తత్వం బోధపడిందా సామీ!
- NVS PRASAD
- Feb 20
- 2 min read
చాలాకాలం తర్వాత జగన్‌ను కలిసిన ధర్మాన
బెట్టు వీడి పాలకొండ పయనం
అధ్యక్షుడి మార్పు సంకేతమే కారణం
చిన్ని పిలుపునకు స్పందించేవారేరీ?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

‘‘మరో రెండేళ్ల వరకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కాలేను.. ఇప్పుడు రోడ్డెక్కినా చేసేదేమీ లేదు.. కొన్నాళ్లు మీరు నడపండి.. లేదూ ఇన్‌ఛార్జిగా ఎవర్ని పెట్టినా పార్టీ ఇష్టం. నేనైతే ఇంత వేగం బయటకు రాలేను.’’ ఇదీ మాజీమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మాన ప్రసాదరావు 2024లో వైకాపా ఓటమి తర్వాత తన అనుచరులకు చెబుతున్న వ్యవహారం.
సీన్ కట్‌చేస్తే.. మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం పాలకొండ వచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు స్వయంగా ధర్మాన ప్రసాదరావే పాలకొండ వెళ్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, జిల్లాలో ధర్మాన యాక్టివ్‌గా లేకపోతే రాజకీయాలు చేయడం కుదరదంటూ స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ధర్మాన సోదరుడు కృష్ణదాస్ దగ్గర్నుంచి మొన్నటికి మొన్న పార్టీ నుంచి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి వరకు ఎంతోమంది ధర్మానను బతిమాలారు. కానీ పార్టీ వల్ల తాను నష్టపోయాను తప్ప, తన వల్ల పార్టీ నష్టపోలేదన్న భావనతో ఆయన ఇంతవరకు పార్టీ కోసం అడుగు బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు జగన్‌ను కలవడానికి స్వయంగా ఆయన తన మందీమార్బలంతో వెళ్తున్నారంటే.. కచ్చితంగా తెర వెనుక ఏదో జరుగుతోంది. ఆ వెనుక ఏమిటనేదే ఈ కథనం సారాంశం. శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయ నిర్మాణంపై స్టే ఉండటంతో అంతవరకు అద్దె కొంపలో కార్యక్రమాలు నడపడానికి అనువైన భవనాన్ని చూడటానికి పక్క జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ వచ్చారు కానీ, పక్కనే ఉన్న ధర్మాన ప్రసాదరావు మాత్రం వెళ్లలేదు. రెండున్నరేళ్ల వరకు తన ఊసు పట్టొద్దని ఆయన నేరుగానే చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే గురువారం పాలకొండకు జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారని, దీనికి కార్యకర్తలు తరలిరావాలంటూ ధర్మాన తనయుడు చిన్ని బుధవారం పిలుపునిచ్చారు. బహుశా ఈ పిలుపునకు నియోజకవర్గంలో పెద్దగా స్పందన కనిపించినట్టు లేదు. అయితే జగన్మోహన్‌రెడ్డికి జనంలో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని వేరేగా చెప్పనక్కర్లేదు. ఒకరు పిలుపునిస్తే రావడానికి, ఇవ్వకపోతే మానేయడానికి జనంతో జగన్‌కు వచ్చిన గొడవ ఎప్పుడూ లేదు. వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళితే, మిర్చియార్డు రైతుల వద్దకు వెళితే జనం పోటెత్తేశారు. అంటే.. జనంలో జగన్ ఇంకా పల్చబడలేదన్న సంకేతాలు సజీవంగానే ఉన్నాయని అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో పార్టీతో లేకపోతే జగన్మోహన్‌రెడ్డి ఎవర్నయినా వదులుకోడానికి సిద్ధంగా ఉంటారన్న విషయం స్పష్టమవుతుంది. తన ఆర్థిక