నోరుజారొద్దు - సంకీర్ణ ధర్మం తప్పొద్దు
- DV RAMANA
- Mar 20
- 2 min read

సంకీర్ణ రాజకీయాలపై ప్రజలకు స్పష్టత ఉన్నా నాయకులకే స్పష్టత రావడం లేదని అపుడపుడు జరిగే సంఘటనలు చెప్తున్నాయి. డబ్బుకు ఓట్లు ఆమ్మేసుకుంటున్నారని ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనా పరులు చికాకుపడిపోతున్నా.. ఓటర్లలో డబ్బుతీసుకునే అలవాటు పెరుగుతున్నా స్థూలంగా ఓటర్ల పరిణతి పెరుగుతూనే ఉంది. డబ్బుతీసుకుంటున్నా వారు దానికి అమ్ముడుపోవడంలేదని ప్రతి ఎన్నికా సూచిస్తూనే ఉంది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేనపుడు కొన్ని పార్టీల కలయికతో ఏర్పడేవే సంకీర్ణ ప్రభుత్వాలు. ఎన్నికలకు ముందు ఒక అవగాహనతో కొన్ని పార్టీలు కలిసి సీట్లు పంచుకుని పోటీ చేయడంలో రాజకీయ నిబద్ధత ఉంది. జగన్ పాలన అంతమే అజెండాగా 2024 ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీలో కూటమిగా పోటీ చేసి విజయం సాధించాయి. ఉమ్మడి కార్యక్రమాలు చేపట్ట డం, విభేదాలు వచ్చినపుడు పరిష్కరించుకోవడం వంటి అంశాలే పొత్తులు లేదా కూటములను నిలబెడు తుంది. ఎన్నికలకు ముందే పొత్తులు కుదుర్చుకోవడం, రాజకీయ అనివార్యతలను బట్టి ఫలితాల తర్వాత పొత్తులు కుదర్చడంలో చంద్రబాబు కంటే ఎక్కువగా చక్రం తిప్పిన వారు లేరు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే గుర్తింపు, గౌరవం తీసుకువస్తే.. సంకీర్ణ రాజకీయాలకు దశదిశలు నిర్దేశించిన చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా చేసి ప్రతిష్ట పెంచారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం పెంచడానికి, అధికార పదవుల్లో నియామకాలకు సంబంధించి చంద్రబాబు రూపొందించిన దామాషా ఫార్ములాను మూడు పార్టీలు అమలు చేస్తున్నాయి. వ్యక్తిగత రాగద్వేషాలను పక్కన పెట్టి చంద్రబాబు బీజేపీ నుంచి సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేయడం, ముందు ఇచ్చిన హామీని పక్కన పెట్టి సొంత పార్టీకి చెందిన పిఠాపురం వర్మకు మొండిచెయ్యి చూపిం చడమూ సంకీర్ణ ధర్మంలో భాగమే. జనసేన ఆవిర్భావ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన ‘ఖర్మ’ వ్యాఖ్య కొంత అలజడి సృష్టించినా దానివల్ల కూటమికి బీటపడే పరిస్ధితి లేదు. అయినా ఇలాంటివి పునరావృతం కాకుండా నాయకులందరూ చూసుకోవాలి. పవన్‌కల్యాణ్ విజయానికి పిఠా పురం నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి వర్మ, జనసేన నుంచి నాగబాబు విశేషంగా కృషి చేశారు. ఆ సందర్భంలో రెండు పార్టీల కేడర్‌లో సహజంగా ఉండే ఆధిపత్య భావన అభిప్రాయ బేధా లకు మూలమై ఉండవచ్చు. పార్టీల పరంగా వర్మ నియోజకవర్గ నాయకుడు. నాగబాబు రాష్ట్రస్థాయి నాయకుడు. సభలో నాగబాబు తన పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఖర్మ వ్యాఖ్య ద్వారా విష యాన్ని పెద్దది చేశారు. ఇది ఆయనకు, పార్టీకి ఉపయోగపడకపోగా ‘ఏరుదాటి తెప్ప తగలేస్తారా’ అనే భావన కలిగించింది. వర్మకు రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి తెచ్చిపెట్టింది. అంతర్గతంగా ఏం జరిగినా ప్రజలకు తెలీదు. బహిరంగ వ్యాఖ్యలే ఇబ్బందికర పరిస్ధితులు తీసుకొస్తాయి. ‘మాట పొదుపు నోరు అదుపు’ సూత్రాన్ని ఏ నాయకుడూ మరచిపోకూడదు. సంకీర్ణ రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం. అనేక పరిమితుల మధ్య అధికారాలను అనుభవించడం సంకీర్ణ రాజకీయాల్లో పెద్ద ఛాలెంజ్. దీన్ని అర్ధం చేసుకున్నవారు సమర్థులైన నాయకులవుతారు. లేకపోతే స్వల్పకాలంలోనే ఓటమి తప్పదు. ఇలాంటి పరిణామాలు ప్రభుత్వాల పతనానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. కూటమికి ఇంకా ఏడాది నిండలేదు. ఇప్పటి నుంచే భాగస్వామ్య పార్టీలు, నాయకులు మరింత సంయమనంతో వ్యవహరించకపోతే దాదాపు 40% ఓటుబ్యాంకు ఉన్న జగన్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలోని వేలు, లక్షల మందికి ఏ పార్టీ మీదా ప్రత్యేకమైన అభిమానమూ లేదు. వ్యతిరేకతా లేదు. కాకపోతే గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే కూటమికి ఓటు వేశారన్నది వాస్తవం. 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను తెలుగుదేశం పార్టీ 135 స్థానాలు గెలుచుకోగా, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంటే అప్పటివరకు అధికారంలో ఉన్న వైకాపా 11 స్థానాలకే పరిమిత మైంది. అయితే ఓట్లపరంగా చూస్తే.. కూటమికి 1,86,56,300 ఓట్లు (55.29%) వచ్చాయి. వీటిలో టీడీపీకి 1,53,84,576 (46.6%), జనసేనకు 23,17,747 (6.86%), బీజేపీకి 9,53,957 (2.83%) ఓట్లు వచ్చాయి. మరోవైపు వైకాపాకు 1,32,84,134 (39.37%) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,80,613 మంది ఓట్లు (1.72%) వేయగా, నోటాకు 3,96,320 మంది (1.09%) ఓట్లు వేశారు.ఈ లెక్కలు చూస్తే అతి తక్కువ సీట్లు పొంది అధికారం కోల్పోయిన వైకాపా ఓట్లపరంగా కాస్త బలంగానే ఉన్న విషయం గుర్తెరిగి కూటమి పార్టీలు సంయమనం పాటించాలి.
Comments