గవర్నర్ వ్యవస్థకు మరో చెంపదెబ్బ
- DV RAMANA
- Apr 12
- 2 min read

సుప్రీంకోర్టు మొన్నిచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. రాజ్యాంగ పదవుల్లో నియమితు లైనవారు ఆ రాజ్యాంగానికి లోబడి పని చేయాలేగానీ దాన్ని అతిక్రమించరాదని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ జె.బి.పార్ధీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గవర్నర్లు రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్న అనేక అంశాల పట్ల స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అట్టి పెట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల సలహా ప్రకారమే గవర్నర్లు పని చేయాలని, రాష్ట్రాలను వీటో చేసే అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని తేల్చిచెప్పింది. ఇంతకాలం గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వా లను ముప్పుతిప్పలు పెడుతున్న మోదీ పరివారానికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిది. అలాగే సంఫ్‌ు భావ జాలాన్ని నింపుకుని పనిచేస్తున్న గవర్నర్లకు కూడా ఇది మింగుపడనిది. కానీ సమాఖ్య స్ఫూర్తికి పెద్దపీట వేసేలా ఉన్న ఈ తీర్పు పట్ల దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ‘ఇది ఒక్క తమిళనాడుకే కాదు.. అన్ని రాష్ట్రాల భారీ విజయం’ అని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పిన రయి విజయన్ ఈ తీర్పును ‘సమాఖ్య నిర్మాణం, శాసనసభ బలమైన హక్కుల ధ్రువీకరణ’గా అభివర్ణిం చారు. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తూ మోదీకి అనుయాయుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు గవర్నర్ రవిది మొదటి నుంచి వివాదాస్పద శైలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నీ కూడా గౌరవించరు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ఉపన్యాసంతో మొదలుపెట్టే ప్రక్రియ విషయంలోనూ ఆయన సాకులు చూపుతూ రెండుమూడుసార్లు వాకౌట్ చేశారు. ప్రజాసంక్షేమం, అవసరాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని.. తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపితే ఆయన వాటిని తనవద్దే తొక్కిపెట్టారు. సుదీర్ఘ కాలయాపన తర్వాత ఆమోదించకుండానే వెనక్కి పంపారు. వాటిని రెండోసారి అసెంబ్లీలో ఆమోదించి పంపితే రాష్ట్రపతి పరిశీలనకు పంపి చేతులు దులుపుకున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ అధికారాల పరిధి ఎంతన్నది సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్ వ్యవహరిం చిన తీరు ఏకపక్షంగా ఉందని, ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఒకసారి అసెంబ్లీ పంపిన బిల్లు లను ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి ఏమీలేదని పేర్కొంది. ఇప్పటివరకు అడ్డుకున్న బిల్లులన్నీ గవర్నర్‌కు రెండోసారి పంపిన తేదీ నుంచి ఆమోదం పొందినట్టేనని చెప్పింది. రాష్ట్రపతి తదుపరి చర్య లను కూడా పక్కన పెట్టింది. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలకు ఇలా అడ్డుతగలడం గవర్నర్ల పని కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ తీర్పు గవర్నర్ల హద్దులను గుర్తుచేసింది. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ రబ్బర్‌స్టాంప్ కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గతంలో ‘ఎస్‌ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. తమిళనాడు ఒక్కటే కాదు, కేరళలోనూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గత గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తొక్కి పెట్టిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ తీర్పుతో అక్కడి బిల్లులకు కూడా మార్గం సుగమమైనట్టే! అయితే, తెలంగాణలోనూ గత గవర్నర్ తమిళిసైతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చేదు అనుభవమే ఎదురైంది. బెంగాల్ ప్రభుత్వం కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. 2023లో అప్పటి ప్రధాన న్యాj ుమూర్తి డీవైచంద్రచూడ్ ‘గవర్నర్లు ప్రభుత్వాలకు అడ్డంకులుగా కాకుండా స్నేహితులు, మార్గదర్శకులు’ గా పనిచేయాలని ఒక కేసు విచారణ సందర్భంగా పంజాబ్ గవర్నర్‌ను హెచ్చరించారు. అయినా గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులుగానే వ్యవహరిస్తూ విమర్శలు మూటకట్టుకుంటు న్నారు. గవర్నర్ల తీరుతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఢల్లీిలో ఆందో ళన కూడా చేశారు. ఇలాంటి ఘటనలను చూస్తే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలాగైనా సరే గవర్నర్లతో తమ పరిపాలన సాగించాలని చూస్తున్నట్టుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య బలోపేతానికి మరింత ఊతమిచ్చింది. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలు చేసేవారు సరిగ్గా లేకుంటే అది చెడుగా కనిపిస్తుంది’ అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను ఉటంకించి మరీ సుప్రీంకోర్టు పాలకులకు గట్టి చురకలే అంటించింది. ఈ తీర్పుతోనైనా అధికారంలో ఉన్నవారు బుద్ధి తెచ్చుకోవాలి. పాలనాతీరు మార్చుకోవాలి. లేదంటే ప్రజలే వారిని మారుస్తారు!
Comments