గుట్టుమట్టులన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి వెళ్లిపోతేనే ఎందుకు, ఏమిటి అని జగన్మోహన్‌రెడ్డి అడగలేదు. అలాంటిది ఇప్పుడు ధర్మాన అలకబూనారని తెలుసుకున్న తర్వాత పాలకొండలో కనపడకపోతే కచ్చితంగా నియోజకవర్గంలో మరో నాయకుడ్ని తెచ్చిపెట్టడం ఖాయం. రాజకీయం ఒక వ్యసనం. ధర్మాన లాంటివారు ప్రతీ ఎన్నికలోనూ తనకు ఇదే చివరి ఎన్నికంటూ, జనానికి అక్కర్లేకపోతే దుకాణం సర్దేస్తానని చెబుతుంటారు. కానీ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా పోటీ చేస్తుంటారు. ఎప్పట్లాగే తాను మెట్టు దిగకుండా తన కొడుకుతో ఈ కార్యక్రమం నడిపించాలని ధర్మాన భావించారు. కానీ ఇంతలోనే సీన్ మారిపోయింది. పార్టీ అధికారం కోల్పోయినా జిల్లాలో మిగిలిన సీనియర్లు కూడా అసంతృప్తితో ఉండటం వల్ల ధర్మాన అలిగారని తెలిసినా పార్టీ బుజ్జగిస్తూ వచ్చింది. అందుకు కారణం.. ఆయన సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండటమే. జగన్మోహన్‌రెడ్డితో సమావేశం కావాల్సిన సందర్భంలో ప్రసాదరావు డుమ్మాకొట్టినా ఆరోగ్య కారణాలో, మరో కారణాలో అక్కడ చూపించి తమ్ముడ్ని కాచుకుంటూవచ్చారు. కానీ గడిచిన పది రోజులుగా ప్రసాదరావు ప్రభావం వల్ల కృష్ణదాస్‌ను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రపచారం ఊపందుకుంది. సొంత తమ్ముడినే పార్టీలో యాక్టివేట్ చేయని కృష్ణదాస్ వల్ల ఉపయోగం లేదనే వాదన బలంగా వినిపించింది. ఆయన్ను తప్పిస్తారని ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ విషయంలో జగన్ వెనక్కు తగ్గలేదని భోగట్టా. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా పార్టీ అధ్యక్ష పదవి తమ ఇంటిలోనే ఉంది కాబట్టి నెట్టుకొచ్చిన ధర్మాన ఇప్పుడు కృష్ణదాస్‌ను కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే జిల్లా వేరేవారి చేతికి వెళ్లిపోతుందన్న భావనతోనే తన సహజసిద్ధమైన బింకాన్ని విడిచి జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఎందుకంటే.. తన కుమారుడి సర్జరీ అనంతరం ఆమదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం అలకవీడి పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. మరోవైపు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నుంచి ధర్మాన ప్రసాదరావుకు ఎప్పటికైనా పదవి పరంగా త్రెట్ ఉంటుంది. ఈ విషయం ధర్మానకు తెలియంది కాదు. ఇప్పటికే ఆయన మనోభీష్టం మేరకు జిల్లాలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ లాంటివారు పొగబెట్టకుండానే పోయారు. ఇప్పుడు కూడా ధర్మాన పార్టీలో చురుగ్గా వ్యవహరించకపోతే జగన్మోహన్‌రెడ్డే తనను తోడ్కొని వెళ్లాలని భావిస్తే పార్టీ మరో నాయకత్వాన్ని వెతుక్కుంటుందన్న విషయం తెలియనంత జూనియర్ కాదు ధర్మాన ప్రసాదరావు. ఎన్నికల తర్వాత కేడర్ ఏమైపోయిందో కనీసం పట్టించుకోని ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు ఇప్పుడు జగన్ పర్యటకు పిలుపునివ్వడంపై శ్రేణులు పక్కున నవ్వుకున్నాయి. అందుకే ఈ బాధ్యతను స్వయంగా ధర్మానే భుజాల మీద వేసుకొని జగన్మోహన్‌రెడ్డి వద్దకు తరలివెళ్లారు. కొసమెరుపు ఏటంటే.. ఈ కార్యక్రమానికి చిన్ని వెళ్లలేదు.
Comments