top of page

దివి నుంచి భువికి దిగిన అతిలోకసుందరి!

  • Guest Writer
  • 5 days ago
  • 2 min read

వెంకటేష్‌బాబు హీరోగా నటించిన ‘‘శత్రువు’’ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యాక ‘‘వాహినీ స్టూడియో’’లోని ఎడిటింగ్‌ రూంలో వర్క్‌ జరుగుతోంది. నేను అసోసియేట్‌ డైరెక్టర్‌, వి.ఆర్‌.ప్రతాప్‌ గారు కోడైరెక్టర్‌ (తరువాతికాలంలో నువ్వొస్తావని,నిన్ను చూడాలని, గోరింటాకు వంటి చిత్రాలకు దర్శకుడు). ఓ రీల్‌ రష్‌ మార్క్‌ చేసి వచ్చి వరండాలో కూర్చున్నాము. అక్కడ కూర్చుంటే ఆ పక్కా ఈపక్కా వుండే ఫ్లోర్లలో షూటింగ్స్‌ జరుగుతుంటాయి కనుక బైట హడావిడి, తెలుగు,తమిళ,మళయాల భాషల నటీనటులు తిరగడం అంతా కనిపిస్తుంటుంది. కన్నుల పండుగే. సడెన్‌ గా ఓ అద్భుత దృశ్యం మా కంట పడిరది. కుడివైపున వుండే మేకప్‌ రూంలనుండి .....రోజ్‌ కలర్‌ దుస్తులలో, ఎక్కడినుండో దిగివొచ్చిన దేవతలా ఒకామె నడిచొస్తోంది. అక్కడున్న పెద్దపెద్ద చెట్టు కొమ్మల మధ్యనుండి లేత ఎండ ఆమె మీద పడుతుండటంతో ఆమె దుస్తులపై కుట్టిన రోజారంగు పువ్వులకున్న చెంకీ మెరిసిపోతుంది. మా కళ్ళకు ఆమె తప్ప మిగతా పరిసరాలన్నీ ఒక్కసారిగా అవుట్‌ఫోకస్‌ అయిపోయాయి. ఇద్దరమూ ఆమేకదా అనుకున్నాం ఒకేసారి. అవును... ఇంకెవరు? మరెవరికుంటుంది అంతటి అందం....ఆమే... అతిలోకసుందరి ‘‘శ్రీదేవి’’ గారు.

ఆమె ఎడమవైపున ఉండే ఫ్లోర్‌లోకి వెళ్ళిపోయారు. ఇలా దూరంనుండి కాదు దగ్గరకువెళ్ళి చూడాలి అనుకొని ఫ్లోర్‌ దగ్గరకు వెళ్ళి ఓపెన్‌ చేసివున్న చిన్న డోర్లోనుండి లోపలికి వెళ్ళాం. కొంత చీకటిగావుంది. ఓ ప్రక్క ‘‘దర్శకేంద్రుడు’’ కుర్చీలో కూర్చునివుంటే, ఎత్తుగావున్న ప్లాట్‌ఫాం పైన డాన్సర్స్‌ మూమెంట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ‘‘ఆల్‌ లైట్స్‌ ఆన్‌’’ అనే ఓ అరుపుతో లైట్స్‌ అన్నీ ఒక్కసారిగా వెలగటంతో...... కళ్ళు జిగేల్‌మన్నాయి. బంగారు వర్ణంలో సెట్‌ అంతా మెరిసిపోతుంది. ఓ పక్క సీనియర్‌ కెమేరామెన్‌’’విన్సెంట్‌’’గారు ఏదో ఎఫెక్ట్‌ కోసం కెమేరా ముందు ఫిక్స్‌ చేసివున్న అద్దానికి వ్యూ ఫైండర్‌లోనుండి చూస్తూ వేలితో వ్యాస్‌లైన్‌ లాంటి జెల్‌ ఏదో రాస్తున్నారు. అప్పుడు చూశాం...మెరూన్‌ రంగు కోటువేసుకొని వున్న సుప్రీం హీరో ‘‘చిరంజీవి’’గారిని.

శ్రీదేవిగారు మెరిసిపోతూ కెమేరా ముందుకొచ్చారు. విజిల్‌ సౌండ్‌ తో స్పీకర్స్‌లో పాట మొదలైంది. ‘‘ప్రియతమా నను పలకరించు ప్రణయమా ...అతిధిలా నను చేరుకున్న హృదయమా’’ ఒక్క రెండు రిహార్సల్స్‌ తరువాత టేక్‌. మొదటి టేక్‌ ఓకే. సింపుల్‌గా స్టైల్‌గావున్నాయి స్టెప్స్‌. సినిమా పేరు చెప్పేదేముంది ‘‘జగదేకవీరుడు అతిలోకసుందరి’’.

డ్రెస్‌ఛేంజ్‌లు చేసిన ప్రతిసారీ వెళ్ళి చూసేవాళ్ళం. ఆ పాట అయినవెంటనే వేరే ఫ్లోర్‌లో వేసిన మరో సెట్‌లో ‘‘ధినక్‌తా...ఛమక్కురో’’ అనేపాట షూట్‌ చేశారు.

అప్పుడూ వెళ్ళి చూసేవాళ్ళం. అప్పటికి రెండురోజుల్లో ‘‘శ్రీదేవి’’గారి చెల్లెలి పెళ్ళట.షాట్‌ గ్యాప్‌లో ఆమె ఎవరెవరికో పనులు పురమాయిస్తూ కొంచెం హడావిడిగావుండేవారు. ఆ పాట జరుగుతున్నప్పుడు ‘‘చిరంజీవి’’గారికి జ్వరం అని చెప్పుకుంటుంటే విన్నాము. ఆ డెడికేషన్‌ కి ఆశ్చర్యపోయాము. నిబద్ధత కలిగిన కళాకారుల వ్యక్తిగత సమస్యలనో అనారోగ్యాలనో ఏ కెమేరా కన్నూ పట్టుకోలేదు.

(ఈ సినిమా స్టోరీలైన్‌(మూలకధ) రాసిన రైటర్‌’’శ్రీనివాసచక్రవర్తి’’గారు మొదటగా దానిని నాచేతనే ఫెయిర్‌కాపీ చేయించారు.) సినిమా రిలీజ్‌ ముందురోజు నేను తెనాలి వెళ్ళాను. రిలీజ్‌ రోజు ఉదయం ఆటకే బయల్దేరుతుంటే చల్లటి గాలులు ,చినుకులు మొదలయ్యాయి. గొడుగు వేసుకునిమరీ ‘‘రత్న టాకీస్‌’’ కివెళ్ళి సినిమా చూశాను. మొదటిపాట’’అందాలలో అహోమహోదయం’’ పాటతోనే ప్రేక్షకుడు పెట్టిన డబ్బులకుసరిపడా వర్క్‌అవుట్‌ అయిపోయింది మిగిలిన సినిమా అంతా బోనస్సే అనిపించింది.

దర్శకేంద్రుడి మ్యాజిక్‌ అది. నావరకూ నాకుతెలిసి తెరపైన ‘‘చిరంజీవి’’గారు ఎవరితో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నాసరే నా దృష్టి అంతా ఎప్పుడూ యనొక్కరిపైనేవుండేది. ఈ ఒక్క సినిమా పాటలు మాత్రం మినహాయింపు. జగదేకవీరుడు ,అతిలోకసుందరి ఇద్దరూ నా కళ్ళకు విందుచేశారు.

సినిమా పూర్తయ్యి బైటికొస్తే వర్షం దంచికొడుతుంది. అయినా ఎక్కడచూసినా గొడుగులు పట్టుకుని మ్యాట్నీ ఆటకోసం నిలబడ్డ జనం. నాటి సినీఅభిమానుల గుండెల్లో అప్పటికే జంరaామారుతంలా వీస్తోన్న ‘‘సుప్రీంస్టార్‌’’ గాలుల ముందు తుఫాన్‌ గాలులు వెలవెలబోయాయి. సినిమా కురిపించిన కనకవర్షం ముందు మేఘాలు కురిపించిన వర్షాలు తేలిపోయాయి.

‘‘నడవగలిగివున్నప్పుడే మరణించేవాళ్ళు అదృష్టవంతులు’’ అని ఎవరో అన్నట్లు ఎక్కడో చదివినగుర్తు. ఆలెక్కన ‘‘శ్రీదేవి’’గారు,మా ‘‘ప్రతాప్‌’’ గారు అదృష్టవంతులేనేమో.అయినా కళాకారులు వెళ్ళిపోయినా, వాళ్ళు సృష్టించిన కళ ఉండిపోతుందికదా.

(ఫోటోలో నా ప్రక్కన వున్నది మా ‘‘ప్రతాప్‌’’ గారే.)

- దేవీప్రసాద్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page