top of page

డైట్‌నూ వదలరు.. డీఈవో సీటునూ వదలరు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 31
  • 3 min read
  • అధికార దర్పం.. అహంకారం ఆయన నైజం

  • ఆర్‌వీఎం పీవో పోస్టు నుంచి రాత్రికి రాత్రే తప్పించిన నాగులాపల్లి

  • పగడాలమ్మకు ప్రతీసారి మోకాలడ్డు

  • క్రిమినల్‌ కేసులున్నవారికి త్వరలో క్లీన్‌చిట్‌




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా విద్యాశాఖాధికారి సీటంటే ఆయనకు విపరీతమైన మోజు. జిల్లాలో ఉపాధ్యాయులపై సవారీ చేయడానికి అంతకు మించిన అవకాశం ఉండదనేది ఆయన భావన. అవకాశం దొరికిన ప్రతీసారి డీఈవో సీటులో కూర్చోవాలని ఆయన తహతహలాడుతుంటారు. అందుకే వైకాపా అధికారంలో ఉంటే డీఈవోగా పని చేస్తున్న వ్యక్తిపై టీడీపీ ముద్ర వేసి బయటకు పంపిస్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే తనకు మించిన స్వామిభక్తుడు ఎవరూ ఉండరని నిరూపించుకుంటారు. అందుకే రెగ్యులర్‌ డీఈవో పోస్టు ఖాళీ అయిన ప్రతీసారి అందులో తిష్ట వేయడానికి తిరుమలచైతన్య పడరాని పాట్లు పడుతుంటారు.

గత ఏడాది టెన్త్‌ స్పాట్‌ వాల్యూషన్‌ సమయానికి అప్పటి డీఈవో పగడాలమ్మ స్పాట్‌ వాల్యూషన్‌ క్యాంప్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌గా తిరుమల చైతన్య వ్యవహరించారు. అదే సమయంలో అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పగడాలమ్మ డీఈవో హోదాలో ఆయన్ను ఫాలో అయ్యారు. డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ హోదాలో టెన్త్‌ స్పాట్‌ వాల్యూషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన తిరుమల చైతన్య చేతులెత్తేయడంతో ఉపాధ్యాయ వర్గాలు డీఈవో పగడాలమ్మపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అదే సమయంలో తిరుమల చైతన్య పగడాలమ్మ సీటులో కూర్చున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఆమెకు అడ్మినిస్ట్రేషన్‌ చేతకాదని ప్రచారం చేసి, ఏకంగా ఆమె సీటులోకే వచ్చేశారు. విద్యాశాఖలో క్రీమ్‌ ఉన్న పోస్టులన్నీ తిరుమల చైతన్య చేశారు. డైట్‌ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా ఎప్పట్నుంచో వ్యవహరిస్తున్న తిరుమల చైతన్య అందుకు సంబంధించి అక్కడ ఏ వ్యవహారాన్నీ బయటపడకుండా ఇన్నాళ్లూ జాగ్రత్తపడుతూ వస్తున్నారు. అలాగే రాజీవ్‌ విద్యామిషన్‌ ఉన్నప్పుడు దానికి ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. నాగులాపల్లి శ్రీకాంత్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆర్‌ అండ్‌ బి బంగ్లాలో ఏం జరిగిందో తెలీదుగానీ, తిరుమల చైతన్యను ఆర్‌వీఎం పీవో విధుల నుంచి వెంటనే రిలీవ్‌ చేసేశారు. ఆ తర్వాత అడపా దడపా ఆయన డీఈవో పోస్టు చేస్తునే ఉన్నారు. ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌లో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు జరుగుతుంటే ఓ ఏడాది ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతీ ఏడాది మెయిన్‌ పరీక్షలకు సిటింగ్‌ స్క్వాడ్‌లుగా తన అనుయాయులను నియమించి ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్‌ మీద సవారీ చేస్తుంటారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలో కూడా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పేరుతో ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌లో డీఈవో అనుంగ ఉపాధ్యాయుడొకరు ఆమధ్య హల్‌చల్‌ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇంత జరిగినా డీఈవోగా తిరుమల చైతన్యను మాత్రం తప్పించే పనికి జిల్లా నాయకులు పూనుకోవడంలేదు. పగడాలమ్మను డీఈవోగా తేవాలని తాను భావించినప్పటికీ తిరుమల చైతన్య వచ్చారని సోమవారం తనను కలిసిన ఉపాధ్యాయ ఐక్యవేదిక ప్రతినిధుల ముందు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నా, డీఈవోను ఇక్కడి నుంచి తప్పించాలని మాత్రం ఆయన ఖరాఖండిగా విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజుకు చెప్పలేదు. ఉపాధ్యాయ సంఘ నేతల ముందే విజయరామరాజుకు ఫోన్‌ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యమబాట, విద్యార్థుల డిబారు వంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది కాబట్టి వెంటనే వీటిని క్లియర్‌ చేయాలని గట్టిగా చెప్పారు తప్ప డీఈవోను తప్పించండంటూ నొక్కి వక్కాణించలేకపోయారు. ప్రస్తుతం పదిమందిపై సస్పెన్షన్లను ఎత్తివేశారు. ఇక మిగిలిన నలుగురిపై క్రిమినల్‌ కేసులు, సస్పెన్షన్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఫోన్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు మిగిలిన నలుగురిపై కూడా క్రిమినల్‌ చర్యలు, సస్పెన్షన్లు రద్దు చేస్తారు తప్ప డీఈవో మీద చర్యలుండేవనే ప్రాథమికంగా అర్థమవుతుంది. చూసి రాయించడం కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.30వేలు మొదలు రూ.50వేలు వరకు ఇన్విజిలేటర్లు వసూలు చేశారని డీఈవో ఆరోపించిన నేపధ్యంలో దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే ముందు డీఈవోను తప్పించాలి. కానీ జులైలో పదవీ విరమణ చేయనున్న తిరుమల చైతన్య జోలికి ఇప్పుడు ప్రభుత్వం పోతున్నట్టు కనిపించడంలేదు. ఉపాధ్యాయ సంఘాలు సస్పెన్షన్లు, డిబార్లు, క్రిమినల్‌ కేసుల అంశంలో విద్యాశాఖ వెనక్కు తగ్గడంతో ఉద్యమ కార్యాచరణను విరమిస్తారో, లేదూ అంటే డీఈవోను తప్పించేవరకు కొనసాగిస్తారో తేలాల్సి ఉంది.

