గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఎలివేషన్లే తప్ప ఎమోషన్ లేదు
- Guest Writer
- Apr 12
- 3 min read

తమిళంలో టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆయన్నుంచి వచ్చిన కొత్త చిత్రం.. గుడ్ బ్యాడ్ అగ్లీ. ‘మార్క్ ఆంటోనీ’ దర్శకుడు. అజిత్ ఫ్యాన్ బాయ్ అయిన ఆధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఏకే పూర్వాశ్రమంలో పెద్ద ఇంటర్నేషనల్ డాన్. ఐతే కుటుంబం కోసం మాఫియా కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్న అతను.. తన నేరాలు ఒప్పుకుని జైలుకు వెళ్తాడు. జైలు నుంచి విడుదలై కుటుంబంతో సంతోషంగా గడపాలి అనుకున్న సమయంలోనే తన కొడుకు కిడ్నాప్ అవుతాడు. తర్వాత అతను డ్రగ్స్ వినియోగంతో పాటు హత్యా నేరం కేసులో అరెస్ట్ అవుతాడు. తన కొడుకును కుట్రపూరితంగా ఇందులో ఇరికించారని తెలియడంతో ఏకేలోని పాత మనిషి బయటికి వస్తాడు. ఈ కుట్ర చేసింది ఎవరో తనదైన శైలిలో విచారించడం మొదలుపెడతాడు. దీనికంతటికీ జానీ (అర్జున్) దాస్ కారణమని తెలుస్తుంది. ఇంతకీ ఏకే కొడుకుని జానీ ఎందుకు టార్గెట్ చేశాడు.. తన గతమేంటి.. అతడికి ఏకే కుటుంబానికి సంబంధమేంటి.. ఏకే అతడికి ఎలా బుద్ధి చెప్పాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
హీరో పేరు విన్నా.. అతడి ఫొటో చూసినా.. వామ్మో ఇతనా అంటూ కనిపించే ప్రతి క్యారెక్టర్ భయంతో వణికిపోవడం.. తన గురించి ఎలివేషన్లు ఇవ్వడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ మోత మోగిపోవడం.. కెమెరా షేకైపోవడం.. ‘కేజీఎఫ్’ సినిమా పుణ్యమా అని బాగా ఊపందుకున్న ట్రెండ్ ఇది. ఐతే ఊరికే మిగతా పాత్రలతో ఇలా హైప్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదు.. ఆ పాత్ర నేపథ్యం చూశాక ఆ బిల్డప్ కరెక్టే అనిపించాలి. అది జరిగినప్పుడే ఎలివేషన్లు వర్కవుట్ అవుతాయి. కానీ గత కొన్నేళ్లలో వచ్చిన చాలా సినిమాల్లో హీరో పాత్రల్ని.. వాటికిచ్చే బిల్డప్ ను చూస్తే ‘కేజీఎఫ్’ను చూసి వాత పెట్టుకున్నట్లే అనిపిస్తుంది తప్ప ఎలివేషన్ పెద్దగా పండిన దాఖలాలు కనిపించవు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా ఈ కోవకే చెందుతుంది. సినిమాలో ఓ గంట పాటు గురంచి పెద్ద తోపు.. తురుం ఖాన్ అంటూ చుట్టూ ఉండే క్యారెక్టర్లు బిల్డప్పులివ్వడానికే సరిపోతుంది. తీరా అతనేం చేశాడో చూద్దాం అని ఒక లుక్కేస్తే.. ఏఐ సాయంతో కీను రీవ్స్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ల పక్కన అజిత్ ను నిలబెట్టేసి.. యానిమేషన్ రూపంలో అతడి విన్యాసాల్ని చూపించి సరిపెట్టేశాడు దర్శకుడు. దీనికి తోడు పదే పదే అజిత్ స్లోమోషన్లో నడిపించడం.. తన పాత సినిమాల్లోని రెఫరెన్సులు పెట్టడం.. సినిమా అంతా ఇదే వరస. ఇలాంటివి చూసి తమిళనాట అజిత్ ఫ్యాన్స్ ఊగిపోతారేమో కానీ.. మన ప్రేక్షకులకైతే ఇది ఎంతమాత్రం కిక్కు ఇవ్వదు. తెలుగు ప్రేక్షకుల కోణంలో చూస్తే మాత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒక తలపోటు వ్యవహారంలాగే అనిపిస్తుంది.
హీరో పూర్వాశ్రమంలో పెద్ద డాన్.. వర్తమానంలో సామాన్య జీవితం గడుపుతుంటాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి సమస్య తలెత్తితే అతడి పాత అవతారం బయటికి వస్తుంది.. ‘బాషా’తో మొదలుపెడితే గత మూడు దశాబ్దాల్లో ఈ లైన్లో ఎన్ని వందల సినిమాలు వచ్చాయో లెక్కే లేదు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా అదే కోవలోని చిత్రమే. ఐతే గత కొన్నేళ్లలో అజిత్ మాస్ ఇమేజ్ పక్కన పెట్టి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బ తిన్న నేపథ్యంలో.. ఈసారి కథ.. కొత్తదనం.. కాకరకాయ అని ఎక్కువ ఆలోచించకుండా కేవలం ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నాడు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. హీరో ఇంట్రో దగ్గర్నుంచి దగ్గర్నుంచి ఒకటే బిల్డప్ సీన్లతో సినిమాను నింపేశాడు. వీటికి తోడు అజిత్ పాత చిత్రాల రెఫరెన్సులు సినిమాలో బోలెడు కనిపిస్తాయి. అజిత్-త్రిష జంటగా నటించిన ‘మన్కాతా’ సినిమాలో హీరో.. హీరోయిన్ తండ్రిని కార్లోంచి తోసేస్తాడు. దాన్ని గుర్తు చేస్తూ త్రిష డైలాగ్ చెప్పడం మొదలు.. సిమ్రన్ ను తీసుకొచ్చి ‘వాలి’ సినిమా మ్యూజిక్ బిట్స్ వేయడం వరకు అజిత్ సినిమాల రెఫరెన్సులకైతే లెక్కే లేదు. ఓవైపు విపరీతమైన ఎలివేషన్లు.. ఇంకోవైపు ఇలాంటి రెఫరెన్సులతో అజిత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి వారికి గూస్ బంప్స్ ఇవ్వడం బాగానే ఉంది కానీ.. కథ పరంగా మాత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏమంత ఎగ్జైట్మెంట్ కలిగించదు.
