top of page

జాక్‌.. తప్పాడు ట్రాక్‌

  • Guest Writer
  • Apr 11
  • 3 min read

డీజే టిల్లు.. టిల్లు స్క్వేర్‌ చిత్రాలతో యువతలో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు.. సిద్ధు జొన్నలగడ్డ. ఆ రెండు బ్లాక్‌ బస్టర్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు నటించిన’జాక్‌’ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే రిలీజైన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.


కథ:

పాబ్లో నరుడా అలియాస్‌ జాక్‌ (సిద్ధు జొన్నలగడ్డ) చిన్నప్పట్నుంచి కొంచెం భిన్నంగా పెరిగిన కుర్రాడు. అతడిలో చాలా ప్రతిభ ఉన్నా.. తనకెన్నో అభిరుచులు ఉన్నా.. ఒక పద్ధతి ప్రకారం దేన్నీ నేర్చుకోకపోవడంతో ఎందులోనూ నైపుణ్యం సంపాదించలేకపోతాడు. కానీ తన తల్లికి మాత్రం అతడి మీద అపార నమ్మకం. కానీ ఆమె హఠాత్తుగా చనిపోతుంది. తండ్రి జాక్‌ ను అర్థం చేసుకోడు. చదువు పూర్తయ్యాక సంప్రదాయ ఉద్యోగాలు చేయడం ఇష్టం లేని జాక్‌.. రా ఏజెంట్‌ కావాలనుకుంటాడు. అందుకోసం ఇంటర్వ్యూ కూడా పూర్తి చేస్తాడు. ఐతే ఉద్యోగం కన్ఫమ్‌ అయ్యేలోపు ఒక పెద్ద మిషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జాక్‌.. రా బృందం దృష్టిసారించిన టెర్రరిస్టు గ్యాంగ్‌ ను టార్గెట్‌ చేస్తాడు. మరి రా టీం కంటే ముందు అతను టెర్రిరిస్టులను పట్టుకోగలిగాడా.. అతడి మిషన్‌ గురించి తెలిశాక రా టీం ఎలా స్పందించింది.. చివరికి జాక్‌ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఏదైనా ఒక హీరో పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి అది కల్ట్‌ స్టేటస్‌ తెచ్చుకుంటే.. ఆ హీరో తర్వాత చేసే చిత్రాలకు అది బలహీనతగా మారే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మళ్లీ ప్రేక్షకులు ఆ హీరో నుంచి అదే స్థాయి వినోదం ఆశిస్తారు. ఆ స్థాయి ఎంటర్టైనమెంట్‌ లేకపోతే నిరాశ చెందుతారు. అలా అని ముందు సినిమా తరహా వినోదమే ట్రై చేస్తే అది కొత్త కథలో సింక్‌ కాకపోవచ్చు. మొత్తంగా కథే చెడిపోవచ్చు. ‘జాక్‌’ సినిమాలో సరిగ్గా అదే జరిగింది. డీజే టిల్లు.. టిల్లు స్క్వేర్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిద్ధు జొన్నలగడ్డ.. ‘జాక్‌’ సినిమాలోనూ తన మార్కు అల్లరితో ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేయడానికి ప్రయత్నించాడు. అతడి పంచులు ప్రేక్షకులను అక్కడక్కడా నవ్విస్తాయి. కానీ ఈసారి అతను చేసిన పాత్ర అల్లరి చేయదగ్గది కాదు మరి. రా ఏజెంట్‌ కావాలనుకునే వ్యక్తి ఎంత సీరియస్‌ గా ఉండాలి? అతను చేపట్టే మిషన్‌ ఎంత పకడ్బందీగా సాగాలి? కానీ ‘జాక్‌’లో వ్యవహారం మొత్తం నాన్‌ సీరియస్‌ గా.. అల్లరల్లరిగా సాగిపోయింది. కథేమో సీరియస్‌.. హీరో పాత్రేమో నాన్‌ సీరియస్‌.. రెంటికీ అస్సలు సింక్‌ కాక ‘జాక్‌’ రెంటికీ చెడ్డట్లు తయారైంది.

