పీఎన్ కాలనీలో చోరి
- ADMIN
- Sep 19, 2024
- 1 min read
ఇంట్లో లేరని గుర్తించి దోపిడి
భారీగా బంగారం, నగదు అపహరణ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పీఎన్ కాలనీ పదో లైన్‌లో డోర్ లాక్ వేసిన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు తెరిచి చొరబడి భారీగా బంగారం, నగదు అపహరించుకుపోయారు. బుధవారం అర్ధరాత్రి చోరి జరిగినట్టు ఎచ్చెర్ల పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని సీహెచ్ రామూర్తి బూర్జ మండలం కొల్లివలస ఏపీ రెసిడెన్సియల్ స్కూల్‌లో మ్యాథ్స్ అసిస్టెంట్‌గా, ఆయన భార్య రమాదేవి కోటబొమ్మాళి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. వీరిద్దరూ వ్యక్తిగత పనులపై ఈ నెల 14న బెంగళూరు వెళ్లారు. ఇంటి ప్రహరీ గేట్ తాళాలను మాత్రమే పని మనిషికి అప్పగించారు. ప్రతిరోజు పనిమనిషి వాకిలి కడిగి ముగ్గు వేసి వెళ్లిపోతుండేది. గురువారం ఏడు గంటలకు రోజు మాదిరిగానే గేటు తాళం తీసి లోపలికి వచ్చింది. అప్పటికే గ్రిల్స్ ప్రధాన ద్వారం తీసివుంది. ఇంటి యజమాని వచ్చారేమోనని బయటి నుంచే కేకలు వేసింది. ఎవరూ స్పందించకపోవడం, ప్రధాన ద్వారం కొంత డేమేజ్ కావడంతో పొరుగున ఉన్నవారికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు బెంగళూరులో ఉన్న రమాదేవికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె ఆమదాలవలసలో టీచర్‌గా పనిచేస్తున్న సోదరికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయిన డేటాను సేకరించారు. దుండగులు ఇంట్లో చొరబడి రెండు బెడ్‌రూంల్లో ఉన్న అల్మరాలను, రెండు బీరువాలను తెరిచి బంగారం, నగదు అపహరించుకుపోయారు. బీరువాలు, అల్మరాల్లో బట్టలను, వస్తువులను చిందరవందర చేసి విలువైన వస్తువులను దోచుకొని పోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి యజమానులు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇంట్లో చోరి జరిగిన విషయం తెలిసిన రామూర్తి, రమాదేవి దంపతులు బెంగళూరు నుంచి హడావుడిగా బయలుదేరి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం చేరుకొని ఫిర్యాదు చేయనున్నట్టు పోలీసులకు తెలిపారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఎంతమేర బంగారం, నగదు అపహరణకు గురైందో తేలనుంది.
Kommentare