top of page

దిల్‌ రూబా.. మనసుకు తాకలేదు

  • Guest Writer
  • Mar 15
  • 3 min read

దిల్‌ రూబా’ మూవీ రివ్యూ

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం- రుక్సర్‌ థిల్లాన్‌- ఖ్యాతి డేవిడ్సన్‌- జాన్‌ విజయ్‌- ఆనంద్‌- సత్య- ఆడుగళం నరేన్‌- తులసి- సమీర్‌- వాసు ఇంటూరి తదితరులు సంగీతం: సామ్‌ సీఎస్‌ ఛాయాగ్రహణం: డేనియల్‌ విశ్వాస్‌ నిర్మాతలు: విక్రమ్‌ మెహ్రా-మ సిద్దార్థ్‌ ఆనంద్‌ కుమార్‌- జొజో జోస్‌- రవి- రాకేశ్‌ రెడ్డి రచన-దర్శకత్వం: విశ్వ కరుణ్‌


తన ఫ్లాప్‌ స్ట్రీక్‌కు బ్రేకులేస్తూ గత ఏడాది ‘క’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం.. దిల్‌ రూబా. డెబ్యూ డైరెక్టర్‌ విశ్వ కరుణ్‌ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సిద్ధు (కిరణ్‌ అబ్బవరం) జీవితంలో ఒకేసారి రెండు గట్టి ఎదురు దెబ్బలు తిన్న కుర్రాడు. తన నుంచి సాయం పొందిన వ్యక్తే మోసం చేయడంతో సిద్ధు తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఆ సమయంలో తన వెంట నిలుస్తుందని ఆశించిన గర్ల్‌ ఫ్రెండ్‌ మ్యాగి (ఖ్యాతి డేవిడ్సన్‌) అతణ్ని అపార్థం చేసుకుని వేరే పెళ్లి చేసుకుని దూరమవుతుంది. దీంతో మనుషుల మీద.. ముఖ్యంగా అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుని ఉన్న ఊరు విడిచిపెట్టి మంగళూరుకు వెళ్లిపోతాడు సిద్ధు. అక్కడ అతడికి అంజలి (రుక్సర్‌ థిల్లాన్‌) పరిచయం అవుతుంది. ఆమెకు సిద్ధు నచ్చి తన వెంటపడుతూ ఉంటుంది. కొంత కాలానికి సిద్ధుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో.. సిద్ధు వ్యవహార శైలి వల్ల ఇద్దరి మధ్య సమస్యలు మొదలవుతాయి. తన తీరు మార్చుకోమని అంజలి ఎంత చెప్పినా సిద్ధు వినిపించుకోడు. దీని వల్ల అతనేం కోల్పోయాడు.. చివరికి అతను మారాడా లేదా.. చివరికి సిద్ధు-అంజలి జంట కలిసిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘’అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్‌ కు.. తప్పు చేశాక చెప్పే సారీకి నా దృష్టిలో విలువ లేదు’’.. ‘దిల్‌ రూబా’లో హీరో చెప్పే ఫిలాసఫీ ఇది. ఈ సినిమా నడిచేదే ఈ పాయంట్‌ మీద. కానీ ఎవ్వరైనా థ్యాంక్స్‌ ఎందుకు చెబుతారు? ఒక అవసరం తీరాకే కదా. మరి సారీ ఎప్పుడు చెబుతారు? తప్పు చేసినపుడే కదా. కాబట్టి ఈ డైలాగ్‌ లో లాజిక్‌ కనిపించదు. ‘దిల్‌ రుబా’లో హీరో పాత్ర చిత్రణ కూడా ఈ డైలాగ్‌ లాగే ఉంటుంది. తన జీవితంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుందని.. ఒకరు మోసం చేశారని.. ఇంకొకరు అపార్థం చేసుకున్నారని.. ఒక ఫిలాసఫీ రాసుకుని ‘’నేను థ్యాంక్స్‌ చెప్పను.. సారీ చెప్పను’’ అంటూ మొండిపట్టు పట్టుకుని కూర్చోవడం అర్థరహితంగా అనిపిస్తుంది. మూర?ంగా ప్రవర్తించే హీరో పాత్రతో కనెక్ట్‌ కావడం చాలా కష్టం. అలాంటపుడు ఆ పాత్రతో ఎలా ట్రావెల్‌ అవుతాం.. తన కథతో ఎలా రిలేట్‌ అవ్వగలం? అక్కడక్కడా కొన్ని ఇంట్రెస్టింగ్‌ సీన్లు ఉన్నా.. డైలాగులు పేలినా.. పాటలు కూడా ఆకట్టుకున్నా.. ఓవరాల్‌ గా చూస్తే ‘క’ తర్వాత కిరణ్‌ అబ్బవరం నుంచి ఆశించే సినిమా కాదు ‘దిల్‌ రూబా’.

