ఘనతకెక్కిన బ్యాంక్.. 21 మందికి షాక్
- NVS PRASAD
- Mar 21
- 3 min read
పేట బజారు బ్రాంచి ఉద్యోగులకు సీఐడీ నోటీసులు
రాజు, శ్రీకర్, శ్రీను పాత్రపై విచారణ
రూ.3.75 కోట్లు నకిలీ రుణాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసన్నపేట బజారుబ్రాంచిలో ‘సత్యం’ వెలుగులోకి తెచ్చిన నకిలీ రుణాల కుంభకోణం ఇప్పుడు మరో రికార్డును సృష్టించింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 21 మంది బ్యాంకు ఉద్యోగులకు సీఐడీ విచారణ నిమిత్తం నోటీసులు పంపించింది. ‘సత్యం’ ఈ వ్యవహారం వెలుగులోకి తెచ్చిన తర్వాత అటువంటిదేమీ లేదని దబాయించిన బ్యాంకు అధికారులు ఆ తర్వాత ఈ కేసు చిక్కుముడి వీడటంలేదంటూ స్వయంగా సీబీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం పాఠకులకు విదితమే. కోటి రూపాయలకు పైబడి ఇక్కడ ప్రజల సొమ్ము కనిపించకపోవడంతో ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేయాలంటూ కోరిన వెంటనే సమ్మతించడంతో వీరికి నోటీసులు అందాయి. బజారుబ్రాంచి మేనేజర్‌గా శ్రీకర్, రీజనల్ మేనేజర్‌గా టీఆర్‌ఎం రాజు పనిచేసిన కాలంలో బజారుబ్రాంచిలో విధులు నిర్వహించిన 21 మందికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇది బ్యాంకు వ్యవహారం కావడంతో వారెవరూ దీన్ని బయటపెట్టడంలేదు. సీఐడీకి శ్రీకాకుళంలో కార్యాలయం లేకపోవడం వల్ల ధ్రువీకరించే అధికారి కరువయ్యారు. కానీ 21 మందికి నోటీసులు వచ్చిన విషయం అత్యంత విశ్వసనీయవర్గాల భోగట్టా మేరకు బయటపడిరది. ప్రస్తుతం బ్యాంకు రికార్డుల్లో వివిధ రకాల రుణాలు తీసుకున్నారని చూపిస్తున్నవారిలో చాలామందికి అసలు ఆ కేటగిరీలో రుణాలు ఇవ్వలేదని ప్రాథమికంగా తేల్చారు. మొత్తం రూ.11 కోట్లు బినామీల పేరుతో బ్యాంకు ఉద్యోగులే కాజేశారని, అందులో మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లిస్తూ ఈ వ్యవహారం బయటపడే సమయానికి అప్పటి మేనేజర్ శ్రీకర్‌తో కొంత మొత్తం కట్టించడం వల్ల ప్రస్తుతం రూ.3.75 కోట్ల ప్రజాధనానికి లెక్కలు తేలడంలేదని విచారణలో బయటపడిరది. బజారుబ్రాంచి కుంభకోణం ‘సత్యం’ వెలుగులోకి తెచ్చిన తర్వాత ఆమదాలవలస చీఫ్ మేనేజర్ బీఏఎన్ మూర్తిని విచారణకు బ్యాంకు ఉన్నతాధికారులు పంపించారు. అయితే ఈయన మొత్తం తీగ లాగుతున్నారని, పూర్తిస్థాయి నివేదిక అందజేస్తే అందరి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో మూర్తిని రాత్రికి రాత్రే బదిలీ చేశారు. దీంతో ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని, నెమ్మదిగా ఎవరైనా అడిగినప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని, ఈలోపు ఆ సొమ్ముతో వ్యాపారాలు నడుపుకొందామని భావించారు. ఎప్పుడైతే ‘సత్యం’ వరుస కతనాలు ప్రచురించిందో, దీని మీద బ్యాంకు మేనేజర్ శ్రీకర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. కానీ ఆ డివిజన్‌కు డీఎస్పీగా మూర్తి ఉండటం, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఎస్‌బీఐ వ్యవహారాలపై సీరియస్‌గా ఉన్నందున ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అరెస్టు చేస్తారన్న భయంతో కోటి రూపాయలు దాటిందన్న నెపంతో సీఐడీకి అప్పజెప్పారు. నిబంధనల మేరకు సీఐడీ విచారణకు నోటీసులు ఇవ్వడం, ఒక్కొక్కర్ని విజయవాడ పిలిచి విచారించడం, ఆ తర్వాత రికార్డులు తెప్పించుకోవడం, వాటిని ఆడిట్ చేయడం వంటి ప్రాసెస్‌లో కొందరు తప్పించుకోవచ్చన్న భావనతో సీఐడీని ఆశ్రయించారు. సీఐడీకి లేఖ రాయడానికి ముందురోజే బ్యాంకు అధికారులు కూడా ఆ కాలపరిమితిలో పని చేసినవారికి నోటీసులు ఇచ్చారు. దీంతో 21 మంది ఒకే బ్రాంచిలో నోటీసులందుకోవడం రికార్డుగా మారింది.
శ్రీకాకుళం పేరెత్తితే హడలిపోతున్న అధికారులు
ఇక్కడ ఎస్బీఐ రీజనల్ మేనేజర్‌గా పని చేసిన టీఆర్‌ఎం రాజు గార బ్రాంచిలో తాకట్టు నగల మాయం కేసులో పాత్రధారిగా ఉన్నారని ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి బదిలీ చేసి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో చెప్పని బ్యాంకు అధికారులు ఇక్కడ మాత్రం మరొకర్ని తెచ్చి ఆర్‌ఎంగా నియమించారు. టీఆర్‌ఎం రాజు వెళ్లిపోయిన దగ్గర్నుంచి ఎస్బీఐలో ఆయన చేసిన నిర్వాకాలు బయటపడుతుండటంతో సమాధానాలు చెప్పుకోలేక కొత్త రీజనల్ మేనేజర్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. గత కొద్ది నెలలుగా ఆయన సెలవులో ఉన్నారు. ఇప్పుడు కొత్త ఆర్‌ఎంగా ఎవరికి శ్రీకాకుళం పోస్టింగ్ ఇచ్చినా తాము వెళ్లమంటూ చేతులెత్తేస్తున్నట్టు భోగట్టా. ఇప్పటికి నలుగుర్ని ఇక్కడ ఆర్‌ఎంగా నియమించినా ఎవరూ రావడంలేదని తెలుస్తుంది. కారణం.. శ్రీకాకుళంలోని అనేక బ్రాంచిల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ టీఆర్‌ఎం రాజు హయాంలోవి కావడం కొసమెరుపు. గార బ్రాంచి విషయంలో కేవలం స్వప్నప్రియ కుటుంబం మీదే ఫిర్యాదు ఇచ్చి, ఆమె ఆత్మహత్యకు కారణమైన కేసు రోజురోజుకు బిగుసుకుంటోంది. దీనికి బ్యాంకు అధికారులు అటు కోర్టులకు, ఇటు పోలీసులకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ పూర్తిగా అప్పటి ఆర్‌ఎం ఏకపక్షంగా వ్యవహరించారన్న అభిప్రాయం బ్యాంకు అధికారులకు ఉంది. ఇది కొనసాగుతుండగానే శ్రీకాకుళం మెయిన్ బ్రాంచిలో కూడా నకిలీ డాక్యుమెంట్లతో రుణాల మంజూరు, బ్యాంకు వద్ద రుణం తీరిపోయిన తర్వాత కూడా ఉండిపోయిన డాక్యుమెంట్లతో దొంగరుణాలు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. నరసన్నపేట బజారు బ్రాంచి వ్యవహారం సీఐడీ వరకు వెళ్లింది. ఇలా అనేక బ్రాంచిల్లో అనేక అవకతవకలు ఉండటం వల్ల ఇక్కడ ఆర్‌ఎంగా పని చేయడం కంటే ఉద్యోగం చేయకపోవడం బెటరనే ఆలోచనలో ఇక్కడకు రావడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తుంది.
సీజీఎంకు బ్లాక్‌మెయిల్
గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టు పెట్టిన నగలు మాయమైనప్పుడు కేవలం అక్కడ ఉన్న చెస్ట్ కస్టోడియన్ల పాత్ర మాత్రమే కాకుండా ఆర్‌ఎం స్థాయి వ్యక్తుల ప్రమేయం కూడా ఉంటుందని, బ్యాంకింగ్ వ్యవస్థలో చీమ చిటుక్కుమన్నా ఆర్‌ఎం స్థాయి వ్యక్తికి మినిమం సమాచారం ఉండాలనే నిబంధన ఉంది. అటువంటప్పుడు ఆయన పాత్ర కూడా ఉంటుందనేది సుస్పష్టం. ఈమేరకు అప్పటి ఆర్‌ఎం రాజు పాత్ర ఉందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. వీటినే ‘సత్యం’ దఫదఫాలుగా అనేక కథనాల రూపంలో ప్రచురించింది. దీంతో రాజుపై శాఖాపరమైన విచారణ జరిపించాల్సి ఉండగా, ఆయన మాత్రం ఇవన్నీ తిలా పాపం తలా పిడికెడు మాదిరిగా ఎస్బీఐ సీజీఎంకు తెలిసే చేశామని, పోలీసులు అడిగితే ఇదే మాట చెబుతామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు భోగట్టా. ఈమేరకు సీజీఎం అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజుకు వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్‌లను ఆధారంగా చూపిస్తారని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఫీల్డ్ ఆఫీసర్‌గా చింతాడ శ్రీనివాసరావు గార బ్రాంచిలో పని చేసినప్పుడు తాకట్టు నగలు మాయమైన కేసు నమోదైంది. ఆ తర్వాత నరసన్నపేట బ్రాంచికి బదిలీ అయినప్పుడు నకిలీ రుణాల కుంభకోణం వెలుగుచూసింది. దీంతో చింతాడ శ్రీనివాసరావు సంపాదనపై సీఐడీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల అకౌంట్ల వివరాలు, స్థిర చరాస్తులు, బ్యాంకు అకౌంట్ల నుంచి జరిగిన లావాదేవీలు ఇంతకు క్రితమే స్వప్నప్రియ కేసు పునర్విచారణ జరిపినప్పుడు మన పోలీసులు సేకరించారు. అయితే ఈ కేసు ఏమైందో తెలీదు గానీ, ఇప్పుడు నరసన్నపేట బజారు బ్రాంచి అంశంలో మాత్రం చింతాడ శ్రీను వైపు సీఐడీ దృష్టి సారించింది. టీఆర్‌ఎం రాజుతో ఆయనకున్న సాన్నిహిత్యం, గార కుంభకోణం వెలుగుచూసిన వెంటనే నరసన్నపేట బజారు బ్రాంచికి బదిలీ కావడం వంటివాటిపై దృష్టి సారించారు.
Comments