  • డీఈఓను విధుల నుంచి తప్పించండి

  • ఉపాధ్యాయులకు, విద్యార్థులకు న్యాయం చెయ్యండి

  • మంత్రి అచ్చెన్నకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వినతి

(సత్యంన్యూస్‌, టెక్కలి)

పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా అత్యుత్సాహంతో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉపాధ్యాయులను, విద్యార్థులను, భయభ్రాంతులకు గురి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్యను విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ కుప్పిలి ఆదర్శ పాఠశాలలో రెండు కేంద్రాల తనిఖీల సందర్భంగా డీఈవో స్క్వాడ్లు ఏర్పాటు నుంచి ఉపాధ్యాయుల సస్పెన్షన్స్‌, విద్యార్థుల డిబారు, క్రిమినల్‌ కేసుల వరకు ఎక్కడా నిబంధనలు పాటించలేదని వివరించారు. తన వ్యక్తిగత ఇమేజ్‌ కోసం తుంగలో తొక్కారని వివరించారు. డీఈవో అత్యుత్సాహంతో నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ప్రధానోపాధ్యాయులతో పాటు 12 మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారని, అందులో ఒక ప్రధానోపాధ్యాయుడితోపాటు నలుగురు ఉపాధ్యాయులపై 10వ తరగతి పరీక్షల నిర్వహణలో కనీవినీ ఎరుగని రీతిలో క్రిమినల్‌ కేసులు పెట్టారని తెలిపారు. విద్యార్థులను భయాందోళనకు గురిచేసి నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురిని డిబార్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కోసం ఉపాధ్యాయులు వేలకు వేలు రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికి తీసేందుకు వీలుగా డీఈఓను విధుల నుంచి తప్పించి జిల్లా కలెక్టర్‌ నాయకత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై పెట్టిన క్రిమినల్‌ కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా, డిబారైన ఐదుగురు విద్యార్థులకు వెంటనే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page