top of page

డామిట్‌.. కాపీ కథ ఎదురు తన్నిందే!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 26
  • 2 min read
  • అసలుకే ఎసరు తెచ్చిన డీఈవో ఓవర్‌ యాక్షన్‌

  • తన వెనుక లోపాలు కప్పిపుచ్చి డాంబికాలు

  • ఏకోన్ముఖంగా ఎదురుతిరిగిన ఉపాధ్యాయ లోకం

  • మంత్రి, కలెక్టర్‌ జిల్లాకు రాగానే చర్యలు

  • రిటైర్మెంటుకు ముందే అయ్యగారి పోస్టుకు ఎసరు?


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రచారం కోసం చేసిన ఓవర్‌ యాక్షన్‌ చుట్టూతిరిగి తన పీకకే చుట్టుకుంటుందని బహుశా ఆయన ఊహించి ఉండరు. కానీ ఇప్పుడదే జరిగేలా కనిపిస్తోంది. కుప్పిలి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌, మోడల్‌ స్కూల్‌ పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులు చూసిరాతలకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో 14 మంది ఉపాధ్యాయులను, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేసిన వివాదం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి డీఈవో కార్యాలయానికి, తిరుమల చైతన్య మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. డీఈవో హోదాలోనే జులైలో రిటైర్‌ కావాలని తిరుమల చైతన్య భావిస్తుంటే.. ఇప్పుడు ఆ సీటుకే ఎసరొచ్చింది. 14 మందిని ఎకాఎకిన సస్పెండ్‌ చేసి, వారిలో సగం మందిపై క్రిమినల్‌ కేసులు పెట్టి రాష్ట్రంలో తనంత నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి మరొకరు లేరని నిరూపించుకునే తాపత్రయంతో దుందుడుకుగా వ్యవహరించి జిల్లా ప్రతిష్టనే తాకట్టు పెట్టిన తిరుమల చైతన్యను డీఈవో పదవి నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. తిరుమల చైతన్య కావాలా? ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కావాలా? తేల్చుకోవాలని కోరుతున్నాయి.

ఉపాధ్యాయ వర్గాల తీవ్ర ఒత్తిడి

జిల్లాకు వేరొకరు డీఈవోగా వస్తే తనంత సమర్ధవంతంగా పని చేయలేరని, దాని వల్ల జిల్లాకు చెడ్డపేరు వస్తుందని, అలాగే పదో తరగతి ఫలితాల శాతం కూడా తగ్గిపోతుందని మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద సొంత డప్పు కొట్టుకొని ఇన్‌ఛార్జి డీఈవో పోస్టులో రిటైరయ్యే వరకు తానే ఉండేలా గట్టిచేసుకున్న తిరుమల చైతన్య కోరి కొరివితో తల గోక్కున్నారు. తన ఓవరాక్షన్‌తో పదవీ విరమణకు ముందు ఆ హోదా కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌లు విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్నందున సస్పెన్షన్ల వ్యవహారంపై రెండు రోజులుగా కదలిక కనిపించలేదు. ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణలో భాగంగా మంగళవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. పార్టీలు, అనుబంధాలకు అతీతంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, జిల్లాలో ఉన్న అందరు ఉపాధ్యాయులు, కుప్పిలి పరిసర గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని డీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో పాటు జిల్లా మంత్రి కూడా రెండు రోజులుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ వల్ల దీని మీద దృష్టి సారించలేకపోయారు. మంగళవారం సాయంత్రం టీచర్లు చేపట్టిన నిరసన జిల్లా మొత్తం మీద ఒక కదలి తీసుకువచ్చింది. కలెక్టర్‌ జిల్లాలోకి రాగానే చర్యలుంటాయని తెలుస్తోంది. ముందుగా సస్పెన్షన్‌, క్రిమినల్‌ చర్యలకు గురైన ఉపాధ్యాయుల విషయంలో కలెక్టర్‌ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకుంటారని భోగట్టా. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చుక్క పగడాలమ్మను డీఈవోగా తేవాలని స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే భావించారు. కానీ అప్పటికే ఇన్‌ఛార్జిగా ఉన్న తిరుమల చైతన్య మంత్రిని ఎలా బుట్టలో వేశారో తెలీదుగానీ పగడాలమ్మ రాకుండా అడ్డుకొని తానే కొనసాగుతూ వచ్చారు. అయితే పగడాలమ్మ కూడా ఈ ఏడాది జూన్‌లో రిటైర్‌ కానున్నారు. తిరుమల చైతన్యను పదవీ విరమణకు ఒక్కరోజు ముందైనా డీఈవో పదవి నుంచి తప్పించాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుపడుతున్నాయి. అదే సమయంలో పగడాలమ్మను ఇక్కడకు తేవాలని, ఎలాగూ జూన్‌లో రిటైర్‌ అయిపోతున్నారు కాబట్టి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఎవర్ని కావాలంటే వారిని డీఈవోగా నియమించుకోవచ్చన్న సందేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు పంపుతున్నాయి.

డీఈవో కార్యాలయమే అక్రమాల కేంద్రం

అసలు జిల్లాలో చూసిరాతలు జరిగినా, మాస్‌కాపీయింగ్‌ అని పేరు పెట్టినా, డీఈవో పరిభాషలో చెప్పాలంటే మాల్‌ప్రాక్టీస్‌ అని పేర్కొన్నా .. వాటన్నింటికీ కర్త, కర్మ, క్రియ డీఈవో కార్యాలయమే. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో 50 శాతం ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను క్విడ్‌ ప్రో కో పద్ధతిలోనే నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఆమదాలవలస హైస్కూల్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను శ్రీకాకుళంలో ఒక పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్లుగా నియమిస్తే, అదే శ్రీకాకుళంలోని పాఠశాల నుంచి ఆమదాలవలస హైస్కూల్‌ కేంద్రానికి ఇద్దరు ఇన్విజిలేటర్లను నియమించారు. అంటే.. ‘మా స్కూల్‌ నుంచి వచ్చిన విద్యార్థులను మీరు చూసుకోండి, మీ స్కూల్‌ నుంచి వచ్చిన విద్యార్థులకు మేం రాయిస్తాం’ అన్న పద్ధతిలో డీఈవో కార్యాలయమే నియమించింది. ఇటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది డీఈవో తిరుమల చైతన్యే. ఇప్పుడు వాటిని వదిలేసి చిన్నపాటి చూసిరాతల కేసును మాల్‌ప్రాక్టీస్‌ పేరుతో మసి పూసి మారేడుకాయ చేసి సస్పెన్షన్లు, క్రిమినల్‌ కేసులను పెట్టడం వేస్ట్‌.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page