ఎకరాలను విక్రయించేశారు. ఇంతవరకు ఒక లెక్క. ఎందుకంటే అవి కస్పా కుటుంబాలకు చెందిన భూములైనందున వారికి తోచిన రీతిలో అమ్ముకున్నారని అంతా భావించారు.

భూ విస్తీర్ణం ఎలా పెరిగిందబ్బా!

అయితే అసలు కథ 2010 తర్వాత మొదలైంది. తమ భూములన్నీ అమ్మేసుకున్న ఈ కుటుంబీకులు ఇప్పుడు వేరేవారి భూములను తమవిగా చూపించి విక్రయాలు మొదలుపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. శివశరణ్‌ పంచాయతీ సెక్రటరీ కావడం, సొమ్ములిస్తే ఎవరి రికార్డులైనా మార్చేసే తహసీల్దార్‌ కార్యాలయం శ్రీకాకుళంలో ఉండటంతో అక్రమాలకు తెరలేచింది. 2010 నాటికి శివశరణ్‌ తండ్రి కామేశ్వరరావు, చిన్నాన్న పేరుపై సర్వే నెం.248/2లో చెరో 35 సెంట్లు భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. అయితే 2012 నాటికి ఆ భూమి విస్తీర్ణం 1.25 ఎకరాలకు పెరిగిపోయింది. ఇది ఎస్‌ఎల్‌ఆర్‌లోనే కనిపిస్తుంది. సాధారణంగా రబ్బరుకు సాగే గుణం ఉందని తెలుసు గానీ, భూమికి సాగే గుణం ఉందని ఈ ఉదంతం చెబుతోంది. రెండేళ్లలో దాదాపు ఎకరం భూమి ఎలా పెరిగిందో రెవెన్యూ అధికారులకే తెలియాలి. అలాగే శివశరణ్‌ చిన్నాన్న పేరున ఉన్న 35 సెంట్లు కూడా శివశరణ్‌ తండ్రిలాగే 1.25 ఎకరాలుగా పెరిగింది. ఎస్‌ఎల్‌ఆర్‌లో మార్పులు సేమ్‌ టు సేమ్‌. దీంతో పాటు సర్వే నెం.248/1లో సెంటు భూమి లేని శివశరణ్‌ కుటుంబానికి తండ్రి పేరున 46 సెంట్లు, చిన్నాన్న పేరున 46 సెంట్లు ఉన్నట్టు రికార్డులు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. శివశరణ్‌ మరో చిన్నాన్న రమాప్రభు సమీప బంధువులకు చెందిన సర్వే నెం. 248/1లో ఉన్న 2.55 ఎకరాల భూమిని వీరి పేరున రెవెన్యూ రికార్డులు మార్చి విక్రయించేశారని చెప్పుకుంటున్నారు. పూర్వీకుల నుంచి దఖలుపడిరదని చూపిస్తున్న డాక్యుమెంట్లలో సర్వే నెం.248/1లో 85 సెంట్లు ఉంటే.. పాసుపుస్తకంలో మాత్రం 92 సెంట్లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా రెవెన్యూ మాయే.

ఇంటి ప్లాన్‌ కోసం వెళ్తే బట్టబయలైన గుట్టు

అలాగే సర్వే నెం.248/2లో డాక్యుమెంట్‌ ప్రకారం 2.35 ఎకరాలుంటే పాసు పుస్తకంలో 2.50 ఎకరాలుగా మార్చేశారు. దండివీధిలో వీరు ఆక్రమించిన కోట్లు విలువ చేసే 10 సెంట్ల డీ పట్టా భూమిని టీడీపీ నాయకులకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. దండివీధికి చెందిన ఒక రిటైర్డు రెవెన్యూ ఉద్యోగి కుటుంబానికి వారసత్వంగా 1953 క్రయ దస్తావేజు ద్వారా సర్వే నెం.248/2లో సంక్రమించి 1.35 ఎకరాల భూమిలో ఏడున్నర సెంట్లను శివశరణ్‌ సర్వే నెం.248/3గా చూపించి విక్రయించేశారు. కొనుగోలుదారుడు ఇంటి ప్లాన్‌ కోసం నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు తప్పుడు సర్వే నెంబర్‌గా గుర్తించి తిరస్కరించారని తెలిసింది. విషయం వెలుగులోకి రావడంతో కస్పా శివశరణ్‌ తనకు ఉన్న పరిచయాలతో మరో తప్పుడు సవరణ దస్తావేజును సృష్టించారు. దీనిపై స్థల యజమాని దండివీధి సచివాలయం, నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వివాదం నడుస్తోంది. కాకివీధికి చెందిన శివలంకి శంకర్రావు అనే వ్యక్తికి పది సెంట్ల భూమి విక్రయిస్తానని చెప్పి శివశరణ్‌ మధ్యవర్తుల ద్వారా రూ.1.50 లక్షలు తీసుకొని రశీదుతో పాటు 2448/1965 డాక్యుమెంట్‌, కొర్లేషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలిసింది. డాక్యుమెంట్‌ను పరిశీలించగా ఇది తప్పుడు సర్వే నెంబరుతో ఉందని తేలింది. ఆ తర్వాత ఎఫ్‌`లైన్‌ సర్వే చేయిస్తే 248-2బిగా రిపోర్టు ఇచ్చారు. దీంతో మోసపోయానని తెలిసిన శంకరరావు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శివశరణ్‌పై ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు చూపించి తన వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్న శివశరణ్‌ను ఆ మొత్తం వెనక్కు ఇవ్వాలని కోరితే వైకాపా నాయకుల పేరు చెప్పి బెదిరిస్తున్నాడని శివలంకి శంకరరావు ఆరోపిస్తున్నారు. శివశరణ్‌ చిన్నాన్న రమాప్రభుతో కలిసి దండివీధిలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయంలో అధికారులకు డబ్బు ముట్టజెప్పి తప్పుడు పొజిషన్‌ సర్టిఫికెట్‌ సృష్టించి భూముల అమ్మజూపుతున్నారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైకాపా నాయకులను విడిచిపెట్టి టీడీపీ నాయకుల చెంత చేరి వివాదాస్పద భూములను విక్రయించి చేతులు దులుపుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. శివశరణ్‌ మాదిరిగానే రమాప్రభు అక్రమాలకు పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. లేని భూమిని ఉన్నట్టుగా చూపించి పక్క సర్వే నెంబర్లతో వేరొకరి భూములకు తప్పుడుపత్రాలు సృష్టించి, ఆ తర్వాత విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page