నా మాటే శాసనం..
- BAGADI NARAYANARAO
- Apr 9
- 2 min read
మార్కెట్ తరలింపుపై అపోహలు వద్దు
వ్యాపారులకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం
జాబితా సిద్ధమైన తర్వాత ముందుడుగు
నిర్మాణానికి నిధులు సమకూర్చి తరలిస్తాం
ఎమ్మెల్యే గొండు శంకర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

తన మాటే శిలా శాసనమని, పెద్దమార్కెట్‌లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15 లోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్‌లో పర్యటించిన సందర్భంగా అధికారులకు ఆదేశించిడంపై వ్యాపారులంతా బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జాబితా తయారైన తర్వాత అందులో ఉన్న వ్యాపారులందరికీ స్థలాలు కేటాయింపుపై జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన హమీ వచ్చిన తర్వాతనే మార్కెట్‌ను తరలిస్తామన్నారు. మార్కెట్ తరలించేలోగా మూడు రకాల ప్లాన్‌లు తయారు చేయిస్తున్నామన్నారు. వీటిని మార్కెట్ వ్యాపారుల ముందు పెట్టి అందులో ఒక్క ప్లాన్‌కు అందరి సూచన మేరకు ఎంపిక చేస్తామన్నారు. భవిష్యత్తు తరలాకు ఉపయోగపడే విధంగా ఒక మోడల్ మార్కెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. కొనుగోలుదారులు, వినియోగదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా మార్కెట్‌ను నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. యుద్దప్రాతిపదికన పనులు చేపట్టి నిర్మాణం చేపడతామన్నారు. అయితే నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరిన తర్వాతనే ముందడుగు వేస్తామన్నారు. పెద్ద మార్కెట్‌లో వ్యాపారులంతా సమావేశమై మార్కెట్‌లో ఉన్న వ్యాపారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. దీన్ని వ్యాపారుల సమక్షంలో చదివి జాబితాలో చేర్చినవారి పేర్లు చదవి ఫైనలైజ్ చేస్తానన్నారు. జాబితా సిద్ధమైన తర్వాతనే మార్కెట్ తరలింపు ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా షాపులు కేటాయింపు ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు అవకాశం ఇవ్వనన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మార్కెట్‌లోకి వెళ్లి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని, సమాచారం వచ్చిన వెంటనే ఆయన్ను వెనక్కి పిలిపించినట్టు తెలిపారు.
నేను మాట్లాడలేదు
మార్కెట్ విషయంలో తాను ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదన్నారు. అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని వ్యాపారులకు సూచించారు. కల్లబొల్లి మాటలు ఎవరూ నమ్మొదన్నారు. అరసవల్లిలో ఆదిత్యుని దేవాలయం అభివృద్ధి పనుల్లో ఏ మాదిరిగా 16 మంది నిర్వాసితులకు భరోసా ఇచ్చి అండగా నిలిచానో అదే మాదిరిగా మార్కెట్‌లో ఉన్న వ్యాపారులందరికీ న్యాయం చేస్తానన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఎప్పటి నుంచో పెద్దమార్కెట్‌కు రావాలని నిర్ణయించినా, సమయాభావం వల్ల తనని వెళ్లి రావాలని సూచించినట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. మార్కెట్‌ను పరిశీలించిన సమయంలో ఎదురైన అనుభవాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేశానన్నారు. మార్కెట్‌కు ఒక మంచి రూపం తీసుకురావాలని వ్యవసాయ, మార్కెట్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉందని, బడ్జెట్‌లో అందుకు అవసరమైన నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఇటీవల మార్కెట్‌లో పర్యటించి ఈ నెల 15లోగా మార్కెట్‌లో అందరు వ్యాపారులను ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారని, అయితే ఆయన చెప్పిన తేదీ నాటికి ఖాళీ చేయించడం సాధ్యం కాదని అందరికీ తెలుసన్నారు. వీలైనంత తొందరగా ఖాళీ చేస్తే పనులు త్వరితగతిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మంత్రి అచ్చెన్నాయుడు ఈ నెల 15వ తేదిని నిర్ణయించారని, అదే రోజుకు ఖాళీ చేయాలని వ్యాపారులపై ఒత్తిడి తేవడం లేదన్నారు. మార్కెట్ అభివృద్ధికి మంచి అవకాశం వచ్చిందని, దీనిపై వ్యాపారులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వైకాపా నాయకులు ఐదేళ్లు మార్కెట్‌ను పట్టించుకోలేదని, వైకాపా నాయకులు సవతి తల్లిప్రేమను నమ్మొద్దని వ్యాపారులకు సూచించారు.
నేను పక్కా లోకల్
తాను పక్కా లోకల్ వ్యక్తినని, ప్రజల మధ్యే 24 గంటలూ అందుబాటులో ఉంటున్నానని, రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించడానికి, అధికారదర్పం చూపించడానికి, విలాసాలు చేయడానికి రాలేదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ‘నన్ను గెలిపించాలని కోరాను, గౌరవించి భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిపించినందుకు అందరికీ మంచి చేయాలనే దృక్పధంతో పని చేస్తున్నాను. నేను అక్రమాలకు పాల్పడడం లేదు, నేను ఎవరి భూములు ఆక్రమించుకోలేదు, సెటిల్మెంట్‌లు చేయడం లేదు, ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయడం లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతోమందికి వ్యక్తిగతంగా సాయం అందించాను. సాయం అందుకున్నవారికి తెలుసు నేను చేసానని’ అంటూ ఎమ్మెల్యే శంకర్ భావోద్వేగంతో మాట్లాడారు. ఎవరి మాటలూ నమ్మొద్దని, నేరుగా తనని కలిసి మాట్లాడాలని సూచించారు. సమావేశంలో పెద్ద మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments