top of page

డీఎంహెచ్‌వో కార్యాలయానికి మద్దెలదరువు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 7
  • 4 min read
  • అక్కడ అందరూ దొరకని దొంగలే?

  • ఒకవైపు విజిలెన్స్‌ మరోవైపు ఏసీబీ విచారణ

  • అయినా దొరికింది కొందరు ఉద్యోగులే

  • అడుగడుగునా అవినీతి ఆనవాళ్లే


జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఒకవైపు విజిలెన్స్‌, మరోవైపు ఏసీబీ తిష్టవేశాయి. నేరుగా మహిళా ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ డీఎంహెచ్‌వో, ఆయన సీసీ ఏసీబీకి దొరికిపోగా.. అంతకు క్రితమే ఈ కార్యాలయంలో పని చేస్తున్న 12 మంది ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగ నియామకాలు, డిప్యూటేషన్లు వంటి వ్యవహారాల్లో లక్షలాది రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి రికార్డులు తీసుకువెళ్లి పరిశీలిస్తోంది. అలాగే టెక్నికల్‌ అంశాల క్లారిఫికేషన్‌ కోసం డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే రికార్డులను పరిశీలిస్తోంది. ఇది చాలదన్నట్లు రీపోస్టింగ్‌ ఆర్డర్‌ ఇచ్చినా, వర్క్‌ ప్లేస్‌ ఇవ్వకపోవడంతో ఏసీబీకి దొరికిపోయిన డీఎంహెచ్‌వో వద్ద బాధితురాలి ఫైల్‌ ఉందా? లేదా? అని ఏసీబీ అధికారులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎంక్వైరీ చేస్తున్నారు. వర్క్‌ప్లేస్‌ ఫేవర్‌ చేయడానికే డీఎంహెచ్‌వో లంచం అడిగారని నిరూపించాల్సిన బాధ్యత ఏసీబీ అధికారులపై ఉంది. ఇందుకు సంబంధించి బాధితురాలు డీఎంహెచ్‌వోకు పెట్టుకున్న ఫైల్‌ వివరాల కోసం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)



జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 12 మంది ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఆ శాఖలోని ఒక సంఘం నాయకుడు ఫిర్యాదు చేశారు. 2021 నుంచి 2024 మధ్య చేపట్టిన నియామకాలు, డిప్యూటేషన్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించలేదని, కోవిడ్‌ సమయంలో అక్రమంగా నియామకాలు చేపట్టారని, ఇందులో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదంటూ మరో 8 అంశాలపై 12 మంది ఉద్యోగులపై ఫిర్యాదు అందింది. దీనిపై విజిలెన్స్‌ అధికారులు స్పందించి మార్చి 3న 12 మంది ఉద్యోగులకు 11 నుంచి 13 తేదీల మధ్య వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలవాలని నోటీసులు ఇచ్చారు. ఆ 12 మందిలో కార్యాలయ సూపరింటెండెంట్‌ భాస్కరకుమార్‌తో పాటు గతంలో డీఎంహెచ్‌వోకు సీసీలుగా పని చేసిన సోమేశ్వరరావు, నారాయణ కూడా ఉన్నారు. వీరితో పాటు సీనియర్‌, జూనియర్‌ సహాయకులు డి.సంతోష్‌, జి.వెంకటస్వామి, ఆశాకుమారి, పి.దుర్గాప్రసాద్‌, దుర్గాప్రసాద్‌దాస్‌, ఇతర ఆరోగ్య సిబ్బంది జి.వి.నరసింహం, పుక్కళ్ల ఆనంద్‌, సీహెచ్‌ వెంకటరావు, అటెండర్‌ దుర్గారావు ఉన్నారు. వీరందరూ విచారణకు హాజరై లిఖితపూర్వకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. 12 మందిలో సోమేశ్వరరావు మినహా మిగతా వారందరిపైనా ఎప్పట్నుంచో అనేక అభియోగాలున్నాయి. గత డీఎంహెచ్‌వో యూనియన్‌ చెప్పిన పనులు చేయలేదని, ఆ మేరకు ఆమెను ఇరకాటంలో పెట్టాలని చూడగా సోమేశ్వరరావు రూల్స్‌ మేరకు అడ్డు తగలడం వల్లే ఆయనపై ఫిర్యాదు చేశారు తప్ప డీఎంహెచ్‌వో కార్యాలయంలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఆయనకు సంబంధం లేదన్న విషయం కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి.

