top of page

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో జీవితాలను మార్చే మాలిక్యూల్‌ చోరీ

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 19
  • 2 min read
  • సుమారు రూ.8 కోట్లు విలువ చేసే పౌడర్‌ మాయం

  • ఇంటిదొంగల కోసం గుంబనంగా వెతుకుతున్న యంత్రాంగం

  • గత పది రోజులుగా లభించని ఆచూకీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

టైప్‌-2 మధుమేహం ఉన్నవారి జీవితాలను మార్చే అత్యంత అరుదైన మాలిక్యూల్‌ను పైడిభీమవరంలో ఉన్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పది రోజుల క్రితం దొంగిలించారు. దీనిపై డ్రగ్‌ అథారిటీస్‌కు రెడ్డీస్‌ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఓవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వెతుకుతున్నారు. కానీ దేశంలో మొదటిసారి ఇటువంటి మాలిక్యూల్‌ను కనిపెట్టిన రెడ్డీస్‌ నుంచి ఈ పౌడర్‌ మాయమైందంటే.. దీనివెనుక కచ్చితంగా జాతీయ లేదా అంతర్జాతీయ కుట్ర ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి ఈ మాలిక్యూల్‌ను దొంగిలించిన వ్యక్తికి ఇది ఎంత విలువైనదో తెలియకపోవచ్చని, కేవలం డబ్బు కోసం, వేరేవారికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ పని చేసుంటారని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు పది రోజులుగా వెతుకుతున్నా దీని జాడ కనిపెట్టలేకపోతున్నారు. కారణం.. రూ.8 కోట్లు విలువ చేసే ఈ మాలిక్యూల్‌ మనకు మార్కెట్‌లో దొరికే ఖైనీ ప్యాకెట్‌ సైజులో ఉంటుంది. ఇప్పటికే ఇది రాష్ట్రం, లేదా దేశం దాటేసివుంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టైప్‌-2 మధుమేహం ఉన్నవారికి సెమాగ్లుడైట్‌ ఇంజక్షన్‌ లేదా మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అయితే దాన్ని భారతదేశంలో డెవలప్‌ చేయాలని అనేక ఫార్మా కంపెనీలు ప్రయత్నించి విఫలమయ్యాయి. రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉన్న అధునాతన పరిజ్ఞానం, టెక్నాలజీ వల్ల ఈ బయోసిమిలర్‌ మెడిసిన్‌లో ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ మందు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే మధుమేహం వల్ల దెబ్బతిన్న గ్రంధులు, టిష్యూస్‌ను రిపేర్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మార్కెట్‌లో ఉన్న మధుమేహపు మందులు ఒంట్లో షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడానికి మినహా, దీనివల్ల పాడైన టిష్యూలను, బలహీనపడిన గుండె, కిడ్నీ వంటి ఆర్గాన్స్‌ను మెరుగుపర్చడానికి ఉపయోగపడవు. కానీ ఇప్పుడు రెడ్డీస్‌ తయారుచేసిన ఈ మాలిక్యూల్‌ పెప్‌టైడ్‌ తరహాకు చెందినది. ఇది ప్రస్తుతం పౌడర్‌ రూపంలో ఉంది. నిండా ఖైనీ ప్యాకెట్‌ పరిమాణంలో ఉన్న ఈ పౌడర్‌ మార్కెట్‌లో దాదాపు రూ.8 కోట్లు విలువ చేస్తుంది. అంతకు మించి ఇది టాబ్లెట్‌, లేదా ఇంజక్షన్‌ రూపంలో ఎంతోమందికి ఉపయోగపడుతుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ సొంత ఫార్ములా తయారుచేయడం కోసం కొన్ని కోట్లు వెచ్చించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దీన్ని ఉంచినా దొంగిలించగలిగారంటే.. కచ్చితంగా ఇది ఇంటిదొంగ పనేనన్న అనుమానాలున్నాయి. దీన్ని దాచిన లాకర్‌కు బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు, డబుల్‌ ఎండ్‌ లాక్‌ ఉన్నప్పటికీ ఈ ఫార్ములా మిస్‌ అయిందంటే కచ్చితంగా దీనిలో పెద్దస్థాయి కుట్రే ఉందన్న అనుమానాలున్నాయి. ప్రైవేటుగా దేశంలో అనేక ల్యాబ్‌లు నడుస్తున్నాయి. రెడ్డీస్‌ లాంటి సంస్థలతో పాటు అనేక ఫార్మా కంపెనీలు తయారుచేసిన ఫార్ములాను టాబ్లెట్‌ గానో, ఇంజక్షన్‌ సీసాల్లోనో నింపి ఇవ్వడానికి ఇవి పని చేస్తుంటాయి. ఇప్పుడు ఈ ఫార్ములాకు సంబంధించిన మొత్తం రికార్డును తానే తయారుచేశానని, ఈ పెప్‌టైడ్‌ మాలిక్యూల్‌లో ఏది ఎంత కలిపితే మెడిసిన్‌ అవుతుందో తెలిసిన వ్యక్తే దీన్ని బయటకు దాటించివుంటారని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రణస్థలం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఈ పని మీదే బిజీగా ఉంది. పది రోజులైనా ఈ ఫార్ములా పౌడర్‌ను పట్టుకోలేదంటే అది కచ్చితంగా ఏదో ఒక సరిహద్దు దాటిపోయిందని భావించాల్సివుంది.

1 Comment


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page