దివ్వెలతో రిలేషన్.. నియోజకవర్గంలో గ్రూపిజం.. జగన్ ఆదేశాలు పట్టనితనం.. అందుకే దువ్వాడ సస్పెన్షన్!
- NVS PRASAD
- 3 days ago
- 3 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కొన్ని ఫొటోలకు వ్యాఖ్యానాలక్కర్లేదు.. కొన్ని కథలకు ముందుమాటలు అవసరంలేదు.. జగన్మోహన్‌రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జిల్లాలో ఒక వెలుగు వెలిగి చివరకు ఎమ్మెల్సీగా ఎన్నికైన దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ ఎందుకు సస్పెండ్ చేసిందని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తాజాగా మంగళవారం రాత్రి వైకాపా హైకమాండ్ శ్రీనును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువరించిన తర్వాత సోషల్‌మీడియాలో మాత్రం దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి ఓడిపోయిన తర్వాత ఓ మొబైల్ ఫోన్ కొనుక్కున్నారని ఇప్పుడిప్పుడే దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురిల వీడియో క్లిప్పింగ్‌లు చూసి ఇన్నాళ్ల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారని కొందరు వ్యాఖ్యానిస్తే, ఇటీవల ఐ`న్యూస్‌లో దివ్వెల మాధురితో సహా ఇంటర్వ్యూకు వచ్చిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్‌ను పొగిడారని, అందుకే ఎప్పుడో దివ్వెల మాధురితో సహజీవనం విషయం జగన్మోహన్‌రెడ్డికి తెలిసినా ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కామెంట్లు పెడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి తెలిసినవారెవరికైనా ఆయన సస్పెన్షన్‌కు కేవలం ఏ ఒక్క కారణమో ఉండదని అర్థమవుతుంది. 2006లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో రెవెన్యూమంత్రిగా ధర్మాన ప్రసాదరావు చక్రం తిప్పేవారు. పేర్లల్‌గా దువ్వాడ శ్రీనివాస్ యువకుడు కావడం, దూకుడు స్వభావం ఉండటం వల్ల టెక్కలి నియోజకవర్గానికి ఎప్పటికైనా పనికొస్తాడన్న ఆలోచనతో డాక్టర్ రాజశేఖరరెడ్డి దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా వాత్సల్యం చూపించేవారు. అయితే ఇది ఏమేరకు అన్నది గ్రహించలేని శ్రీనివాస్ ఏకంగా ధర్మాన ప్రసాదరావు స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక జరిగితే కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న, అది కూడా ధర్మాన ప్రసాదరావు గురుతుల్యుడిగా భావించే టంకాల బాబ్జీని ఓడిరచడానికి నేరుగా రంగంలోకి దిగారు. కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం మద్దతుతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న ధర్మాన చిరకాల శత్రువు గొర్లె హరిబాబునాయుడుకు ఈ ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపించడం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్‌గా ఉన్నా, పార్టీ నుంచి సస్పెండయ్యారు. మళ్లీ ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి పెట్టిన పార్టీలో కూడా దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీగా ఉంటూ సస్పెండ్ కావడం యాదృచ్ఛికమో, విధి లిఖితమో కాదు. ఇది కేవలం ఆయన స్వయంకృతం. 1983 నుంచి టెక్కలి, అంతకు ముందు హరిశ్చంద్రపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక పార్టీ తరఫున దువ్వాడ శ్రీనివాస్, లేదా ఆయన మామ సంపతిరావు రాఘవరావు పోటీ చేస్తూవచ్చారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పని చేయని పార్టీ ఏదైనా ఉందీ అంటే.. అది జనసేనే. అంటే.. టెక్కలి నియోజకవర్గంలో ఆయనకున్న దూకుడే ఆయన బలం, ఆయన బలహీనత కూడా. ఆయన బలాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలని చూసిన జగన్మోహన్‌రెడ్డి 2019 నుంచి నిన్న రాత్రి వరకు శ్రీనివాస్‌కు ఇచ్చినన్ని అవకాశాలు ఈ జిల్లాలో మరొక వైకాపా నాయకుడికి ఇవ్వలేదు. శ్రీనివాస్ కూడా జగన్మోహన్‌రెడ్డి తన దేవుడని మాత్రమే ప్రతీచోటా ప్రకటించుకుంటూవచ్చారు. అలాంటి దేవుడే శ్రీనివాస్‌ను శపించాడంటే.. పార్టీ సిద్ధాంతాన్ని, క్రమశిక్షణకు ఎక్కడో ఒక దగ్గర భంగం కలిగేవుంటుంది. దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణితో పొరపొచ్చాలున్నాయని జగన్మోహన్‌రెడ్డికి ఎన్నికలకు ముందే తెలుగు. అందుకే ఆమెను టెక్కలి ఇన్‌ఛార్జిగా కూడా ప్రకటించారు. ఈ పొరపొచ్చాలకు కారణం దివ్వెల మాధురి అని కూడా తెలుసు. అయినా ఎన్నికలు జరిగి దాదాపు పది నెలలు అయినా, జిల్లా పార్టీ నేతలు శ్రీను వల్ల తాము తలెత్తుకు తిరగలేకపోతున్నామని ఘోషించినా పట్టించుకోని జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడెందుకు శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఇప్పుడు జిల్లాలో అందరి మెదళ్లను దొలిచేస్తున్న ప్రశ్న. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు ఇప్పుడు దేశంలో అడల్ట్రీ రిలేషన్‌షిప్‌కు బ్రాండ్ అంబాసిడర్లు. ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూసినా వీరిద్దరి హగ్గులు, ముద్దులు చూడలేక ఒక తరం సిగ్గుతో కుచించుకుపోతే, మరో తరానికి వీరి ఇన్‌స్పిరేషన్ అయిపోయారు. అయినా కూడా జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రేమపక్షులను విడదీయాలనుకోలేదు. కాకపోతే టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పేరాడ తిలక్‌ను నియమించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పని చేయాలని మాత్రం సూచించారు. అయినా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన చనువు కారణంగా ఎవరు ఎన్ని చేసినా, చివరిలో తననే ఇన్‌ఛార్జిగా ప్రకటిస్తారన్న ధీమా శ్రీనివాస్‌లో కనిపించింది. దాన్ని ఆయన చేతల ద్వారా చూపిస్తే, దివ్వెల మాధురి తన రాజాకే ఎన్నికల ముందు పగ్గాలిస్తారని, ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న వ్యక్తికి ఆ పదవి తాము వేసిన భిక్ష అని ఆమె ఓపెన్‌గానే ఎప్పటిలాగే ఓ యూట్యూబ్ ఛానల్ ముందు చెప్పుకొచ్చారు. ఇది కూడా జగన్మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లినప్పుడు చర్యలకు ఉపక్రమించలేదు. కానీ హైదరాబాద్‌లో రెండు షాపింగ్‌మాల్‌లు ఏర్పాటు చేసుకొని, అక్కడ పబ్లిసిటీ వ్యవహారాలు పూర్తయిన తర్వాత శ్రీకాకుళం వచ్చిన ప్రేమజంట తాజాగా టెక్కలి నియోజకవర్గంలో అనేక గ్రామాలు చుట్టేశారు. పనిలో పనిగా పెళ్లిళ్లు, పరామర్శలు చేశారు. చివరకు వైకాపా ఇన్‌ఛార్జి పేరాడ తిలక్ సొంత మండలం నందిగాంలో గోకర్ణపల్లి, సింగుపురం, కాపుతెంబూరు, మర్లపాడు, సుభద్రాపురం వంటి ప్రాంతాల్లో పర్యటించినా కూడా ఎక్కడా ఇన్‌ఛార్జికి సమాచారం ఇవ్వలేదు. అంతకు ముందే అడల్ట్రీ రిలేషన్‌షిప్‌లో ఉన్న దువ్వాడను పిలిపించి కామ్‌గా ఉండాలని, పార్టీకి నష్టపరిచే చర్యలకు పూనుకోవద్దని జగన్మోహన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఆయన జగన్ మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి రావడం తప్ప, మరో మార్గం కనపడలేదు. ఒకప్పుడు జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంటే దొరికితే చాలని భావించే వైకాపా నాయకులున్న రాష్ట్రంలో ఎప్పుడుపడితే అప్పుడు ముందస్తు సమాచారం లేకుండానే జగన్‌ను కలిసి వచ్చే దువ్వాడకు ఈమధ్య కాలంలో జగన్మోహన్‌రెడ్డి మొహం చాటేశారు. అప్పట్నుంచే ఈయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. 1983 నుంచి మధ్యలో 1999లో మినహా ప్రతీసారి ఏదో ఒక పార్టీ నుంచి దువ్వాడ శ్రీను కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అదే సమయంలో 1983 నుంచి 2009 మినహా కింజరాపు కుటుంబానికి అక్కడ తిరుగులేని పట్టు లభించింది. ఎన్ని పార్టీలు, ఎంతమంది నాయకులు దువ్వాడ శ్రీనుకు టెక్కలి నుంచి అవకాశం ఇస్తున్నా, ఆయన మాత్రం తన చేజేతులా తిన్న కంచాన్ని తన్నుకుంటున్నారు. అసలు దువ్వాడ శ్రీను వ్యవహారం జిల్లాలో తమకు తలనొప్పిగా మారిందని మొదటిగా జగన్మోహన్‌రెడ్డి మొహం మీద చెప్పిన వ్యక్తి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఇప్పుడు అదే రెడ్డి శాంతి వైకాపా క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా ఉంటుండగా, దువ్వాడ శ్రీనును సస్పెండ్ చేయడం కచ్చితంగా యాదృచ్ఛికమే. ఎంత సొంత పార్టీ అయినా సభ్యసమాజానికి కొత్త సందేశం, అదీ పెద్దల సభలో ఉంటూ పిల్ల చేష్టలు చేసే నాయకుడ్ని ఇన్నాళ్లూ పార్టీలో ఉంచినందుకు జనం ఏమనుకుంటున్నారో కూడా కొంచెం పట్టించుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉండకూదదు. ఓట్ల గోల పక్కన పెడితే, ఈ జంట సరసాలు సోషల్ మీడియాలో రీల్స్‌గా, వీడియోలుగా ఫ్రీగా చూడలేక జనం చచ్చారు. ఇవన్నీ ఇన్నాళ్లూ జగన్ దృష్టికి రాలేదంటే నమ్మడం కష్టసాధ్యం.

Comments