‘దిల్‌ రూబా’లో ఒక సీన్లో హీరో అర్ధరాత్రి హీరోయిన్‌ తో కలిసి బీచ్‌ లో కార్లో కూర్చుని ఉంటాడు. అప్పుడక్కడికి పోలీసులు వస్తారు. ఎవరా అమ్మాయి అని సీఐ అడిగితే.. ‘’నా పెళ్లాం, బర్త్‌ డే చేసుకోవడానికి ఇక్కడికొచ్చాం’’ అంటాడు హీరో. అప్పుడు ఆ అమ్మాయి నా కూతురురా అంటూ చావు కబురు చల్లగా చెబుతాడు సీఐ. ఎంత బ్రాడ్‌ మైండెడ్‌ ఫాదర్‌ అయినా సరే.. అర్ధరాత్రి వేళ ఒక అబ్బాయితో బీచ్‌ లో తన కూతురు కనిపిస్తే ఎలా రియాక్ట్‌ అవుతాడో మనకొక అంచనా ఉంటుంది. కానీ ఆ తండ్రి మాత్రం కూల్‌ గా హీరోతో సంభాషణ జరుపుతుంటాడు. హీరోయిన్‌ ఇంకా కూల్‌ గా తండ్రి పక్కకు వచ్చి నిలబడుతుంది. వీళ్ల పాత్రలే ఇలా ఉన్నాయనుకుంటే.. తన మాజీ లవర్‌ లవ్‌ స్టోరీ ఇబ్బందుల్లో ఉందని దాన్నిచక్కబెట్టడం కోసం ఆర్నెల్ల ప్రెగ్నెంట్‌ అయిన అమ్మాయి యుఎస్‌ నుంచి ఇండియాకు వస్తుంది. ఆ మాజీ లవర్‌ కాలేజీలోనే గెస్ట్‌ లెక్చరర్‌ గా చేరుతుంది. తన ఇంట్లోనే తిష్ట వేస్తుంది. ఆమె భర్త.. భార్య మాజీ లవర్‌ కు ఫోన్‌ చేసి తను జాగ్రత్త బ్రో అంటాడు. ఇలాంటి పాత్రలు.. సన్నివేశాలు చూసి ఎలా రియాక్టవ్వాలో అర్థం కాదసలు. పాత్రలేమో ఇంత ‘అల్ట్రా మోడర్న్‌’గా ఉంటే.. ‘దిల్‌ రూబా’ కథేమో చాలా పాతగా అనిపిస్తుంది.

