top of page

తప్పులతో తిప్పలు.. మళ్లీ సర్వేతో కొత్త తలనొప్పులు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 17
  • 3 min read
  • పరిష్కారం చూపాలని వేలల్లో దరఖాస్తులు

  • గత లోపాలు సవరించని రెవెన్యూ అధికారులు

  • సర్వేయర్లనే బాధ్యులుగా చూస్తున్న హక్కుదారులు

  • గ్రామాల్లో ప్రారంభమైన రీ సర్వే


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

వైకాపా హయాంలో నిర్వహించిన భూముల రీసర్వేలో వెలుగు చూస్తున్న తప్పులతో భూహక్కుదారులు తిప్పలు పడుతున్నారు. సమగ్ర భూసర్వే అంతా అయోమయంగా మారిందని విమర్శిస్తూనే రీసర్వేకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ లక్ష్యాన్ని రెవెన్యూ అధికారులే నీరుగార్చారన్న ఆరోపణలున్నా క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపించడంలో విఫలమవుతున్నారు. రీసర్వేలో సమస్యలకు క్షేత్రస్థాయిలో పనిచేసిన గ్రామ సర్వేయర్లను బాధ్యులుగా భూహక్కుదారులు చూస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి పాస్‌బుక్‌ రావడం, రైతు పేరు, భూమికి సంబంధించి సర్వే నెంబర్‌, భూమి స్వభావం, వర్గీకరణ తప్పుగా నమోదు కావడం, జిరాయితీ భూమి ఇనాం భూమిగా నమోదయ్యాయి. ఉమ్మడిగా సాగు చేసుకుంటున్న భూమిని విభజించకుండానే జాయింట్‌ ఖాతాగా పెట్టడం, కొన్నిచోట్ల డి`పట్టా భూములను జాయింట్‌ ఎల్‌పీఎంగా చూపించారు. వివాదాలు ఉన్న భూములను పరిష్కరించకుండా భూ-హక్కు తెలియని ఖాతాగా నమోదు చేశారు. రైతులకు క్షేత్రస్థాయిలో భూమి ఉన్నా వేరే వ్యక్తుల పేర్లతో హక్కుల పత్రాలు ఆన్‌లైన్‌లో రావడం, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, ఒకే భూమిపై ఇద్దరికి హక్కుపత్రాలు ఇవ్వడం వంటి అనేక సమస్యలు గ్రామస్థాయిలో గుర్తించారు. వీటిని పరిష్కరించాలని గ్రామసభల్లో భూసమస్యలపై వచ్చిన అర్జీలు అన్నీ ఆన్‌లైన్‌ చేసిన రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాల వీఆర్వోలకు వాటిని పరిష్కరించే బాధ్యతను అప్పగించారు. అయినా ఇప్పటికీ పరిష్కారం చూపించలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాత సమస్యలకు పరిష్కారం చూపించకుండా కొత్త సమస్యకు అవకాశం కల్పిస్తున్నట్టు అవుతుందని భూహక్కుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేసిన తప్పులకు గ్రామ సచివాలయం సర్వేయర్లను బాధ్యులుగా రైతులు చూస్తున్నారు.

738 రెవెన్యూ గ్రామాల్లో సర్వే

రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి వైకాపా హయాంలో అధునాతన సాంకేతిక పరికరాలతో భూ రీసర్వే ప్రక్రియను 2020 నవంబర్‌లో ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,680 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. జిల్లాలో 1,465 రెవెన్యూ గ్రామాలకు గాను 738 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ వివాదాలపై గ్రామసభలు, రెవెన్యూ గ్రామసభల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల ఫిర్యాదులు ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా నమోదయ్యాయి. జిల్లాలో 30,669 ఫిర్యాదులు అందాయి. రీ`సర్వేలో భూ వివాదాలకు, తప్పులకు గత ప్రభుత్వంలో ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో పాటు అధునాతన సాంకేతిక పరికరాలపై కేవలం విలేజ్‌ సర్వేయర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చి మిగతావారిని విడిచిపెట్టేశారు. రీసర్వేపై రెవెన్యూ సిబ్బందికి పూర్తి అవగాహన, శిక్షణ లేకపోవడం, గ్రామం విస్తీర్ణం బట్టి రీసర్వే చేపట్టడానికి గడువు ఇవ్వకపోవడం, గ్రామ సర్వేయర్లపై ఒత్తిడి తేవడంతో తప్పులు దొర్లాయి. రీ`సర్వే పూర్తయిన తర్వాత భూ యాజమానులు అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు ఉండేది. అయినా వాటిని రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

ఆర్డర్స్‌ లేకుండానే రీసర్వే..