దొరక్కుండా జాగ్రత్తపడ్డారు

ఒకవైపు ఈ విచారణ నడుస్తుండగానే సీనియర్‌ సహాయకురాలు కాంతమ్మ (దివ్యాంగురాలు)కు రీపోస్టింగ్‌లో ప్లేస్‌ అలాట్‌ చేయడానికి రూ.20వేలు డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణతో పాటు సీసీ వాన సురేష్‌ చిక్కారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు తప్పించుకున్నారని జిల్లా కార్యాలయ ఉద్యోగులు చెబుతుంటే.. కాదు కాదు వారే ఈ ట్రాప్‌ విషయంలో కాంతమ్మకు సహకరించారని మరికొందరు చెబుతున్నారు. కాంతమ్మ నుంచి వసూలుచేసిన రూ.20వేలను డీఎంహెచ్‌వోతో పాటు మరో ఇద్దరు పంచుకోవాల్సి ఉంది. అందులో సూపరింటెండెంట్‌ భాస్కరకుమార్‌తో పాటు డీపీఎం డాక్టర్‌ బి.రవీంద్ర ఉన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డబ్బులు లేకుండా పనులు జరగడం మానేసి నాలుగు దశాబ్దాలైపోయింది. ఎవరూ ఇందుకు అతీతులు కాకపోయినా బాలమురళీకృష్ణ మాత్రం నేరుగా సొమ్ములు తీసుకోవడంతో తక్కువ కాలంలోనే పతాక శీర్షికలకు ఎక్కిపోయారు. సాధారణంగా డీఎంహెచ్‌వోకు డబ్బులివ్వాలంటే సీసీలు వసూలు చేస్తారు. లేదూ అంటే సంబంధిత సూపరింటెండెంటో, లేదా సీనియర్‌ అసిస్టెంటో వసూలుచేసి డీఎంహెచ్‌వోకు ఏకమొత్తంలో ఖర్చులు తీసేసి ఒకేసారి లెక్కలు అప్పజెబుతారు. కానీ బాలమురళీకృష్ణ ఈ సీటులో కూర్చున్న దగ్గర్నుంచి కొత్త సంస్కృతికి తెర లేపారు. సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లను పక్కన పెట్టి ముందు తన వాటా ఇచ్చేయాలని, ఆ తర్వాత సూపరింటెండెంట్లకు ఎంత ఇచ్చుకుంటారో తనకు అనవసరమని తెగేసి చెప్పడంతో సీసీ ద్వారా డీఎంహెచ్‌వో సొమ్ములు తీసుకునేవారు. అందుకే ఏసీబీ రైడ్‌ చేసే సమయానికి కాంతమ్మ ఇచ్చిన రూ.20వేలు డీఎంహెచ్‌వో జేబులోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తమను కాదని డీఎంహెచ్‌వోనే నేరుగా డబ్బులు కొల్లగొట్టేస్తున్నారన్న అక్కసుతోనే సూపరింటెండెంట్‌ స్థాయి వ్యక్తులు ఈ ట్రాప్‌ చేయించారని ప్రచారం కూడా ఉంది.

ఇక విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో 12 మంది పేర్లు పొందుపర్చినా కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా ఒకే తాను ముక్కలని అనేక సందర్భాల్లో స్పష్టమైంది. అయితే అంతమంది మీద ఒకేసారి ఫిర్యాదు ఇస్తే అది నీరుగారిపోతుందనే ముందుగా 12 మందిని ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా రాజకీయ సిఫార్సులతో ఏళ్ల తరబడి కార్యాలయ కిటికీలను పట్టుకొని వేలాడుతున్నారు. జిల్లా కార్యాలయంలో పోస్టింగ్‌ అంటే డబ్బులు ఇచ్చి మరీ వస్తున్నవారు ఉన్నారు. వీరిలో అనేక మంది హెల్త్‌ అసిస్టెంట్ల నియామకంలో నిబంధనలను తుంగలో తొక్కి ఉద్యోగార్ధుల నుంచి సుమారు రూ.1.07 కోట్లు వసూళ్లకు పాల్పడ్డారు. అందులో ఉన్నవారి పేర్లు విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇలా అనేక సందర్భాల్లో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని విడిచిపెట్టి కొందరి పేర్లను మాత్రమే ప్రస్తావించడంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.

ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో సీసీ వాన సురేష్‌ అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో నరసన్నపేట నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆ తర్వాతే వసూళ్ల పర్వం పీక్‌ స్టేజ్‌కు చేరిందనే ఆరోపణలున్నాయి. ఐడీఎస్‌పీ విభాగంలో ఖాళీ అయిన డేటా మేనేజర్‌ పోస్టుకు రూ.2లక్షలు డిమాండ్‌ పెట్టారు. డబ్బులు ఎవరిస్తే వారికే పోస్టింగ్‌ ఇవ్వడానికి ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌కు ఫైల్‌ పెడతామని భీష్మించుకుకూర్చున్నారు. ఈ పోస్టుకు రూ.లక్ష ఇవ్వడానికి ఇద్దరు ఉద్యోగులు ముందుకు వచ్చినా రూ.2 లక్షలు కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించేదిలేదని చెప్పి దాన్ని రెండు నెలలుగా ఖాళీ ఉంచారు. ఈ వ్యవహారంలో డీపీఎం, సూపరింటెండెంట్‌ తెర వెనుక ఉన్నారని కార్యాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

ముగ్గురే కీలకం..

వాస్తవంగా సీసీ వాన సురేష్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎస్‌టీఎఫ్‌లో పనిచేసి, దానికి రిజైన్‌ చేసి వైద్య ఆరోగ్యశాఖలో పారా మెడికల్‌ ఉద్యోగిగా చేరాడు. సీసీ సురేష్‌ కానిస్టేబుల్‌గా చేరకముందే డీఎస్‌సీ ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం సాధించినా వివిధ కారణాల రీత్యా పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్‌ సెలక్షన్‌కు వెళ్లి 1998 బ్యాచ్‌కు సెలెక్ట్‌ అయ్యాడు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని 1437 పీసీ నెంబర్‌తో ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన కొన్ని రోజుల తర్వాత న్యాయస్థానం తీర్పుతో వైైద్య ఆరోగ్యశాఖలో పారా మెడికల్‌ ఉద్యోగిగా నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. దీంతో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వైద్య ఆరోగ్యశాఖలో చేరాడు. కానిస్టేబుల్‌ సర్వీసుతో కలుపుకొని సురేష్‌ ప్రభుత్వ పెన్షన్‌కు ఎలిజిబులిటీ పొందాడు. నరసన్నపేట పరిధిలోనే ఎక్కువ కాలం పని చేసిన సురేష్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితమే డీఎంహెచ్‌వో సీసీగా టీడీపీ నాయకులు సిఫార్సుతో చేరాడు. చేరిన తర్వాత వ్యవస్థనంతా డీపీఎంతో కలిసి తన చేతులో ఉంచుకొని ప్రతి పనికి ఒక రేట్‌ ఫిక్స్‌ చేసి వసూళ్లు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే కాంతమ్మకు ఆర్‌జేడీ రీపోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చిన 45 రోజుల వరకు వర్క్‌ ప్లేస్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్‌ చేశారు. వారు డిమాండ్‌ చేసిన డబ్బులు పట్టుకొని మొదట సూపరింటెండెంట్‌ భాస్కర్‌కుమార్‌ వద్దకు వెళ్లి ఇవ్వజూపగా, ఆయన తెలివిగా తప్పించుకొని సీసీకి ఇవ్వాలని సూచించారు. సీసీ సురేష్‌ను కలిసి ఆయన ఛాంబర్‌లో ఇవ్వాలని కాంతమ్మ నిర్ణయించారు. ఆ సమయంలో డీఎంహెచ్‌వో ఛాంబర్‌లో సీసీ ఉండడం, డబ్బులు తెచ్చానని కాంతమ్మ సైగ చేయడంతో లోపలికి పిలిచి డబ్బులు తీసుకొని డీఎంహెచ్‌వోకి ఇవ్వడం, ఆయన ఆ డబ్బులు జేబులో పెట్టడం, ఏసీబీ వచ్చి పట్టుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. విజిలెన్స్‌ కేసులు, ఏసీబీ ట్రాప్‌లు, పోలీసు కేసులు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు కొత్తకాదు. ఇప్పటి వరకు ఇక్కడ సూపరింటెండెంట్లుగా, డీఎంహెచ్‌వోలుగా పని చేసినవారిలో ఒకరిద్దరు మినహా ఫిర్యాదులు లేనివారు ఎవరూ లేరు. డీఎంహెచ్‌వోగా పనిచేసి పదవీ విరమణ చేసినా ఇప్పటికీ పింఛనుకు నోచుకోని డీఎంహెచ్‌వోలు కనీసం అరడజను మంది ఉన్నారు. కొత్తగా వచ్చిన డీపీఎం రవీంద్ర లాంటి వారికి ఇంకా ఈ వాసనలు అంటనందున డీఎంహెచ్‌వోను ప్రసన్నం చేసుకుంటే జిల్లా మొత్తం చక్రం తిప్పొచ్చన్న భావనతో అందరి నెత్తిన మొత్తి అన్నిటికీ రేటు ఫిక్స్‌ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి గతంలో పని చేసినవారి వద్దకు వెళ్లి తెలుసుకుంటే బాగుంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page