ఓవరాల్ గా అంత మంచి ఫీలింగ్ ఇవ్వకపోయినా.. కొన్ని ఎపిసోడ్ల వరకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓకే చేస్తుంది. ముఖ్యంగా విలన్ డెన్లోకి హీరో ఎంట్రీ ఇచ్చి అక్కడ విధ్వంసం సృష్టించే ఎపిసోడ్ ప్రథమార్ధానికి హైలైట్ గా నిలుస్తుంది. ద్వితీయార్ధంలో కూడా యాక్షన్ సీక్వెన్సులన్నీ బాగానే తీశారు. కానీ సినిమాను ముందుకు తీసుకెళ్లే బేసిక్ ఎమోషన్ అయితే ఇందులో ఏమీ లేదు. హీరో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా ఎదిగే క్రమం కానీ.. ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ యాంగిల్ కానీ.. బలంగా లేవు. అంతా పైపై వ్యవహారంలా అనిపిస్తుంది. ఎలివేషన్లు శ్రుతి మంచడం.. ప్రతి సన్నివేశంలో విపరీతమైన హడావుడి కనిపించడం వల్ల ఒక దశ దాటాక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చికాకు పెడుతుంది. చివరి అరగంటలో అయితే ఈ హడావుడి మరీ ఎక్కువైపోయి ముగింపు సమయానికి తలపోటు తప్పదు. ఎమోషన్ సంగతి పట్టించుకోకుండా కేవలం ఎలివేషన్లు చూసి ఊగిపోవాలనుకుంటే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’పై ఓ లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.
నటీనటులు - పెర్‌ఫార్మెన్స్ :
కొన్నేళ్లుగా అభిమానులను మెప్పించే సినిమా చేయలేకపోతున్న అజిత్.. ఈసారి వారిని మెప్పించడమే లక్ష్యంగా.. తనకు వీరాభిమాని అయిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఏం చెబితే అది చేసినట్లున్నాడు. తన లుక్ గత చిత్రాలతో పోలిస్తే చాలా బాగుంది. యంగ్ లుక్ సహా వేరియేషన్లు బాగానే చూపించాడు. ఎలివేషన్ సీన్లలో అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అభిమానులనే కాక మాస్ ను మెప్పించేలా అతను కనిపించాడు. త్రిష పాత్ర.. తన నటన సోసోగా అనిపిస్తాయి. తన మీద వయసు ప్రభావం పడుతున్న సంగతి ఈ చిత్రంలో స్పష్టంగా కనిపించింది. పోలీసాఫీసర్ పాత్రలో త్రిష కన్విన్సింగ్ గా అనిపించలేదు. విలన్ పాత్రలో అర్జున్ దాస్ అదరగొట్టాడు. అజిత్ కొడుకు పాత్రలో ‘సలార్’ ఫేమ్ కార్తికేయ దేవ్ ఓకే అనిపించాడు. జాకీష్రాఫ్ ఊరికే అరవడం తప్ప చేసిందేమీ లేదు. సునీల్ కొంచెం ముఖ్య పాత్రే చేశాడు కానీ.. దాని ఇంపాక్ట్ తక్కువే. ప్రియ ప్రకాష్ వారియర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ప్రసన్న.. రెడిన్ కింగ్స్ లీ సహాయ పాత్రల్లో పర్వాలేదు.
సాంకేతిక వర్గం - పనితీరు :
జి.వి.ప్రకాష్ కుమార్ సినిమాకు తగ్గట్లే మాస్ మసాలా మ్యూజిక్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం మంచి ఊపుతో సాగుతుంది. ఎలివేషన్.. యాక్షన్ సీన్లలో స్కోర్ ఆకట్టుకుంటుంది. కానీ పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మైత్రీ వాళ్లు ఏమాత్రం రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. భారీ ఫారిన్ లొకేషన్లలో రిచ్ గా సినిమా తీశారు. రచయిత-దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ నుంచి ‘మార్క్ ఆంటోనీ’ తర్వాత ఆశించే మ్యాజిక్ ఇందులో లేదు. అతను అజిత్ ను అభిమానులు మెచ్చేలా చూపించడం మీదే దృష్టిపెట్టాడు. అజిత్ పాత చిత్రాల రెఫరెన్సుల మీద పెట్టిన శ్రద్ధ.. కొంచెం కథాకథనాల మీద కూడా పెడితే బాగుండేది.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments