top of page

టెస్ట్‌.. సహనానికి టెస్టే

  • Guest Writer
  • Apr 5
  • 3 min read
టెస్ట్‌’ మూవీ రివ్యూ

మాధవన్‌.. నయనతార.. సిద్దార్థ్‌.. ఇలాంటి కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ క్రేజీ కాంబినేషన్లో తమిళ నిర్మాత శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం.. టెస్ట్‌. స్ట్రీమింగ్‌ జెయింట్‌ నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా నేరుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్‌ వెంకట్రామన్‌ (సిద్దార్థ్‌) భారత క్రికెట్‌ జట్టులో పేరుమోసిన బ్యాటర్‌. జట్టుకు ఎన్నో విజయాలందించి గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అతను.. కెరీర్‌ చరమాంకంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడతాడు. పాకిస్థాన్‌ జట్టుతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌ తో తన కెరీర్‌ కు ముగింపు పలకాల్సిన స్థితికి చేరుకుంటాడు. మ్యాచ్‌ మొదలు కాబోతుండగా.. అతణ్ని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులోకి దించాలని బెట్జింగ్‌ సిండికేట్‌ ప్రయత్నించి విఫలమవుతుంది. మరోవైపు ఆ సిండికేట్‌ దగ్గర బాధితుడైన సైంటిస్ట్‌ శరవణన్‌ (మాధవన్‌).. టీచర్‌ అయిన తన భార్య కుముద (నయనతార) వెంట తమ ఇంటికి వచ్చిన అర్జున్‌ కొడుకును కిడ్నాప్‌ చేసి తన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ప్రణాళిక రచిస్తాడు. మరి అతడి ప్రయత్నం ఎంతమేర ఫలించింది.. అర్జున్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడా.. ప్రతిష్టాత్మక మ్యాచ్‌ లో తన ప్రదర్శన ఎలా సాగింది.. ఇండియా మ్యాచ్‌ గెలిచిందా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఇండియాలో యువతకు అత్యంత ఇష్టమైన రెండు విషయాలు.. సినిమా-క్రికెట్‌. అందుకే క్రికెట్‌ నేపథ్యంలో తరచుగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఈ కథలను తెరకెక్కిస్తే అద్భుత ఫలితం రాబట్టవచ్చని ‘లగాన్‌’ లాంటి సినిమాలు రుజువు చేశాయి. ఐతే వేరే కథాంశాల్లో లాజిక్స్‌ అటు ఇటుగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు కానీ.. క్రికెట్‌ సంబంధిత కథల్లో మాత్రం అన్నీ పక్కాగా ఉండాలి. ఏ చిన్న తప్పు చోటు చేసుకున్నా.. లాజికల్‌ గా అనిపించకపోయినా.. ప్రేక్షకులు డిస్కనెక్ట్‌ అయిపోతారు. ‘టెస్ట్‌’ సినిమాలో అదే జరిగింది. ‘తమిళ్‌ పడం’.. ‘గురు’ సహా పలు చిత్రాలతో నిర్మాతగా అభిరుచిని చాటిన శశికాంత్‌ దర్శకుడిగా మారుతూ క్రికెట్‌ నేపథ్యంలో రాసుకున్న కథలో బేసిక్‌ విషయాలే తేడా కొట్టేశాయి. సినిమాలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో సాగే అత్యంత కీలకమైన సన్నివేశాలే తుస్సుమనిపించడంతో ఈ కథతో ప్రేక్షకులు కనెక్ట్‌ కావడం కష్టమవుతుంది. కేవలం లీడ్‌ యాక్టర్ల పెర్ఫామెన్స్‌ వల్ల ‘టెస్ట్‌’ కొంత ఎంగేజ్‌ చేయగిలిగినా.. కథాకథనాల్లో బిగి లేకపోవడం.. లాజిక్స్‌ మిస్సయిపోవడంతో ప్రేక్షకుల సహనానికి ఇది ఒక ‘టెస్ట్‌’గానే నిలుస్తుంది.

