నక్షత్ర తాబేళ్ల రక్షణ ప్రభుత్వం బాధ్యత
- Prasad Satyam
- 3 days ago
- 2 min read
కూటమి ప్రభుత్వానికి పాపం చుట్టుకోవడం ఖాయం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
శ్రీ కూర్మనాథ ఆలయాన్ని పరిరక్షించి, నిత్యాన్నదానానికి శ్రీకారం దిద్దింది ధర్మాన ప్రసాదరావు
ఇప్పుడు కూటమి నాయకులు ఆలయ పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సుప్రసిద్ధ శ్రీకూర్మ క్షేత్రంలో గతంలో మాదిరిగా నక్షత్ర తాబేళ్ల పరిరక్షణ కానీ, ఆలయ నిర్వహణ కానీ లేదని, ముఖ్యంగా కూటమి సర్కారు అధికారం అందుకున్నాక ఆలయానికి మునుపటి ప్రాభవం లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం ఆరోపించారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌తో సహ ఇతర కూటమి ప్రభుత్వ పెద్దలు చిత్తశుద్ధి లేకుండాను, ఆలయ యంత్రాంగంలో బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శ్రీకూర్మ క్షేత్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలకు సంబంధించి ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖమంత్రిగా ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో శ్రీకూర్మం ఆలయ పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఆలయంలో నక్షత్ర తాబేళ్ల రక్షణ దగ్గర నుంచి నిత్యాన్నదాన నిర్వహణ వరకూ ఏ ఒక్క కార్యక్రమం హైందవ సంస్కృతికి అద్దం పట్టడం లేదని ఆవేదన చెందారు. నాడు తన వంతుగా దాతల సాయంతో రూ.1.12 కోట్లు సేకరించి ఆ మొత్తాలతో నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం దిద్దిన ఘనత ధర్మాన ప్రసాదరావుదేనని, ఇప్పుడు అలాంటి మంచి కార్యక్రమాలు ఒక్కటి కూడా లేదని వాపోయారు. గాల్లో హామీలు ఇవ్వడం తప్ప కూటమి సర్కారు చేస్తున్నదేమీ లేదని పెదవి విరిచారు.
ఆలయ ప్రాంగణంలో నక్షత్ర తాబేళ్ల ఖననం మహా పాపమని, ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన వారిని వదలవద్దని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలకు ఎవ్వరు పాల్పడినా ఉపేక్షించకూడదని అన్నారు. నాడు వైకాపా ప్రభుత్వంలో పుష్కరిణిలో పూడిక తీత, ఆలయ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం, నిత్యాన్నదాన భవనం ఏర్పాటుతో పాటు, మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టారని, అలానే 9 మంది పాలక మండలి సభ్యులు, ఒక ప్రత్యేక ఆహ్వానితునితో కూడిన పాలక మండలిని కూడా నియమించారని, వీరంతా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయ అభివృద్ధిని విస్మరించారని పెదవి విరిచారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అని, శ్రీ మహావిష్ణువు అవతారాలలో అతి ముఖ్యమైన అవతారం ఉన్న ఆలయం ఇదని, గొప్ప హైందవ సంస్కృతికి ఆనవాలుగా నిలిచే ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
ఇటీవల ఇచ్ఛాపురం నియోజకవర్గం బారువలో బీచ్ ఫెస్టివల్ చేసి, తాబేళ్ల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉండే నక్షత్ర తాబేళ్ల రక్షణకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని, వాటి పోషణ, రక్షణను విస్మరించారని ఆవేదన చెందారు. తాబేళ్లు సరైన రీతిలో పోషణ, రక్షణ లేక చనిపోయాయని భావిస్తున్నామని, ఇందుకు కారణమైన అధికారులు, కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పురుషోత్తం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ముఖ్యంగా గోవులు, తాబేళ్ల పరిరక్షణకు సమర్థ రీతిలో చర్యలు చేపట్టాలని ఆ ప్రకటనలో కోరారు.
Comments