డబ్బు కోసం వనాలను చంపేస్తారా?
- DV RAMANA
- Apr 4
- 2 min read

హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి కంచె గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల అటవీ భూముల వివాదం చిలికి చిలికి గాలివానై సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికైతే సద్దుమణిగింది. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేది కాదని స్పష్టమవుతుంది. పర్యా వరణానికి తీవ్ర కలిగించే ప్రమాదమున్నందున ఈ భూములను వేలం వేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని విద్యార్థులు, పర్యావరణ హితులు డిమాండ్ చేస్తున్నారు. ఆ భూములు యూనివర్సిటీవి కావు.. ప్రభుత్వానివే అనే వాదన అప్రస్తుతం. నిజంగా అవి ప్రభుత్వానివే అయినా కూడా వాటిని వేలం వేసి రియల్టర్లకో, బడా పారిశ్రామికవేత్తలతో అప్పగించే ప్రయత్నాలను, ఆలోచనలను మానుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అవి ఏ ఖాయిలా పడిన పరిశ్రమకు చెందిన భూములో, ఇతరత్రా పనికిరాని భూములో అయితే వాటి విష యంలో ఎవరికీ ఎలాంటి సెంటిమెంటూ ఉండదు. కానీ కంచె గచ్చిబౌలి భూములు దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ధరలు పెరిగినందున వాటిని అమ్ముకుంటే ఖజానా నిండి ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత తీరుతుందన్న ఆలోచన ఏమాత్రం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పరిస్థితులు తారుమారవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లా కాకుండా తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ముప్పైవేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండి దాదాపుగా మూడు నాలుగు లక్షల కోట్ల విలువ చేసే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ఏదో చిన్న రాగి చెంబు సంచిలో పెట్టేసుకున్నట్టుగా మోదీ ప్రభుత్వం పెట్టేసుకోబోతే.. ఇక్కడి తెలుగు వీరులు పరస్పరం ఆడిపోసుకుంటారే తప్ప సరుకు ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న మోదీని మాత్రం ఒక్కమాట అంటే ఒట్టు. అలాంటి మహావీరులే నాయకులుగా కలిగిన మహోన్నత నేల మనది. వారు ఎలాంటి వారైనా వాళ్లతోనే అంటకాగుతా మంటారు. కానీ మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో అలా కుదరదు. తేడా వస్తే కింద కూర్చోబెడ తారు. గోడ కుర్చీ వేయించేస్తారు. ఇంకా మొండికేస్తే పీఠం నుంచి దించేసి ఇంట్లో కూర్చోబెట్ట డానికీ వెనుకాడరు. అందుచేత జనం సెంటిమెంట్‌తో ముడిపడి ఉండే వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దుందుడుకుతనం కూడదు. ఈగోలకు అసలే పోకూడదు. మనలో మన మాట.. నిజంగా డబ్బే అవసరమైతే గనక అక్కడే ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళితే ఒక టీ ఇచ్చి మరీ అప్పు తెచ్చే పథకాలు అనేకం చెబుతాడు. ఒకవేళ అతను చెప్పకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఓ కారేసుకుని పక్కనే ఉన్న ఆంధ్రకు వచ్చేస్తే ఇక్కడి నేతలు జగను, చంద్రబాబు కూడా అప్పులు పుట్టించే విషయాల్లో ఆరితేరిన వాళ్లే. ఎన్ని లక్షల కోట్ల అప్ప యినా ఇట్టే పుట్టించగలరు. అలాంటి వారి సేవలను వాడుకొని హైదరాబాద్ యూనివర్సిటీ భూములను వదిలేయటం మంచిది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్ధులను పోలీసులు చితక బాదుతున్న దృశ్యాలు చూస్తుంటే 2003లో రైతులపై ఆనాటి ప్రభుత్వం ప్రదర్శించిన దాష్టీకం గుర్తుకొస్తుంది. కాల్పులు ఒకటే తక్కువ. ఆనాడు ప్రభుత్వం చేసిన ఆ తప్పిదానికి దాన్ని నడుపు తున్న రాజకీయ పార్టీ చాలానే నష్టపోయింది. ఇప్పుడు రాకరాక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశానికి ఒక దిక్సూచిలా పని చేసి, రాష్ట్రాన్ని ఒక రోల్‌మోడల్‌గా చూపించి ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడాల్సినది పోయి తెలంగాణలోనే శవపేటిక సిద్ధం చేసుకుంటోంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ మాత్రమే కాకుండా మొత్తం దేశం నష్టపోతుంది. దేశ రాజధానిలో రైతులను నెలల తరబడి కష్టపెట్టినా, వాటర్ క్యానన్‌లు ప్రయోగించి చెలాచెదురు చేసినా, ధర్నా చేస్తున్న రైతుల మీదికి జీపు తోలి వారి ప్రాణాలు తీసినా చేతికి మట్టి అంటకుండా బయటపడే సత్తా, అందుకు కావాల్సిన హంగులు లేని పార్టీ ఎంతో జాగ్రత్తగా, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి గానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అక్కడ ఉన్నది గుంటనక్కలు అనే తుత్తర మాటలు ప్రతీది శవపేటిక మీద కొట్టే మేకులా అవుతాయి. అందువల్ల హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంత త్వరగా మేలుకొంటే అంత మంచిది.
コメント