భారత క్రికెట్‌ జట్టులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఊసు వినిపించి పాతికేళ్లు దాటిపోయింది. ఇక పాకిస్థాన్‌ తో మన జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడి కూడా 20 ఏళ్లు కావస్తోంది. అలాంటిది చెన్నైలో ప్రస్తుత కాలంలో ఈ రెండు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరుగుతుంటే.. జట్టులో నంబర్‌ వన్‌ ఆటగాడిగా పేరున్న క్రికెటర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లుగా చూపించారిందులో. ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న రోజుల్లో ఏ ఆటగాడూ ఇంటికి వెళ్లే అవకాశమే ఉండదు. కానీ ఇందులో మాత్రం క్రికెటరైన హీరో తండ్రి అనారోగ్యం పేరు చెప్పి ఇంటి నుంచే మ్యాచ్‌కు వస్తుంటాడు. వెళ్తుంటాడు. అన్నింటికీ మించి సిల్లీ విషయం ఏంటంటే.. మ్యాచ్‌ మొదలవుతున్నపుడు.. బ్రేక్‌ టైంలో సెల్‌ ఫోన్లో మాట్లాడేస్తుంటాడు.. అది కూడా బెట్టింగ్‌ మాఫియాతో. అంత పేరుమోసిన క్రికెటర్‌ కొడుకుని చాలా సింపుల్‌ గా కిడ్నాప్‌ చేసేసి తనను బ్లాక్‌ మెయిల్‌ చేసి ఫిక్సింగ్‌ చేయిస్తారు. హీరోతో బెట్టింగ్‌ మాఫియా మాట్లాడుతున్నట్లు పోలీసులు కనిపెట్టి కూడా ఫిక్సింగ్‌ గురించి మాత్రం ఏమీ ఆరా తీయరు. హీరో తన పాటికి తాను యథేచ్ఛగా ఫిక్సింగ్‌ చేసేస్తూ ఉంటాడు. చివర్లో మాత్రం అడ్డం తిరిగి ఇండియాను గెలిపించేస్తాడు. ఇంత సిల్లీగా సీన్లు రాసి.. తీసి.. క్రికెట్‌ లవర్స్‌ ను మెప్పించడం ఎలా సాధ్యం?

ఇండియా-పాకిస్థాన్‌ టెస్టు మ్యాచ్‌.. అందులో ఫిక్సింగ్‌.. మరోవైపు కిడ్నాప్‌.. వీటి చుట్టూ ఉద్వేగభరితంగా.. ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని నడిపించాలనుకుంటే ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి నేపథ్యంలో కథ రాసుకోవాల్సింది. ఆ కాలానికి అనుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దుకోవాల్సింది. కానీ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన కాలంలో ఏమాత్రం లాజిక్‌ లేని విధంగా పైపైన కథాకథనాలను తీర్చిదిద్దుకోవడంతో ‘టెస్ట్‌’ నిస్సారంగా తయారైంది. ఓవైపు ఫాంతో తంటాలు పడుతున్న సీనియర్‌ క్రికెటర్‌ గా సిద్ధు.. ఇంకోవైపు నీటి నుంచి పెట్రోల్‌ తయారు చేసే ప్రాజెక్టుతో తనేంటో నిరూపించుకోవాలని చూసే మాధవన్‌ క్యారెక్టర్‌.. మరోవైపు ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కనాలని ప్రయత్నిస్తున్న నయనతార.. ఇలా మూడు ముఖ్య పాత్రల నేపథ్యం ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఈ పాత్రల చుట్టూ స్ట్రాంగ్‌ ఎమోషన్‌ క్రియేట్‌ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీనికి తోడు ముందే చెప్పుకున్నట్లు లాజిక్‌ లేని సీన్లు సినిమాను ఏ దశలోనూ సీరియస్‌ గా తీసుకోలేని పరిస్థితి కల్పించాయి. కిడ్నాప్‌ వ్యవహారం.. ఫిక్సింగ్‌ సీన్లు అయితే పూర్తిగా తేలిపోయాయి. మాధవన్‌-నయనతార బాగా పెర్ఫామ్‌ చేయడం వల్ల ఇద్దరి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. సిద్ధు చివర్లో కొంచెం ఇంపాక్ట్‌ వేయగలిగాడు. అంతకుమించి సినిమాలో ఇంప్రెస్‌ చేసే విషయాలేమీ లేవు. క్రికెట్‌ మీద సినిమా తీస్తూ ఆటకు సంబంధించిన ముఖ్యమైన విషయాల మీద కూడా అవగాహన లేనట్లు సన్నివేశాలు తీస్తే వాటిని ఎంజాయ్‌ చేయడం కష్టం. రెండు గంటలకు కాస్త ఎక్కువ నిడివే ఉన్నప్పటికీ.. ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుందంటే.. అందుకు నత్తనడకన సాగే సన్నివేశాలే కారణం. నేరుగా ఓటీటీలో రిలీజైంది కాబట్టి ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ లో చూసుకునే ఆప్షన్‌ ఉండడం ఒక్కటే ఇందులో పాజిటివ్‌ విషయం.

నటీనటులు పెర్‌ఫార్మెన్స్‌ :

కెరీర్‌ ఆరంభంలో లవర్‌ బాయ్‌-చాక్లెట్‌ బాయ్‌ అనిపించుకున్న మాధవన్‌.. ఆ తర్వాత రఫ్‌ క్యారెక్టర్లలోనూ అద్భుతంగా నటించి మెప్పించాడు. ‘టెస్ట్‌’లోనూ ఆయన నటనలో వైవిధ్యం చూడొచ్చు. గ్రే షేడ్స్‌ ఉన్న పాత్రలో మాధవన్‌ అదరగొట్టాడు. తన పాత్రలో మార్పు మొదలయ్యాక ప్రతి సీన్లోనూ మెప్పించాడు. చివరి 20 నిమిషాల్లో మాధవన్‌ నటన మరో స్థాయికి చేరుకుంటుంది. నయనతార పెర్ఫామెన్స్‌ క్షూడా సూపరే. కథ సీరియస్‌ రూట్‌ తీసుకున్నాక ఆమె ప్రతి సన్నివేశంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. కొన్ని సీన్లలో మాధవన్‌ తో పోటీ పడి నటించింది. ఈ సినిమా చూస్తే మాధవన్‌-నయన్‌ కాంబినేషన్లో సీన్ల కోసమే చూడాలి. సిద్ధు పాత్ర.. తన నటన చాలా వరకు సాధారణంగానే సాగిపోతాయి. ఐతే చివరి అరగంటలో మాత్రం అతను ప్రభావం చూపించాడు. మీరా జాస్మిన్‌ గురించి చెప్పడానికేమీ లేదు. తెలుగు నటుడు వినయ్‌ వర్మ.. కాళి వెంకట్‌.. ఆడుగళం మురుగదాస్‌.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నికల్‌ గా ‘టెస్ట్‌’ ఓకే అనిపిస్తుంది. విరాజ్‌ సింగ్‌ గోహిల్‌ ఛాయాగ్రహణం బాగుంది. క్రికెట్‌ మైదానంలో సన్నివేశాలను బాగా తీశాడు. విజువల్స్‌ లో క్వాలిటీ కనిపిస్తుంది. శక్తిశ్రీ గోపాలన్‌ సంగీతం సాధారణంగా అనిపిస్తుంది. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకటీ అరా పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. సుమన్‌ కుమార్‌-శశికాంత్‌ కలిసి తీర్చిదిద్దుకున్న స్క్రిప్టులోనే చాలా లోపాలున్నాయి. ఇండియాలో ఒక హై ప్రొఫైల్‌ క్రికెటర్‌ కొడుకుని సింపుల్‌ గా కిడ్నాప్‌ చేసి తనతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయించడం అన్నదే చాలా ఇల్లాజికల్‌ పాయింట్‌. నిజంగా ఇలాంటి పాయింట్‌ అనుకుంటే.. ప్రేక్షకులను కన్విన్స్‌ చేసేలా.. లాజికల్‌ గా కరెక్ట్‌ అనిపించేలా.. లాక్స్‌ వేసుకోవాల్సింది. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. అంతా పైపైన లాగించేయడంతో మంచి మంచి ఆర్టిస్టుల కష్టం వృథా అయిపోయింది.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page