డీఈవో పాపం.. ఫలితాలకు శాపం
- NVS PRASAD
- 3 days ago
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

డీఈవో తిరుమల చైతన్య దయవల్ల కుప్పిలి జిల్లాపరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పడిపోయింది. పరీక్షలు ప్రారంభించిన మూడో రోజే అక్కడ మాల్‌ప్రాక్టీస్ జరుగుతోందని మందీమార్బలంతో హడావుడి సృష్టించిన డీఈవో పబ్లిసిటీ పిచ్చికి ఇక్కడ ఈ సంవత్సరం 8 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. మొత్తం 51 మంది విద్యార్థుల్లో కేవలం నలుగురు మాత్రమే పాసయ్యారు. తెలుగు, హిందీలో 48 మంది చొప్పున, ఇంగ్లీష్‌లో 38 మంది, లెక్కలులో 10 మంది, సైన్స్‌లో 31 మంది, సోషల్‌లో 33 మంది మాత్రమే పాసయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షల వరకు బాగానే రాసిన విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రోజున డీఈవో బృందం చేపట్టిన అలజడికి భయపడిపోయారు. అక్కడి నుంచే మిగిలిన పరీక్షలు రాయలేకపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, డీఈవో హంగామా చేసిన సెంటర్లలో పరీక్షలు రాసిన మత్స్యలేశం విద్యార్థులు 33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బుడగట్లపాలెం విద్యార్థులు 40 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదోతరగతి విద్యార్థి మృతి
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన శ్రీకాకుళం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాలరావుకు బుధవారం విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 393 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. వేణుగోపాలరావు శ్రీకాకుళం నగరంలోని వికాస్ టాలెంట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి కాగా, అక్క ఇంజినీరింగ్ చదువుతోంది. వేణుగోపాలరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
గురుకులంలో వంద శాతం పాస్
స్థానిక హయాతినగరంలోని జ్యోతీరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పది ఫలితాల్లో వంద శాతం రిజల్ట్ వచ్చినట్టు ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలో 48 మంది విద్యార్ధులు పది పరీక్షలకు హాజరుకాగా, 48 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. నలుగురుకు పైగా విద్యార్ధులు 270 మార్కులకు సాధించారని వివరించారు. తమ్మినేని భాగ్యశ్రీ (577), మీసాల పూజ (576), గార జాహ్నవి (576), ఎం.లహరి (570) మార్కులు పొందారని తెలిపారు. గురుకులంలో ఉపాధ్యాయులు కృషికి, విద్యార్ధుల పట్టుదల, క్రమశిక్షణకు ఈ ఫలితాలే తార్కాణమని ప్రిన్సిపాల్ తెలిపారు.
Comments