top of page

నాడు ఉత్తరాల అందజేతకు.. నేడు రాష్ట్రపతితో విందుకు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 17
  • 1 min read
  • ఏడాదిన్నరలో ఎంతమార్పు

  • ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం

  • ఎంపీ అప్పలనాయుడు ఆనందం


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఒకప్పుడాయన రాజకీయాల్లో సామాన్యుడు. ఒకానొక అంశంలో ప్రజల నిరసనలను నిక్షిప్తం చేసిన ఉత్తరాల కట్టలను రాష్ట్రపతి భవన్‌కు చేరవేసేందుకే చాలా శ్రమపడ్డారు.

ఇప్పుడు అదే వ్యక్తి అదే రాష్ట్రపతి భవన్‌ నుంచి అల్పాహార విందుకు ఆహ్వానం అందుకోవడం, రాష్ట్రపతితో కలసి అల్పాహారం స్వీకరించడం విశేషం. నాడు సామాన్య కార్యకర్తగా, నేడు ఎంపీగా ఉన్న ఆ వ్యక్తే కలిశెట్టి అప్పలనాయుడు.

నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో రణస్థలానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు సామాన్య కార్యకర్తగా ఉండేవారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు తాను సొంతంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేసి జైల్‌లో పెట్టడం పట్ల ప్రజల నిరసనను ఉత్తరాల రూపంలో సేకరించిన అప్పలనాయుడు వాటిని రాష్ట్రపతికి పంపారు. ప్రజల నుంచి సేకరించిన లక్ష ఉత్తరాల కట్టలను రణస్థలం నుంచి ఢల్లీికి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేర్చడానికి ఎంతో శ్రమించారు. ఎన్నో తనిఖీలను ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో తాను ఎంపీనవుతానని, ఆ హోదాలో రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొంటానని అప్పలనాయుడు ఏమాత్రం ఊహించలేదు. కానీ పార్టీ కోసం చేసిన కృషికి గుర్తింపుగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్యంగా అప్పలనాయుడును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం, ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగిపోయాయి. దాంతో కలిశెట్టి పార్లమెంటు వేదికగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కాగా కొన్నిగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులకు రాష్ట్రపతి విందు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆ మేరకు రాష్ట్రాలవారీగా ఎంపీలను అల్పాహార విందుకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఇచ్చిన ఈ విందులో పాల్గొన్న అప్పలనాయుడు గతంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తాను రాష్ట్రపతి భవన్‌కు ఉత్తరాల కట్టలు మోసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. అదే రాష్ట్రపతి తనను నేడు విందుకు ఆహ్వానించడం ప్రజాస్వామ్యం గొప్పతనంగా వర్ణిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌లకు, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page