రీ`సర్వేను ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలు (ఎస్‌ఓపీ) ద్వారా డిప్యూటీ తహశీల్దార్లను రీసర్వే స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లుగా 2021 జూన్‌ 7న నుంచి మండలాల్లో నియమించింది. వీరికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌`1973 (1974లోని కేంద్ర చట్టం) ఏపీ సర్వే అండ్‌ బౌండరీస్‌ చట్టం`1923, భూమి, పట్టాదార్‌ పాస్‌బుక్‌ల్లో ఏపీ హక్కుల చట్టం`1971 కింద అప్పగించబడిన కొన్ని అధికారాలు సంక్రమింపజేశారు. సర్వే, బౌండరీస్‌ చట్టంలోని సెక్షన్‌ 26(2)కి సవరణ చేసి నియమాల ప్రకారం అధికారాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 17న జీవో 378 జారీ చేసింది. సర్వే చేసిన గ్రామంలో భూ సమస్యలన్నీ అప్పీల్స్‌ రూపంలో అర్జీలు తీసుకుని అర్జీదారులకు 30 రోజుల్లో స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలి. అయితే చాలాచోట్ల అప్పీల్స్‌, స్పీకింగ్‌ ఆర్డర్స్‌ లేకుండానే రీసర్వే ప్రక్రియ పూర్తయింది. దీంతో కూటమి ప్రభుత్వం రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలను తీసుకోవడం వల్ల భూ వివాదాలు, సమస్యలు వెలుగులోకి వచ్చాయి. రీసర్వేలో గ్రామ రెవెన్యూ అధికారులు సరైన బాధ్యత తీసుకోకపోవడం, లావాదేవీలు జరిగిన భూములు ‘మ్యుటేషన్స్‌’ చేయకపోవడం వల్ల భూమి విక్రయించిన రైతు పేరునే కొత్త పాసుపుస్తకాలు జారీచేశారు. భూమి స్వభావం, వర్గీకరణ, భూ యజమానుల పేర్లు, ఫోటోలు, వారి లాగిన్‌లో మాత్రమే చేయాల్సి ఉన్నా ఇప్పటికి ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. చాలామంది గ్రామ రెవెన్యూ అధికారులకు ఈ ప్రక్రియ ఎలా చేయాలో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో గ్రామ సరిహద్దులను, ప్రభుత్వ భూములు అన్నీ నిర్ధారించిన తర్వాత మండల స్థాయి సర్వే ఆఫీసర్‌ 30 శాతం, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ 5 శాతం ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అంతా సక్రమమే అని రూడీ చేయడం వల్ల రీసర్వే సమస్యలకు ఆజ్యం పోసింది.

మూడేళ్లలో రీ`సర్వే పూర్తి

రీ`సర్వే చేసే రాష్ట్రాలకు అప్పులు లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత కూటమి ప్రభుత్వం భూముల సర్వేపై మాట మార్చి పైలెట్‌ ప్రాజెక్టుగా మండలానికో గ్రామంలో రీ`సర్వే చేస్తామని ప్రకటించి జనవరి 20 నుంచి కార్యచరణ ప్రారంభించింది. దీనికంటే ముందు సర్వేరాళ్లపై జగన్‌ బొమ్ములను తొలగించే ప్రక్రియను పూర్తి చేసింది. జగన్‌ బొమ్మతో ముద్రించిన పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇవ్వడానికి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో రీ`సర్వే పూర్తి చేయనున్నట్టు ఇటీవల శాసనసభలో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు. రీ`సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని తెలిపారు. ఎలాంటి హడావిడి లేకుండా భూయజమానులందర్నీ ఒప్పించి ప్రతిష్టాత్మకంగా రీ`సర్వే ప్రాజెక్ట్‌ను మూడేళ్ల సమయంలో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page