‘దిల్‌ రూబా’లో కేవలం ప్రేమకథ వరకు చూస్తే మెరుగ్గానే అనిపిస్తుంది. బ్రేకప్‌ తాలూకు బాధతో మొదలయ్యే హీరో కథ ఆరంభంలో ఆసక్తికరంగానే అనిపిస్తుంది. మొదట్లో కొన్ని సన్నివేశాలు.. డైలాగులు.. చూస్తే బాగా డెప్త్‌ ఉన్న లవ్‌ స్టోరీ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తాయి. మంగళూరు నేపథ్యంలో ప్లెజెంట్‌ విజువల్స్‌ తో కొంత వరకు దర్శకుడు సినిమాను బాగానే నడిపించాడు. రుక్సర్‌ థిల్లాన్‌ క్యారెక్టర్‌.. ఆమెతో హీరో జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్‌ చేస్తాయి. సత్య కామెడీ కూడా కొంత వర్కవుట్‌ అయింది. హే జింగిలి పాట కూడా హుషారుగా సాగడంతో తొలి గంటలో ‘దిల్‌ రుబా’ ఓకే అనిపిస్తుంది. ఐతే సాఫీగా సాగిపోతున్న ప్రేమకథలోకి విలన్ని తీసుకొచ్చి యాక్షన్‌ టచ్‌ ఇద్దామని చేసిన ప్రయత్నమే బెడిసికొట్టింది. ఇందులో విలన్‌ పాత్ర పేరు.. జోకర్‌. జాన్‌ విజయ్‌ చేసిన ఆ పాత్ర నిజంగా ‘జోకర్‌’ను తలపించేలా ఉంటుంది. మొదట్లో ఆ పాత్రకు ఇచ్చే బిల్డప్‌ కి.. తర్వాత ఆ పాత్ర ప్రవర్తించే తీరుకు అసలు పొంతన ఉండదు. ఈ కథలో ఆ పాత్ర అస్సలు సింక్‌ కాలేదు. విలన్‌ కనిపించినపుడల్లా చికాకు పుట్టేలా సాగుతాయి సన్నివేశాలు. ఓవైపు హీరో-హీరోయిన్ల మధ్య గొడవ.. ఎడబాటు.. అపార్థాలు.. ఇవన్నీ కూడా ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని విధంగా సాగుతుంటే.. ఇంకోవైపు విలన్‌ ట్రాక్‌ విసిగిస్తుంది. దీని వల్ల ద్వితీయార్ధంలో ‘దిల్‌ రూబా’ పూర్తిగా ట్రాక్‌ తప్పేసింది. ఇటు ప్రేమకథా చెడిపోయి.. అటూ యాక్షన్‌ టచ్‌ ఉన్న అంశాలూ రంజిపజేయక చివరికి ‘దిల్‌ రూబా’ రెంటికీ చెడ్డట్లు తయారైంది. ప్రథమార్ధంలో లవ్‌ స్టోరీ.. పాటలు.. కిరణ్‌-రుక్సర్‌ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల కోసం ‘దిల్‌ రూబా’పై ఓ లుక్కేయొచ్చు కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

కిరణ్‌ అబ్బవరం లవర్‌ బాయ్‌ పాత్రలో ఆకర్షణీయంగా కనిపించాడీ చిత్రంలో. ఇప్పటిదాకా కెరీర్లో తనకిది బెస్ట్‌ లుక్‌ అని చెప్పొచ్చు. ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. డ్యాన్సులు.. ఫైట్లలో ఆకట్టుకున్నాడు. కానీ ఆవేశం చూపించాల్సిన సన్నివేశాల్లో డైలాగ్‌ డెలివరీ మాత్రం పర్ఫెక్టుగా లేదు. రుక్సర్‌ థిల్లాన్‌ చూడ్డానికి బాగుంది. తన పెర్ఫామెన్స్‌ కూడా ఓకే. సెకండ్‌ హీరోయిన్‌ ఖ్యాతి డేవిడ్సన్‌ పర్వాలేదు. విలన్‌ పాత్ర చేసిన జాన్‌ విజయ్‌ గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన్ని ఇలాంటి పాత్రల్లో.. నటనతో చాలా సినిమాల్లో చూశాం. సత్య కామెడీ కొంత నవ్వించింది. కానీ ‘మత్తు వదలరా-2’ తర్వాత తన నుంచి ఇంకా ఎక్కువ నవ్వులు ఆశిస్తాం. ఆడుగళం నరేన్‌.. ఆనంద్‌.. తులసి.. సమీర్‌.. వీళ్లంతా పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం:

సామ్‌ సీఎస్‌ పాటల్లో ‘హే జింగిలి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా ఓకే. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో సామ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. లవ్‌ సీన్లలోనే కాక.. యాక్షన్‌ ఎపిసోడ్లలో కూడా బీజీఎం ఆకట్టుకుంటుంది. డేనియల్‌ విశ్వాస్‌ ఛాయాగ్రహణం ఓకే. మంగళూరు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్లెజెంట్‌ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ విశ్వ కరుణ్‌ ఎంచుకున్న కథలో ఏమంత కొత్తదనం లేదు. ఎగ్జిక్యూషన్‌ కూడా సోసోగా అనిపిస్తుంది. అతను డైలాగుల వరకు మెప్పించాడు. లవ్‌ స్టోరీ వరకు ఓ మోస్తరుగా డీల్‌ చేసినా.. ఈ కథకు యాక్షన్‌ టచ్‌ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో అతను గాడి తప్పేశాడు.


תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page