ఇండియా మీద ఎటాక్‌ చేయడానికి చూసే ఉగ్రవాదుల గ్యాంగ్‌.. వాళ్లను కట్టడి చేయడానికి ప్రయత్నించే రా టీం.. ఈ సెటప్‌ లో బాలీవుడ్‌ వాళ్లు కథల్ని పీల్చి పిప్పి చేసేశారు. ఈ కథలు మరీ మూసగా తయారవుతుండడంతో ప్రేక్షకులు కూడా వాటిని లైట్‌ తీసుకుంటున్న రోజుల్లో.. ప్రేమకథలకు పేరుపడ్డ బొమ్మరిల్లు భాస్కర్‌ ఆ జానర్‌ ట్రై చేయడం ఆశ్చర్యకరం. ఇంతకుముందు ‘ఒంగోలు గిత్త’తో తనకు సూట్‌ కాని మాస్‌ సినిమా ట్రై చేసి బోల్తా కొట్టిన భాస్కర్‌.. ఈసారి కూడా తనకు ఏమాత్రం నప్పని కథనే ట్రై చేశాడు. సిద్ధు పాత్రను కొంచెం ఆసక్తికరంగానే రాసుకున్నప్పటికీ.. టెర్రరిస్ట్‌-రా సెటప్‌ మాత్రం పరమ రొటీన్‌ గా డిజైన్‌ చేసుకోవడంతో ‘జాక్‌’ ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయలేకపోయింది. ఆరంభంలో ఒక 20 నిమిషాలు ‘జాక్‌’ కొంచెం ఉత్సాహంగా సాగి ప్రేక్షకుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. కొడుకు ఏం పని చేస్తున్నాడో అంతుబట్టని తండ్రి అతడి ఉద్యోగాన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్‌ ఏజెన్నీని ఆశ్రయించడం క్యూరియాసిటీ పెంచుతుంది. ‘జాక్‌’కు క్యాప్షన్‌ గా పెట్టిన ‘కొంచెం క్రాక్‌’ అనే మాటను జస్టిఫై చేస్తూ సాగే హీరో క్యారెక్టర్‌ తిక్క తిక్కగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంది. రా ఏజెంట్‌ కావడం కోసం హీరో ఇంటర్వ్యూ అటెండ్‌ చేసే వరకు సినిమా లైన్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏజెంట్‌ గా తనకు ఉద్యోగం కన్ఫమ్‌ కావడానికి ముందే హీరో మిషన్లోకి దిగిపోయి చేసే విన్యాసాలే విడ్డూరంగా అనిపిస్తాయి. టెర్రరిస్టులను పట్టుకునే మిషన్‌ అంటే థ్రిల్లింగా ఉంటుందని ఆశిస్తాం. ఐతే ఈ వ్యవహారమంతా అల్లరిగా.. కంగాళీగా సాగుతూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది.

ప్రకాష్‌ రాజ్‌ చేసిన రా అధికారి పాత్రను జోకర్‌ తరహాలో మార్చేసి కామెడీకి వాడుకోవడం ‘జాక్‌’ ఎంతగా దారి తప్పిందో చెప్పడానికి ఉదాహరణ. ఒక సీన్లో ఉన్నతాధికారి వీడియో కాల్‌ చేసి మిషన్‌ గురించి అప్‌ డేట్‌ అడిగితే.. ఒక వ్యక్తిని పట్టుకున్నామని ప్రకాష్‌ రాజ్‌ చెబుతాడు. మధ్యలో సిద్ధు లైన్లోకి వచ్చి ‘వాడ్ని పట్టుకుంది కూడా నేనే సార్‌’ అని వెళ్లిపోతాడు. కాల్‌ కట్‌ చేసి ప్రకాష్‌ రాజ్‌ గావు కేకలు పెడతాడు. ‘జాక్‌’ ఎంత నాన్‌ సీరియస్‌ మూవీనో ఈ సీన్‌ ఒక్కటి చూసి చెప్పేయొచ్చు. ‘రా’ చుట్టూ కథను నడుపుతూ ఇలాంటి సిల్లీ కామెడీ సీన్లు పెట్టి ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్‌ చేయొచ్చని ఎలా అనుకున్నారో మరి. టెర్రరిస్టులు-రా సెటప్‌ ఇలా ఉంటే.. హీరోయిన్‌ తో రొమాంటిక్‌ ట్రాక్‌ ఇంకా పేలవం. డిటెక్టివ్‌ ఏజెన్సీ నడిపే అమ్మాయిగా వైష్ణవి చైతన్య పాత్ర.. ఆమెతో సిద్ధు రొమాన్స్‌ ఏమాత్రం వర్కవుట్‌ కాలేదు. ఆ ట్రాక్‌ అంతా బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆరంభ సన్నివేశాల వల్ల ప్రథమార్ధం అయినా ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. రెండో అర్ధం అయితే పూర్తిగా తేలిపోయింది. హీరో రా ఏజెంట్‌ అవ్వాలనుకోవడం వెనుక ఉన్న డెప్త్‌ లేదు. ఈ ఎమోషన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో తర్వాతి కథతో కనెక్ట్‌ కాలేం. ద్వితీయార్దంలో సన్నివేశాలు మరీ రొటీన్‌ గా తయారై పూర్తిగా ఆసక్తి సన్నగిల్లిపోతుంది. సిద్ధు జోకులు మాత్రమే అంతో ఇంతో ఎంగేజ్‌ చేస్తాయి కథ సంగతి లైట్‌ తీసుకుని సిద్ధు కామెడీ పంచులను ఆస్వాదించడానికి సిద్ధపడితే తప్ప ‘జాక్‌’తో అంతో ఇంతో కనెక్ట్‌ కాలేం.

నటీనటులు-పెర్‌ఫార్మెన్స్‌ :

సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ మారినా ఇంకా టిల్లు హ్యాంగోవర్లోనే ఉన్నాడా అనిపిస్తుంది జాక్‌ చూస్తుంటే. టిల్లు స్టైల్లోనే నాన్‌ స్టాప్‌ గా మాట్లాడుతూ.. అల్లరి చేస్తూ సిద్ధు ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చెయ్యడానికి చూశాడు. అది సినిమాకు బలమో బలహీనతో చెప్పలేని పరిస్థితి. సిద్ధు పంచులు అక్కడక్కడా నవ్వించాయి కానీ.. తన పాత్ర-కామెడీ సినిమాలో సింక్‌ కాలేదు. కానీ సినిమాలో ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేది సిద్ధు మాత్రమే. వైష్ణవి చైతన్య.. సిద్ధు పక్కన కథానాయికగా సూట్‌ కాలేదు. తన పక్కన చిన్న పిల్లలా అనిపిస్తుంది. ఆమె పాత్ర.. నటనలో ప్రత్యేకత ఏమీ లేదు. ప్రకాష్‌ రాజ్‌ ఇలాంటి పాత్రలు ఎన్ని చేశాడో లెక్క లేదు. ఆయన పాత్రను చూడగానే మొనాటనస్‌ ఫీల్‌ కలుగుతుంది. విలన్‌ పాత్రలో రాహుల్‌ దేవ్‌ పరమ రొటీన్‌ అనిపిస్తాడు. సిద్ధు తండ్రి పాత్రలో నరేష్‌ ఆరంభంలో కొంచెం ఎంటర్టైన్‌ చేశాడు కానీ.. తర్వాత ఆ పాత్రను పక్కన పడేశారు. సుబ్బరాజు.. రవి ప్రకాష్‌.. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.

సాంకేతిక వర్గం-పనితీరు :

‘జాక్‌’కు అచ్చు రాజమణి.. సామ్‌ సీఎస్‌.. సురేష్‌ బొబ్బిలి.. ఇలా ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. కానీ పాటల్లో ఒక్కటీ ఎంగేజ్‌ చేయదు. వినసొంపుగా అనిపించే పాటే లేదు సినిమాలో. నేపథ్య సంగీతంలోనూ ప్రత్యేకతేమీ లేదు. విజయ్‌ చక్రవర్తి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. ఇక రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. తనకు ఏమాత్రం సూట్‌ కాని కథను ఎంచుకోవడంతోనే దారి తప్పేశాడు. పోనీ ఆ కథలో ఏమైనా కొత్తదనం చూపించాడా అంటే అదీ లేదు. అసలే రొటీన్‌ కథ.. పైగా సన్నివేశాల్లోనూ వైవిధ్యం లేకపోవడంతో అతను ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయలేకపోయాడు. ఎక్కడా భాస్కర్‌ ముద్రే కనిపించలేదీ సినిమాలో.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page